తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చహర్‌

ఐపిఎల్‌ ఆటపై అనుమానమే అంటూ వార్తలు

బెంగళూరు,ఫిబ్రవరి24  జనం సాక్షి: టీమిండియా యంగ్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చహర్‌ తొడ కండరాల గాయంతో శ్రీలంకతో టి20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీపక్‌ చహర్‌కు గాయం త్రీవత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీంతో చహర్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తన్నాయి. ఇదే నిజమైతే సీఎస్‌కే పెద్ద దెబ్బ పడినట్లే. ఎందుకంటే ఈసారి మెగావేలంలో సీఎస్‌కే దీపక్‌ చహర్‌ను రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సీజన్‌కు చహర్‌ దూరమైతే మాత్రం సీఎస్‌కే భారీ మొత్తంలో నష్టపోనుంది. గతేడాది ఐపీఎల్‌లో చహర్‌ సీఎస్‌కే తరపున అదరగొట్టాడు. ఒక రకంగా సీఎస్‌కే టైటిల్‌ గెలవడంలో దీపక్‌ చహర్‌ కీలకపాత్ర పోషించాడు. చహర్‌ దూరమైతే అతనికి రీప్లేస్‌మెంట్‌ విషయంలోనూ సీఎస్‌కేకు సరైన ఆటగాడు లేడు. అంతేకాదు ఏడాది కాలంగా దీపక్‌ చహర్‌ బంతితోనే కాదు బ్యాట్‌తోనూ అదరగొడు తున్నాడు. శ్రీలంక గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో 65 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో తనలో ఆల్‌రౌండర్‌ ఉన్నాడని నిరూపించిన చహర్‌ ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ టీమిండియా తరపున పలు మ్యాచ్‌లో మెరిశాడు. విండీస్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మూడో టి20లో బౌలింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. ప్రస్తుతం దీపక్‌ చహర్‌ బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడవిూలో రీహాబిటేషన్‌లో ఉన్నాడు. ఇప్పటికైతే చహర్‌ గాయం తీవ్రత గురించి ఎలాంటి సమాచారం లేనప్పటికి.. ఐపీఎల్‌ ప్రారంభమయ్యే నాటికి ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ 2022 సీజన్‌ను మార్చి చివరి వారం లేదా ఏప్రిల్‌ మొదటివారం నుంచి ప్రారంభించేలా బీసీసీఐ సన్నాహాకాలు చేస్తుంది.