వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు
హైదరాబాద్: మూడో దశలో సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్బీనగర్, ఆల్వాల్‌లో నెలకొల్పనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు త్వరలోనే సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. కొత్త ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాలపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో వైద్య మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రెండో దశలో భాగంగా నిర్మిస్తున్న ఎనిమిది కొత్త వైద్యకళాశాలలను 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వరంగల్‌లో ఆరోగ్య నగరంలో స్పెషాలిటీ వైద్యం కోసమే 1,200 పడకలు ఉంటాయన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల కోసం 800 పడకలు ఉంటాయని, అందులో ఆంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి విభాగాల్లో వైద్యసేవలు లభిస్తాయ వెల్లడించారు.