ఆప్‌ అధికరాంలోకి వస్తే..కేజ్రీ వరాల జల్లు

ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేస్తాం

గృహాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా

బడ్జెట్‌లో నాలుగో వంతు విద్యకు కేటాయిస్తాం

ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌

డెహ్రాడూన్‌,ఫిబ్రవరి11((జనం సాక్షి);): ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) శుక్రవారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మ్యానిఫెస్టోలో రాష్ట్ర ప్రజలపై ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర బ్జడెబడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచుతామని, అవినీతిరహిత పాలన అందిస్తామని హావిూ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌లో నాలుగో వంతు విద్యకు కేటాయిస్తామని ఆప్‌ స్పష్టం చేసింది. ప్రతినెలా 300 యూనిట్ల వరకూ ఉచిత్‌ విద్యుత్‌ ఇస్తామని, అన్ని గృహాలకు 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తామని పేర్కొంది. ప్రతి కుటుంబానికి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ 5000 అందచేస్తామని భరోసా ఇచ్చింది. 18 ఏండ్లు పైబడిన మహిళలకు నెలకు రూ వేయి అందిస్తామని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను సైతం ఐఐటీ, ఎయిమ్స్‌లో చేరేలా నాణ్యమైన విద్య అందిస్తామని హావిూ ఇచ్చింది. వృద్ధులకు ఉచిత తీర్ధయాత్రలు కల్పిస్తామని ఉత్తరాఖండ్‌ను హిందువుల ఆథ్యాత్మిక రాజధానిగా మలుస్తామని మ్యానిఫెస్టోలో ఆప్‌ పేర్కొంది. మాజీ సైనికులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, బిపిన్‌ రావత్‌ పేరిట ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణా సంస్ధ ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ నెలకొల్పుతామని పేర్కొంది. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో పిబ్రవరి 14న జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 57 స్ధానాల్లో గెలుపొందింది. తాజా ఎన్నికల్లో విజయంతో మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ పావులు కదుపుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని విపక్ష కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆప్‌ సైతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా సత్తా చాటాలని సన్నద్ధమవుతోంది.