ప్రతి గ్రామంలో కూలీలకు పని కల్పించాలి


- కూలీలు పనిచేయకముందే చేసినట్లు చూపిస్తే చర్యలు

- జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పి పెంటయ్య సూచనలు

మునగాల, ఫిబ్రవరి 8(జనంసాక్షి): ప్రతి గ్రామంలో రోజుకి 40 మందికి తగ్గకుండా కూలీలకు పని కల్పించాలని, కూలీలు పని చేయకుండా పని చేసినట్లు చూపిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పి పెంటయ్య హెచ్చరించారు. మండలంలోని గణపవరం, ఈదులవాగు తండా గ్రామ పంచాయతీలలో మంగళవారం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు, పల్లె ప్రకృతి వనం కొరకు కేటాయించిన భూమి, పల్లె ప్రగతి పనులైన పల్లె ప్రకృతి వనం, నర్సరీ నిర్వహణ, వైకుంఠధామంలో విద్యుత్ మరియు నీటి వసతులు ఏర్పాటు, నూతన సాంకేతిక పోర్టల్ లో ఉపాధి హామీ పనుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను డాక్టర్ పి పెంటయ్య పర్యవేక్షించారు. అంతేగాక నర్సరీలో వేడి నుండి మొక్కల సంరక్షణకు గ్రీన్ షేడ్ నెట్ మరియు పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎల్లవేళలా నిర్వహించుటకు ప్రతి మొక్కకు ఏర్పాటు చేసి వేసవిలో సైతం అన్ని మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలో ఇప్పటికే 11 గ్రామ పంచాయతీల్లో వైకుంఠదామంలో విద్యుత్, నీటి వసతులు కల్పించడం అభినందనీయమని, మిగిలిన 11 పంచాయతీలో పనులు జరుగుతున్నందున వాటిని కూడా త్వరగా పూర్తిచేయాలని, వైకుంఠదామాల ఆవరణాలు పిచ్చిమొక్కలు లేకుండా తొలగించి శుభ్రంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, ఏపిఓ బి. శేఖర్, ఈసి కళ్యాణ్, ఈదులవాగుతండా సర్పంచ్ బోడ ప్రసాద్, గణపవరం సర్పంచ్ విజయమ్మ, పంచాయతీ కార్యదర్శులు వీరారెడ్డి, రమణ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.