అశోక్‌బాబును వెనకేసుకొస్తున్న చంద్రబాబు

అక్రమాలు చేస్తే కేసు పెట్టకుండా ఉంటారా: కొడాలినాని

అమరావతి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):- నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగోన్నతి సాధించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును చంద్రబాబు వెనుకేసు కొస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అశోక్‌బాబును అరెస్ట్‌ చేయడంలో తమ ప్రభుత్వ ప్రమేయం లేదని, సహోద్యోగి ఫిర్యాదుమేరకు లోకాయుక్తా ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు అతడిని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. తప్పు చేసినా వ్యక్తిని చట్టం ప్రకారం ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపారు. జిల్లాల పునర్విభజనలో టీడీపీ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా తేల్చాలని డిమాండ్‌ చేశారు. విజయవాడకు ఎన్టీఆర్‌ పేరు పెడితే కొందరు టీడీపీ నాయకులు అభ్యంతరం చేయడం విచారకరమని అన్నారు. నిర్మాణత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. ప్రజల ఆమోదంతో మూడు రాజధానులను కట్టి తీరుతామని కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం జగన్‌పై గాని ప్రభుత్వంపై గాని ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు. దొంగ సర్టిఫికెట్‌తో అశోక్‌బాబు ప్రమోషన్‌ పొందాడని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ పెట్టి ప్రమోషన్లు సంపాదించాడని మండిపడ్డారు.
అశోక్‌బాబుపై ఫిర్యాదు చేసింది.. వైఎస్సార్‌సీపీ కాదని.. సాటి ఉద్యోగే అశోక్‌బాబుపై ఫిర్యాదు చేశారన్నారు. అశోక్‌బాబు అరెస్ట్‌పై టీడీపీ గగ్గొలు పెడుతోంది. అవినీతి పరుడు కోసం టీడీపీ తాపత్రయపడుతోంది. అశోక్‌ బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే.. దొంగలను వెనుకేసుకొస్తున్న ముఠా నాయకుడు చంద్రబాబు. అశోక్‌బాబు కేసును లోకాయుక్త సీఐడీకి అప్పగించింది. ఇంటర్‌ చదివి.. డిగ్రీ చదివినట్టు అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సృష్టించాడు. అశోక్‌బాబు ఏం తప్పు చేశాడని చంద్రబాబు నిస్సిగ్గుగా అడుగుతున్నారు. తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అరెస్ట్‌ చేసిందని మంత్రి కొడాలి నాని అన్నారు.