బడ్జెట్‌లో అన్ని నియోజకవర్గాలకు సమాన కేటాయింపులు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌

సిద్దిపేట,ఫిబ్రవరి25 (జనంసాక్షి): త్వరలో ప్రభుత్వం సమర్పించే బడ్జెట్‌లో 119 నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ... పాలకవర్గానికి ప్రతిపక్షాలకు నిధులలో వివక్ష చూపడం దురదృష్టకరమన్నారు. గత బ్జడెట్‌ లో ఇచ్చిన హావిూలు ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేదని విమర్శించారు. మూడేళ్ల నుంచి ఆగిపోయిన పెన్షన్‌, 57ఏళ్లకు పెన్షన్‌ స్కీమ్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతికి బ్జడెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. మ్యానిఫెస్టో ప్రకారం బ్జడెట్‌ ఉండాలని అన్నారు. ‘నా అంచనా ప్రకారం ఇదే చివరి బ్జడెట్‌‘ అని వ్యాఖ్యానించారు. 2018లో ఇచ్చిన ప్రతి హావిూ నెరవేర్చాలని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.