దేశంలో సమస్యల దండోరా


పరిష్కరించే సత్తా లేని నాయకత్వం

విపక్షాల అనైక్యతే బలంగగా మోడీరాజకీయం
న్యూఢల్లీి,ఫిబ్రవరి10(జనంసాక్షి): దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు దిగి రావడంలేదు. ద్రవ్యోల్బణం అదుపు కావడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని కాంక్షించిన ప్రజలు రెండోమారు నరేంద్రమోడీకి అధికారం అప్పగించారు. కానీ జరుగుతున్న దేమిటి..? ప్రజల ధన, మాన, ప్రాణాలకే రక్షణ కరువైపోయింది. దేశంలో అత్యాచారాలు, అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. దేశంలో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా నడుస్తోంది! ఆయన వ్యూహాల ముందు మిగతా పార్టీల వ్యూహాలు చెల్లకుండా పోతున్నాయి. అందుకే నేనే సుపీరియర్‌ అనే భావనతో ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన ఇవ్వాళ ఈ స్థాయికి రావడానికి ఆ పార్టీకి చెందిన ఎంతోమంది నాయకులు.. ముఖ్యంగా
ఎల్‌.కె.ఆద్వానీ వంటివారి ఆశిస్సులు ఉన్నాయి. ఇప్పుడు వారినందరినీ ఎక్కడ ఉంచారో అందరికీ తెలిసిందే! ప్రధానమంత్రి కాలేకపోయినా రాష్ట్రపతి అయినా అవుదామనుకున్న ఆద్వానీ కలలను తుంచివేస్తూ, అనూహ్యంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను తెర విూదకు తెచ్చారు. ఒకప్పుడు వేదికలపై ఆసీనులైన బీజేపీ అగ్ర నాయకులకు వెనుక నుంచి మంచినీళ్ల సీసాలను అందించిన నరేంద్ర మోదీ, ఇప్పుడు అదే నాయకులకు తన ముందు స్వేచ్ఛగా కూర్చోలేని పరిస్థితి కల్పించారు. అంటే పదవితో పాటు గాంభీర్యాన్ని, అహాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో ప్రజల సమస్యలపై నేరుగా చర్చించే అవకాశం లేకుండా చేసుకున్నారు. పార్టీలో దీనిపై చర్చ జరగడం లేదు. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునే వీలు లేకుండా పోయింది. విదేశీ పర్యటనలకు ఇస్తున్న ప్రాధాన్యం దేశంలో సమస్యలు తెలుసుకోవడానికి ఇవ్వడం లేదు. మామూలుగా అయితే అమెరికా అధ్యక్షుడు సుప్రీం అన్న భావన ఇతర దేశాల అధినేతలకు ఉంటుంది. కానీ మోడీ ఇప్పుడలాంటి భావనలో ఉన్నారన్న భావన కల్పిస్తున్నారు. అందుకే సమస్యలను పరిష్కరించ గలిగామని, వాటిని అధిగమించామని భావిస్తున్నారు. అదేరీతిలో ప్రజలను నమ్మించడానికి ప్రధాని నరేంద్రమోడీ గత ఏడేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే నోట్ల రద్దు, జిఎస్టీ వంటి విషయాలను పార్లమెంటులో ప్రస్తావించి చర్చించే ధైర్యం నేటికీ చేయడంలేదు. వాటివల్ల కలిగిన నష్టాలను పూడ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎవరూ ప్రశ్నించడానికి వీలుకాని భారీ బహిరంగసభల్లో మాత్రం అనర్గళంగా మాట్లాడుతూ విపక్షాలను దుమ్మెత్తి పోస్తుంటారు. అలాగే పార్లమెంటులో కూడా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇతర దేశాల అగ్రనేతల ఆలింగనాల్లో సేదతీరుతున్న ప్రధాని మోడీకి దేశంలోని సమస్యలు అస్సలు కనిపించకపోవచ్చు. ప్రవాస భారతీయుల చప్పట్లకు అలవాటు పడిన పెద్దమనిషికి దేశంలోని ప్రజల ఇక్కట్లు వినిపించకపోవచ్చు. అందుకే సమస్యలు పరిష్కారం కాక ప్రజల్లో అసహనం రాజ్యమేలుతోంది. తాము కోరుకున్నదేమిటి? దేశంలో జరుగుతున్న దేమిటి? అనే ప్రశ్న క్రమేణా బలపడుతోంది. అభివృద్ధి పేరుతో, పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాని దేశాటనలు చేస్తూ దేశ సమస్యలను మాత్రం నడిబజారులో వదిలారు. కాశ్మీర్‌ ఆందోళనలు, అక్కడ దాడులు, చైనాతో సరిహద్దు సమస్యలు,డార్జిలింగ్‌ వ్యవహరాలను పరిష్కరించే మార్గాలను అన్వేషించడం లేదు. వీటికి తోడు రైతుల ఆత్మహత్యలు ` ఆక్రందనలు, కార్మికుల ఆందోళనలు పట్టించుకోవడం లేదు. నల్లధనంపై పోరాటంలో తాము రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకున్నామని అంటున్నారు. దేశంలో నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలించడానికి పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ పదేపదే చెప్పుకొచ్చారు. ఈ చర్య సత్ఫలితాలు ఇచ్చిందో లేదో మాత్రం చెప్పడం లేదు. నగదు రహిత లావాదేవీల నినాదం కూడా తెరవెనుకకు వెళ్లింది. ప్రజలకు సంబంధించిన విషయాలకన్నా ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ఆలోచనలే మోడీ ముందు ఎక్కువగా ఉంటాయి.