సైఫాబాద్‌ కాలేజీలో అందుబాటులోకి కొత్త హాస్టల్‌

11కోట్లతో నిర్మాణం..300 మందికి వసతి

ప్రారంభించిన మంత్రులు సబిత,మహ్మూద్‌ అలీలు
హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనం సాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్‌ పీజీ కళాశాలలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బాలుర హాస్టల్‌ను హోం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్‌తో పాటు సైఫాబాద్‌ కాలేజీ ప్రిన్సిపల్‌, సిబ్బంది పాల్గొన్నారు. జి ప్లస్‌ మూడు అంతస్తులతో 108 గదులలో 300 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేలా ఈ హాస్టల్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తుందన్నారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క విద్యాసంస్థను కూడా రాష్టాన్రికి కేటాయించలేదు అని మండిపడ్డారు. కేంద్రానికి అధిక ఆదాయం ఇస్తున్న అతి కొద్ది రాష్టాల్లో తెలంగాణ ముందు ఉన్నా, నిధుల కేటాయింపుల్లో మాత్రం చివరి స్థానంలో ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో తెలంగాణ భాగం కాదా.. రాష్టాన్రికి నిధులు ఇవ్వరా? అని సబిత నిలదీశారు. కేంద్రం ఒక్క విద్యాసంస్థ కేటాయించకున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో కొత్తగా 959 గురుకులాలు ప్రారంభించారని తెలిపారు. కేవలం విద్యార్థినిల కోసం 30 మహిళ డిగ్రీ కళశాలలు, ఒక న్యాయ కళశాల ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కేంద్రం పైసా ఇవ్వకున్న పాఠశాల విద్య కోసం రూ. 11,735 కోట్లు, ఉన్నత విద్యా కోసం రూ.1,873 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మన ఊరు ? మన బడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధికి రూ.7,289 కోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు. తొలిదశలో రూ. 3,497 కోట్లతో 9,123 పాఠశాలల అభివృద్ధి చేపడుతామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.