కమర్షియల్‌ భవనాల్లో కానరాని సెల్లార్‌ పార్కింగ్‌....వాహనాలన్నీ రోడ్డుపైనే..

ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు సతమతం
ఎటు చూసినా ఆక్రమణలే...పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులుఅమ్యామ్యాలతో సరిపెట్టుకుంటున్న వైనం
నర్సీపట్నం ఫిబ్రవరి 3 (జనంసాక్షి) : ప్రత్యేక కథనం :
నగర, పట్టణీకరణ ముసుగులో వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్థుల భవనాలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్‌ సమస్య కూడా జటిలమైంది. ఈ నేపథ్యంలో వాణిజ్య సముదాయాల సెల్లార్‌లు పార్కింగ్‌కు కేటాయించాలి. అయితే నర్సీపట్నం లో ఎటు చూసినా వాణిజ్య సముదాయాల భవనాలు, లాడ్జీలలోని సెల్లార్‌లను కూడా వ్యాపారాలకు వినియోగించుకుంటున్నారు. ఫలితంగా ఎక్కడా పార్కింగ్‌ స్థలాలు కనిపించడం లేదు. ఆయా వ్యాపార సముదాయాలలో షాపింగ్‌ చేయాలన్నా రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి. సెల్లార్‌ మొత్తం దుకాణాలుగా మారిపోవడమే ఇందుకు కారణమవుతోంది. వ్యాపారస్తులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లలో దర్జాగా వ్యాపారాలు చేసుకుంటూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. మరోవైపు ఆయా భవనాల యజమానులు అద్దెల రూపంలో జేబులు నింపుకుంటున్నారు.
 అదేమని వాహనదారులు దుకాణపు యజమానిని అడిగితే తామేమి చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో నర్సీపట్నం లో ట్రాఫిక్‌ సమస్య రోజు రోజుకు జటిలమవుతోంది. మరోవైపు ప్రధాన రహదారులే కాదు... చివరికి సందుల్లోనూ వ్యాపార సముదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌తో కనీసం సాఫీగా నడిచివెళ్లేందుకు కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికితోడు రహదారుల ఆక్రమణతో ట్రాఫిక్‌ ఇబ్బందులు మరింత అధికమయ్యాయి.

శాఖల మధ్య సమన్వయ లోపం..
ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించాల్సిన పోలీసులు... ఇటు ఆక్రమణలు, సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగించేలా నిక్కచ్చిగా పురుపాలక శాఖ అధికారులు వ్యవహరించకపోవడమన్నది స్పష్టమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ రెండు శాఖల మధ్య సమన్వయలోపం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా ఆయా శాఖల అధికారులు ఆమ్యామ్యాలు పుచ్చుకోవడంతోనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.
నోటీసులతో సరి... చేయితడిపితే ఓకే...!

జిల్లాకేంద్రంతో పాటు అన్ని మున్సిపాలిటీ ప్రాంతాలలో ఎవరైనా ప్రజలు... ఫలానా కాంప్లెక్స్‌లో సెల్లార్‌లోనూ వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నారని, తద్వారా పార్కింగ్‌కు ఇబ్బందిగా ఉందని, దుకాణాల ముందు వాహనాలు పార్కింగ్‌ చేస్తే పోలీసులతో తిప్పలు తప్పవని మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే నోటీసులతో సరిపెడుతున్నారు. ఆ నోటీసులే సంబంధిత అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎప్పుడైతే చెయ్యి తడుపుతారో అప్పుడు ఆ కాంప్లెక్స్‌ వైపు కన్నెత్తి చూడడం లేదు. వాటిలో కొనుగోలు చేసేందుకు, వచ్చే వారి వాహనాలు రోడ్డుపైనే పార్కింగ్‌ చేసి వెళుతున్నారు. అసలే ఆక్రమణలతో కుచించుకుపోయిన ఆ రోడ్డు వాహనాల పార్కింగ్‌తో మరింత విస్తీర్ణం తగ్గింది. 

సెల్లార్‌లో పార్కింగ్‌ తప్పనిసరి చేస్తేనే...
నర్సీపట్నం లో బహుళ అంతస్థుల భవనాలు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో సెల్లార్లలో పార్కింగ్‌ తప్పనిసరి చేస్తే తప్పా ప్రజలు ఎదుర్కొంటున్న పార్కింగ్‌ సమస్యతో పాటు ట్రాఫిక్‌కు పరిష్కారం లభిస్తుంది. ఇప్పటికే ఆయా పురపాలకశాఖ అధికారుల వద్ద సెల్లార్ల వినియోగం లేని బహుళ అంతస్థుల భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల వివరాలు ఉన్నాయు. వాటి ఆధారంగా సెల్లార్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 కె శివ నారాయణ రాజు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శినర్సీపట్నం, విశాఖజిల్లా.
సెల్లర్ పార్కింగ్ వినియోగించక పోవడం వలనఅంతిమంగా వినియోగదారులే అన్ని రకాలుగా అవస్థలకు గురవుతున్నారు. రోడ్డుమీద వాహనం పార్కింగ్‌ చేశావని ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు.దీనిపై వెంటనే మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించి బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల్లో సెల్లర్లలో  షాపులను వెంటనే తొలగించి వాహనాలు పార్క్ చెయ్యడానికి వీలుకల్పించే చధంగా చర్యలు చేపట్టాలి.

 ఆడిగర్ల రాజుసీపీఎం పార్టీ డివిజన్ సభ్యులు
ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించాల్సిన పోలీసులు, సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగించేలా  పురుపాలక శాఖ అధికారులు వ్యవహరించకపోవడమన్నది స్పష్టమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ రెండు శాఖల మధ్య సమన్వయలోపం ఉంది. అంతే కాకుండా ఆయా శాఖల అధికారులకు ముడుపులు అందుతుండడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.