ఎపిలో జిల్లాల విభజనపై ఆగని ఆందోళనలు

మార్కాపురం కోసం సాధనా సమితి ర్యాలీ

విజయవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ఏపీలో జిల్లా విభజన అంశంపై అభ్యంతరాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్లా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని పలు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కార్పెంటర్స్‌ అసోసియేషన్‌ ర్యాలీ నిర్వహించింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద దీక్షలో పాల్గొన్నారు. అటు ఎర్రగొండపాలెంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత తాసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కనిగిరిలో స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలోకి వామపక్ష నేతలు బలవంతంగా దూసుకుపోయి మార్కాపురాన్ని జిల్లాగా చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అద్దంకి మండలాన్ని ప్రకాశంలోనే కొనసాగించాలని కోరుతూ ప్రజాసంఘాలు ర్యాలీ నిర్వహించాయి. వీరికి టీడీపీ, వాపపక్ష నేతలు సంఫీుభావం ప్రకటించారు. మరోవైపు కృష్ణా జిల్లాలోని మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌజ్‌ వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో రీలేదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం మెడలు వంచైనా మైలవరం డివిజన్‌ను సాధిస్తామని ఉమా స్పష్టం చేశారు. కడప జిల్లాలోని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ, లేనిపక్షంలో బాధ్యత వహిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ నేత చెంగల్రాయుడు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ గౌతమికి 1600 వినతులను అందజేశారు.