గోవాలో బిజెపికి ఇంటిపోరు

పలువురు నేతలు వీడడంతో ఫలితాలపై ప్రభావం

పనాజి,ఫిబ్రవరి8(జనంసాక్షి): గోవా బీజేపీలో అసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీనుంచి వీడిన వారు రంగంలో ఉండడంతో బిజెపికి తలనొప్పిగామారిందని అంటున్నారు. వీరంతా బిజెపికి ఎసరు పెట్టడం ఖాయమని అనుకుంటున్నారు. ఉత్పల్‌ పారికర్‌ రాజీనామాతో గోవా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నెలలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీలో అంతర్గత తిరుగుబాటు తలనొప్పిగా మారింది. ఇది బిజెపిని మరోమారు అధికారంలోకిరాకుండా చేయగలదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సిట్టింగ్‌ మినిస్టర్‌ తో పాటు మాజీ సిఎం కుమారుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, ఒక డిప్యూటీ సీఎం భార్య పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. గోవా లోని ప్రమోద్‌ సావంత్‌ ప్రభుత్వంలో పిడబ్ల్యుడి మంత్రి దీపక్‌ పౌస్కర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఇసిడోర్‌ ఫెర్నాండెజ్‌ , డిప్యూటీ సిఎం చంద్రకాంత్‌ కవ్లేకర్‌ భార్య సావిత్రి కవ్లేకర్‌, మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌ బీజేపీకి గుడ్‌బై చెప్పిన వారిలో ఉన్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉత్పల్‌ పారికర్‌ అసెంబ్లీ ఎన్నికలలో పనాజీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి నిష్కమ్రించటం కష్టమైన నిర్ణయమే అయినా తప్పలేదని అన్నారు. 2019లో మనోహర్‌ పరికర్‌ మృతితో పనాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పుడు కూడా ఉత్పల్‌కు పార్టీ టికెట్‌ దక్కలేదు. ప్రజా మద్దతు ఉన్నా కూడా తన అభ్యర్థిత్వాన్ని పార్టీ నిరాకరించింది. ఐనా పార్టీ నిర్ణయాన్ని గౌరవించానన్నారు.