ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం
హైదరాబాద్
తెలంగాణ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ మాత్రం ప్రధానమంత్రి హైదరాబాద్ టూర్‌కు దూరంగా ఉన్నారు. ఇదే ఇప్పుడు అతిపెద్ద హాట్‌టాపిక్. రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగానూ ఇదే చర్చ. ఇంతకీ కేసీఆర్ వెళ్లకపోవడానికి కారణమేంటి? జ్వరమేనా? ఇటీవలి చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలా? మోడీ పర్యటన కంటే తన గైర్హాజరుపైనే చర్చ జరగాలని గులాబీ దళపతి భావిస్తున్నారా? వ్యూహాత్మకంగానే ఇలా చేశారా? ఇదే ఇప్పుడు రాజకీయా విశ్లేషకుల్లో చర్చ కొనసాగుతోంది.
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సావాల్లో పాల్గొనేందుు భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేశారు. సమతామూర్తి భగవద్రామానుజాచార్యుల 216 అడుగుల భారీ విగ్రహావిష్కరనణతో పాటు ఇక్రిశాట్ 50 యేళ్ల స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30కి ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టారు. సరిగ్గా దానికి కొన్ని నిమిషాల ముందే ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్లడం లేదన్న అధికారిక సమాచారం వచ్చింది. దీంతో అందరి ఫోకస్ ఒక్కసారిగా కేసీఆర్ గైర్హాజరుపైకే వెళ్లింది.
ప్రధాని మోడీని రిసీవ్ చేసుకోవడానికి, ఆయనతో కలిసి పర్యటనలో పాల్గొనడానికి జ్వరం వల్లే సీఎం కేసీఆర్ రాలేదన్న సమాచారం వచ్చింది. వాస్తవానికి ప్రధాని పర్యటన ఏర్పాట్లను సీఎం కేసీఆరే స్వయంగా పర్యవేక్షించారు. గురువారం ముచ్చింతల్ వెళ్లి ఏర్పాట్లను చూసి వచ్చారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ శంషాబాద్‌లో ప్రధానికి స్వాగతం పలికి ఇక్రిశాట్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ప్రధాని టూర్‌కు ఒక రోజు ముందే ఆ బాధ్యతలను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై పెద్ద చర్చే జరిగింది.
కారణాలు ఏమైనా సరే ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అదే ఎందుకు? అన్న చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. తాను మోడీకి వ్యతిరేకమన్న బలమైన సంకేతాలను పంపాలన్నదే గులాబీ దళపతి వ్యూహంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో కేంద్రంపై, బీజేపీపై యుద్ధం ప్రకటించారు కేసీఆర్. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ తర్వాత సీఎం కేసీఆర్ మరింత దూకుడు ప్రదర్శించారు. రెండున్నర గంటలపాటు ప్రెస్‌మీట్ పెట్టి కేంద్ర విధానాలను తూర్పారబట్టారు. ఇప్పుడు దానికి కంటిన్యూగానే ప్రధాని టూర్‌కు దూరమయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజా స్టెప్‌తో దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేకశక్తులన్నీ తన వైపు చూస్తాయనేది గులాబీ దళపతి ఉద్దేశంగా తెలుస్తోంది.
కేసీఆర్ గైర్హాజరీకి మరో కారణమూ కనిపిస్తోంది. హైదరాబాద్‌లో మోడీని విమర్శిస్తారు. ఢిల్లీకి వెళ్లి దోస్తీ చేస్తారని విమర్శలు చేసే వారికి చెక్ పెట్టే ఎత్తుగడ అన్నది కొందరి అంచనా. ఇదొక్కటే కాదు బీజేపీ రాష్ట్ర టీమ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోడీతోనే యుద్ధం చేస్తున్నాను, మీరెంత? అనే సంకేతాలను బీజేపీ శ్రేణులకు ఇచ్చినట్లయిందన్న భావన గులాబీ పార్టీలో కనిపిస్తోంది. ఇదిలావుంటే, బయటకి జ్వరమని చెప్పినా అది సాకే అన్న విమర్శలు బీజేపీ వైపు నుంచి పెద్దయెత్తున వస్తున్నాయి. రాజ్యాంగాన్ని అవమానించారని, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారంటూ బీజేపీ ఘాటు విమర్శలు చేస్తోంది.
వాస్తవానికి ప్రధాని టూర్‌కి వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయించుకుని ఉంటే… కనీసం కేటీఆర్‌నైనా పంపి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం జరగడం ఆసక్తిగా మారింది. స్వయంగా మంత్రులే ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ పేరుతో ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నలు సంధించారు. ఏదేమైనా మోడీ టూర్‌కు ముఖ్యమంత్రి దూరంగా ఉండటం పెద్ద దుమారమే రేపుతోంది.