హిజాబ్‌ వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ

దీనిని జాతీయస్థాయి సమస్యగా చూడొద్దని హితవు

న్యూఢల్లీి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  హిజాబ్‌ వివాదంపై మైనార్టీ విద్యార్థిని దాఖలు చేసిన పిటీషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విద్యాసంస్థల్లో ధార్మిక వస్త్రాలు ధరించవద్దన్న కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను తిరస్కరించింది. సరైన సమయంలో ఈ అంశంపై విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పెద్దది చేసి జాతీయస్థాయి సమస్యగా చూడవద్దని సీజేఐ ఎన్వీ రమణ లాయర్లకు సూచించారు. ఏం జరుగుతుందో తాము గమనిస్తున్నామని ఇలాంటి అంశాలను జాతీయస్థాయిలో చర్చకు తీసుకురావడం సబబేనా అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే హిజాబ్‌ వివాదంపై కేసు విచారణను కర్నాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈ కేసును తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ కోరారు. అయితే ఈ అంశంపై హైకోర్టు విచారణ జరుపుతున్నందున ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని సీజీఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడిరది. కర్నాటక హైకోర్టు కోరితే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.