అరసవిల్లి సూర్యాలయంలో రథసప్తమి వేడుకలు

శ్రీశైలంలో వైభవంగా ప్రత్యేక పూజలు

అమరావతి,ఫిబ్రవరి8  (జనం సాక్షి):ప్రముఖు పుణ్యక్షేత్రం అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారం, డిప్యూటీ సీఎం కృష్ణదాసు స్వామివారిని దర్శించారు. ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. కాగా అధికారులు మాత్రం వీఐపీల సేవలలో తరిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు దేవాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విూడియా ప్రతినిధులను ఆలయం నుంచి బయటకు నెట్టేశారు. దీంతో జర్నలిస్టులు ఆలయం బయట నిరసనకు దిగారు. ఇకపోతే ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభమల్లికార్జున స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యారాధన వేడుకలు నిర్వహించారు. వైదికాచార్యులచే ఆయా బీజమంత్రాలు, ప్రత్యేక ముద్రలతో సూర్యనమస్కారాలు చేశారు. సూర్యభగవానుడికి ఉత్తరపూజనము, నివేదన, మంత్ర పుష్పమును అర్చకులు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారి మూల బృందానికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మఠం ప్రాకారంలో స్వామి వారి మూల విరాట్‌ను పంచ రథోత్సవంపై ఊరేగించారు. స్వామి దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.