అనంతలో అంగన్‌వాడీల ఆందోళన

  అనంతపురం,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పోలీసులు ఆంక్షలు విధించినా అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీలు ఆందోళన కొనసాగించారు. కలెక్టరేట్‌ వద్దకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తరలిరాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. అంగన్‌వాడీల సంఘం నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆటోలు, బస్సులలో వెతికి పట్టుకుని తమ అదుపులో ఉంచుకున్నారు. అయినా వందలాది మంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టరేట్‌ వద్దకు వస్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, అంగన్‌వాడీ సంఘాల నాయకులు తప్పుబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడానికి కూడా అవకాశం ఇవ్వరా అని పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులు ధర్నాకు అనుమతించారు. వందలాది మంది అంగన్‌వాడీలు ధర్నాలో పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీరుపై నేతలు విమర్శలు గుప్పించారు.