ఎపిలో చుక్కలు చూపిస్తున్న రవాణా అధికారులు

అధిక మొత్తంలో జరిమానలు విధింపులపై ఆందోళన 

అమరావతి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ఏపీలో రూల్స్‌ బ్రేక్‌ చేసిన వాహనదారులకు రవాణాశాఖ అధికారులు చుక్కులు చూపిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను లైట్‌ తీసుకుంటే జేబుకు భారీగా చిల్లు పెడుతున్నారు. హెల్మెట్‌ ధరించకుండా బైక్‌ తో రోడ్డుపైకి వస్తే  గతంలో  మాదిరిగా వంద రూపాయలు చెల్లించి వెళ్లిపోదామంటే కుదరదు. ఇక నుంచి వెయ్యి కట్టాల్సిందే.కారులో సీటు బెల్ట్‌ పెట్టుకోకపోయినా వెయ్యి రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.గూడ్స్‌ ఆటో, లారీల్లో పరిమితికి మించి ఎక్కువ ఎత్తులో సరుకు తీసుకెళ్తుంటే 20 వేలు చెల్లించాలి. రవాణాశాఖ కొద్దిరోజులుగా జరిమానాల్ని వసూలు చేస్తుండగా వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం సాప్ట్‌ వేర్‌ లో నమోదుచేసిన మేరకే జరిమానాలు వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు రహదారి భద్రతలో భాగంగా కేంద్రం మోటారు వాహన సవరణ చట్టం 2019 కింద జరిమానాలు పెంచింది.