ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన

 

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలతో పాటు పటాన్‌చెరు వద్ద ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. మరోవైపు, ప్రధాని పర్యటన నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఎనిమిది వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు.


ప్రధాని టూర్‌ షెడ్యూల్‌ ఇదే.. 


ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు.


మధ్యాహ్నం 2.15 గంటలకు విమానాశ్రయం నుంచి MI-17 హెలికాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 2.45 గంటలకు పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ వేడుకల సభావేదిక వద్దకు వస్తారు.


మధ్యాహ్నం 2.45 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లోనే పాల్గొంటారు. 


మొక్కల రక్షణ కోసం వాతావరణ మార్పు పరిశోధనా కేంద్రాన్ని, ర్యాపిడ్‌ జనరేషన్‌ అడ్వాన్స్‌మెంట్‌ సౌకర్యాన్ని ప్రారంభిస్తారు. 


అనంతరం స్వర్ణోత్సవాల లోగోను, ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేస్తారు.


సాయంత్రం 4.25 గంటలకు ఇక్రిశాట్‌ సభావేదిక నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి సాయంత్రం 4.50గంటలకు హైదరాబాద్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 


అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకొంటారు.


సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పాల్గొంటారు. పలు పూజా కార్యక్రమంలో పాల్గొని, సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.


ఆ తర్వాత రాత్రి 8.20గంటలకు శంషాబాద్‌ విమానాశ్రాయానికి చేరుకొని అక్కడి నుంచి రాత్రి 8.40గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగుపయనమవుతారు.


ప్రధానికి ఆహ్వానం పలకనున్న మంత్రి తలసాని 


హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలకనున్నారు. ప్రధానికి విమానాశ్రయంలో స్వాగతం పలకడంతో పాటు తిరిగి రాత్రికి దిల్లీ వెళ్లే సమయంలోనూ ఆయనే వీడ్కోలు పలకనున్నారు. మరోవైపు, ప్రధాని పర్యటన దృష్ట్యా సమతామూర్తి కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను సీఎస్‌ సోమేశ్ కుమార్‌తో కలిసి డీజీపీ మహేందర్‌ రెడ్డి శనివారం పరిశీలించారు. సుమారు 8వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. సమతామూర్తి కేంద్రంలో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో ముచ్చింతల్‌ వచ్చే భక్తులంతా పోలీసులకు సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.