ములుపులు తిరుగుతున్న వివేకా హత్యకేసు


సిబిఐకిచ్చిన వాంగ్మూలంపై స్పీకర్‌ ఓం బిర్లకు లేఖ

సునీతా రెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు సర్వత్రా చర్చ
కడప,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. తాజాగా వైఎస్‌ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సీబీఐ వాంగ్మూలంలో చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. మరోవైపు.. ఈ వ్యవహాంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు సునీతారెడ్డి లేఖ రాశారు. వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్‌ రెడ్డి హస్తం ఉందని లేఖలో స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. ఎంపీ అవినాష్‌ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, సీబీఐకి తానిచ్చిన వాంగ్మూలాన్ని స్పీకర్‌కు రాసిన లేఖతో జతపరిచారు. అంతేకాకుండా సీబీఐకి
నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‌కు అందజేశారు. ఇక, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను బయటపెట్టిన విషయం తెలిసిందే.. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న ఆమె.. నాన్న హత్యపై వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి చాలా తేలిగ్గా స్పందించారని.. నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని.. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‌కు ఏవిూకాదు.. బీజేపీలో చేరతాడని చెప్పారని.. ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. విూది 12వది అవుతుందన్నారని పేర్కొన్నారు. నా తండ్రి హత్యను వైఎస్‌ జగన్‌ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి తెలిపిన ఆమె.. సీబీఐ విచారణ కోసం నేను కోర్టుకు వెళ్తే జగన్‌ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని పేర్కొన్నారు.. అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‌లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు.. అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సీబీఐకి తెలిపారు. నా తండ్రి అంటే ఎంపీ అవినాష్‌కు గిట్టదు అని పేర్కొన్నారు.. హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు సునీతారెడ్డి.