మేడారం మహాజాతరకు భారీగా ఏర్పాట్లుట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడకుంగా చర్యలు

ములుగు,ఫిబ్రవరి4 జనంసాక్షి: తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన గిరిజన జనజాతర సమ్మక్క`సారలమ్మ మేడారం జాతరకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జాతర ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే మేడారాన్ని లక్షలాదిమంది ప్రజలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 18న జాతరకు సిఎం కెసిఆర్‌ వచ్చే అవకాశం ఉంది. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం శ్రద్ధ వహించిందని కలెక్టర్‌ వెల్లడిరచారు. జాతరలో చేపట్టిన పనులను నాణ్యత ప్రమాణాలకు లోబడి పూర్తి చేశామని, నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. చేపట్టిన పనుల్లో జిల్లా యంత్రాంగం నాణ్యత, పురోగతి ఎప్పటికప్పుడు పర్యవేక్షించిందని,
తద్వారా పనుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా చేపట్టినట్లు వెల్లడిరచారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చెక్‌పాయింట్‌లు ఏర్పాటు చేసి రవాణా వ్యవస్థ సజావుగా కొనసాగేలా పోలీస్‌ యంత్రాంగం ఏర్పాట్లు చేసిందన్నారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్‌ స్థలాలను గుర్తించి అభివృద్ధి చేశామని వెల్లడిరచారు. జాతరకు కోటిన్నరకు పైగా వచ్చే భక్తులకు ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం లేకుండా జాతరలో పారిశుధ్య కార్మికులతో పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని వెల్లడిరచారు. తాగునీరు, రవాణా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వివరించారు. భక్తుల రవాణా కోసం టీఎస్‌ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్‌ తెలిపారు. జాతరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. గొర్రెలు, మేకలు, ఎత్తుబంగారాలు, పుట్టు వెంట్రుకలు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క`సారలమ్మ జాతర విజయవంతానికి అధికారులు అందరూ కృషి చేయాలని అన్నారు.