కార్యకర్తలు ఐక్యమత్యంతో ఉండాలి:సీనియ‌ర్ కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్

 భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 2023లో అధికారంలోకి రావాలంటే ఐక్యంగా ఉండాల‌ని, ఐక‌మ‌త్యం కొర‌వ‌డితే ఓట‌మి త‌ప్ప‌ద‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను హెచ్చ‌రిస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మీరు క‌లిసిక‌ట్టుగా పోరాడ‌ని ప‌క్షంలో రాష్ట్రంలో పార్టీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని ఈ వీడియోలో రాజ్య‌స‌భ ఎంపీ దిగ్విజ‌య్ సింగ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.

రత్లాంలో శ‌నివారం ఈ వీడియో చిత్రీక‌రించిన‌ట్టు స‌మాచారం. మీరంతా ఒక్క‌టిగా కూర్చుని మాట్లాడుకునేందుకు సిద్ధంగా లేరు..నేను ఇక్క‌డికి వ‌చ్చినా మీరు వేర్వేరుగా నిల‌బ‌డ్డారు..మ‌న‌కు రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నిక‌లు చిట్ట‌చివ‌రివి..మీరు నిజాయితీగా ఎన్నిక‌ల్లో పోటీ ప‌డ‌క‌పోతే ఇంట్లోకూర్చునేందుకు సిద్ధంగా ఉండండి అని డిగ్గీరాజా కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. క‌లిసిక‌ట్టుగా క‌ద‌ల‌క‌పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేద‌ని. చివ‌రికి పార్టీకి కార్య‌క‌ర్త‌లు కూడా దొర‌క‌ర‌ని హెచ్చ‌రించారు.

ఇక కాంగ్రెస్‌లో గ్రూపుల పోరున‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని వైర‌ల్ వీడియోపై బీజేపీ వ్యాఖ్యానించింది. పార్టీలో గ్రూపుల‌పై దిగ్విజ‌య్ సింగ్ హెచ్చ‌రిక‌లు పీసీసీ చీఫ్‌గా క‌మ‌ల్‌నాధ్ ప‌దవికి ఎస‌రు పెట్టేందుకేన‌ని బీజేపీ కార్య‌ద‌ర్శి ర‌జ్‌నీష్ అగర్వాల్ అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి నూక‌లు చెల్లాయ‌న్న విష‌యం దిగ్విజ‌య్ సింగ్ గుర్తెరిగార‌ని అన్నారు. క‌మ‌ల్‌నాధ్ నాయక‌త్వంలో పార్టీలో గ్రూపులు పెరిగాయ‌ని ఈ వీడియో ద్వారా దిగ్విజ‌య్ సింగ్ వెల్లడించార‌ని చెప్పారు.