హైదరాబాద్: మేడారం జాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తుల కోసం ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని, ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3,845 బస్సులను ఏర్పాటు చేశామని ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. గత 50 ఏళ్లుగా మేడారంకు ఆర్‌టీసీ బస్సులను నడిపిస్తుందని, ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుందని ఆయన అన్నారు. ఆర్‌టీసీ బస్సులు సమ్మక్క గద్దెల వరకు వెళ్తాయని, ప్రైవేట్ వాహనాలు జాతరకు దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే ఆగుతాయని, ఆర్‌టీసీ బస్సు సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం మేడారం విత్ టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్, యాప్‌ను శుక్రవారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సాధారణ చార్జీలే
మేడారం జాతరకు నడిపే స్పెషల్ బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయని ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మేడారం జాతరకు బస్సులు నడపడాన్ని రెవెన్యూ అంశంగా చూడటం లేదని, మేడారం రవాణా సేవలను సామాజిక సేవ, సామాజిక బాధ్యతగా ఆర్టీసీ భావిస్తోందని అన్నారు. ఈసారి జాతరకు 3,845 బస్సులను నడిపిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. గత 50 ఏళ్ల నుంచి ఆర్‌టీసీ మేడారం జాతరకు సేవలు అందిస్తోందని, 1968వ సంవత్సరంలో ఆర్టీసీ 100 బస్సులను మేడారంకు నడిపించిందని వివరించారు. 2020లో 3,382 బస్సుల్లో 50,230 ట్రిప్పులతో 19.98 లక్షల మంది ప్రయాణికులను మేడారం జాతరకు చేరవేశామని, తద్వారా ఆర్‌టీసీకి రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
ఈ ఏడాది సుమారు 23 లక్షల మందిని మేడారానికి చేర్చాలని అంచనా వేస్తున్నామని, మొత్తం 51 పాయింట్స్ నుంచి బస్సులను నడిపించనున్నామని వివరించారు. మన రాష్ట్రంలోనే కాకుండా బయటి రాష్ట్రాల నుంచి కూడా బస్సులను నడిపిస్తున్నామని, మహారాష్ట్ర నుంచి 45 బస్సులు నడిపిస్తున్నామని వెల్లడించారు. ఇక మేడారం జాతరకు వెళ్లే వారు 30 మంది ఉంటే వాళ్ళ కాలనీకే బస్సులు నడిపిస్తామన్నారు. అవసరమైన వారు 040-30102829 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. కానీ ఈ నెల 13 తర్వాత ఈ సదుపాయం ఉండదని తెలిపారు.
ఈ నెల 11 నుంచే
మేడారం జాతరకు ఈనెల 11 నుంచి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామని, తిరిగి 20వ తేదీ వరకు స్పెషల్ బస్సులు కొనసాగుతాయని ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 523 బస్సులను, 1,250 ట్రిప్పులు నడిపించి 1.50 లక్షల మంది ప్రయాణికులను మేడారం జాతరకు తీసుకెళ్లామని చెప్పారు. బస్సుల నిర్వహణ కోసం 50 ఎకరాల్లో బేస్ క్యాంపును ఏర్పాటు చేశామని, అందులో 42 క్యూ లైన్స్ 7,400 మీటర్ల మేర ఏర్పాటు చేశామని, అందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఉంటుందని, 100కు పైగా సీసీటీవీలను ఏర్పాటు చేశామని తెలిపారు. బేస్ క్యాంప్ వద్ద ఒక అంబులెన్స్, ఐసీయూ కేంద్రం ఉంటుందన్నారు. వరంగల్ నుంచి 2,250 బస్సులు తిరుగుతాయని, ఖమ్మం, మెదక్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి బస్సులను నడిపిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రైవేట్ వాహనాల పార్కింగ్ స్థలం నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 30 ఫ్రీ షటిల్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. బస్సుల మెయింటెనెన్స్ కోసం 11 మొబైల్ మెకానికల్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. ఇక ప్రయాణికుల కోసం మేడారం విత్ టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆర్‌టీసీ ఎండీ తెలిపారు. ఈ యాప్‌లో 8 రకాల సేవలు అందిస్తున్నామని, బస్సుల వివరాలు, పర్యాటక కేంద్రాలు, హోటల్, పోలీస్ సేవలు, వైద్య సౌకర్యాలు వంటి వివరాలు ఉంటాయన్నారు. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను కిట్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు నెల రోజుల పాటు కృషిచేసి తయారు చేశారని ఎండి సజ్జనార్ తెలిపారు.