విశాసం కోల్పోయిన సురేశ్‌ రైనా


అందుకే ఐపిఎల్‌ వేలంలో ఎవరూ ముందుకు రాలేదు

న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సిమన్‌ డౌల్‌
చెన్నై,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడంపై న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సిమన్‌ డౌల్‌ స్పందించాడు. రైనాను ఎవరూ కొనుగోలు చేయకపోవడం వెనక రెండుమూడు కారణాలు ఉన్నాయని పేర్కొన్నాడు. టోర్నీ యూఏఈలో జరుగుతున్నప్పుడు రైనా విశ్వాసాన్ని కోల్పోయాడని అయితే, ఇప్పుడు దాని గురించి తాను మాట్లాడ దలచు కోలేదన్నాడు.రైనా గురించి చాలా పుకార్లు వినిపించాయని అన్నాడు. జట్టుతోపాటు ధోనీ విశ్వాసాన్ని కూడా అతడు కోల్పోయాడని సిమన్‌ డౌల్‌ పేర్కొన్నాడు. ఒకసారి అలా జరిగిన తర్వాత మళ్లీ స్వాగతించే అవకాశాలు చాలా తక్కువని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆడుతున్న సురేశ్‌ రైనాను ఇటీవల జరిగిన వేలానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) విడుదల చేసింది. వేలంలో అతడిని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తొలిసారి అన్‌సోల్డ్‌ ఆటగాడిగా మిగిలిపోయాడు. 2020 సీజన్‌లో వ్యక్తిగత కారణాలతో రైనా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. 2021లో కష్టాలు ఎదుర్కొన్న రైనా మోకాలి గాయం కారణంగా టోర్నీ రెండో దశకు దూరమయ్యాడు. పీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడైన రైనా 205 మ్యాచుల్లో 5,528 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజే రైనా కూడా రిటైర్‌ అవుతున్నట్టు ప్రకటించాడు.