మరణించిన భర్త లక్ష్యం నెరవేర్చే లక్ష్యం


భర్త చూపిన మార్గంలో ఆర్మీలోకి భార్య

భోపాల్‌,ఫిబ్రవరి5 ( జనంసాక్షి ) :  అమరుడైన భర్త చూపిన మార్గంలోనే నడిచి ఇండియన్‌ ఆర్మీలో చేరాలని ఆ యువతి నిశ్చయించుకున్నది. ఈ మేరకు ఆర్మీలో చేరేందుకు నిర్వహించిన పరీక్షలో ఉత్తర్ణురాలైంది. మరో వారం రోజుల్లో సైన్యంలో అధికారిగా విధుల్లో చేరనున్నది. రెండేండ్ల క్రితం గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో బిహార్‌కు చెందిన 16 వ బెటాలియన్‌ మెడికల్‌ అసిస్టెంట్‌గా విధుల్లో ఉన్న దీపక్‌ సింగ్‌ అమరుడయ్యాడు. ఆయనకు గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మరణానంతరం దేశం మూడో అత్యున్నత సైనిక గౌరవం.. వీరచక్ర అవార్డును ప్రదానం చేశారు. దీపక్‌ సింగ్‌ భార్య రేఖాదేవి ఈ గౌరవాన్ని అందుకున్నారు. భర్త అడుగుజాడల్లోనే నడిచి దేశ సేవలో తరించాలని దీపక్‌ సింగ్‌ భార్య రేఖాదేవి నిర్ణయించుకున్నది. ఆ మేరకు సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అలహాబాద్‌లో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎంపిక చేసినట్లు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. అమరవీరుల భార్యలకు ఆర్మీలో చేరేందుకు యూపీఎస్‌సీ నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ హాజరు కాకుండా మినహాయింపు ఉన్నది. ఎస్‌ఎస్‌బీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు. అమరవీరుల భార్యలకు వయో సడలింపు కూడా ఉంటుంది. దీపక్‌ సింగ్‌ సైన్యంలో మెడికల్‌ అసిస్టెంట్‌. వృత్తిలో భాగంగా 30 మంది భారత సైనికులకు సకాలంలో చికిత్స అందించి ప్రాణాలను కాపాడాడు. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనాకు చెందిన 40 మందికి పైగా సైనికులు కూడా మరణించారు. ఈ పోరాట సమయంలో గాయపడిన భారత సైనికులకు సహాయం చేయడానికి దీపక్‌ సింగ్‌ ముందుకి చేరిన సమయంలో చైనా సైనికులు కొట్టిన రాయి తలకు తగిలింది. దాంతో తీవ్రంగా గాయపడిన దీపక్‌ సింగ్‌ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.