టోకెన్లు పొందిన వారికి నేడు దర్శనాలు
తిరుమల,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ ఈరోజు నుంచి పునరుద్ధరించింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్లో జారీ చేయడం ప్రారంభించారు. టోకెన్లు పొందిన భక్తులు 16వ తేదీన దర్శనం చేసుకోవాలని అధికారులు వెల్లడిరచారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ప్రతిరోజు 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపేసింది. ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రతిరోజు 25`30 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆఫ్‌లైన్‌లో 15 వేల టోకెన్లు జారీ చేస్తుండటంతో నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలు దాటే అవకాశాలు ఉన్నాయి.ఈ రోజు నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ