*సరిహద్దులు తేల్చేదెన్నడు....?*


 - 137 సర్వేలో భూముల సరిహద్దు సంగతి తేలేనా....!

-   137/1 ప్రభుత్వ భూమిలో ఉన్న ఫ్యాక్టరీకి అండ ఎవరు...?
 
-  తవ్వేకొద్ది బయటకొస్తున్న 137 సర్వే అక్రమాలు
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, జనంసాక్షి (ఫిబ్రవరి 17) :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం లో 137 బై సర్వే నెంబర్ భూముల సరిహద్దులు తేల్చకుండా అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిపై జనంసాక్షి దినపత్రిక గత వారం రోజులుగా కథనాలు ప్రచురించడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్న ట్లు సమాచారం. 137/2 లో 9 మంది పేరున 46.27 గుంటల భూమి ఉందని, అక్రమంగా 31.08 ఎకరాలు నమోదైనట్టు ఆధారాలతో వార్తలు రావడంతో.. 137/2 అక్రమాలపై చుంచుపల్లి తహసీల్దార్ గుట్టు చప్పుడు కాకుండా సర్వేయర్ , రెవిన్యూ ఇన్స్పెక్టర్ తో సర్వే చేయంచి నీవేదిక తెప్పించుకుని పరిశీలన చేయగా.. సర్వే నెంబర్ 137/2 లో  46-27 ఎకరాలు లేదని, ఉన్నది కేవలం 15-19 ఎకరాలేనని, ఇందులో 2-10 ఎకరాలలో అట్టల ప్యాక్టరి తో పాటు మిగతా 13-09 ఎకరాలలో ఇళ్ళ ప్లాట్స్ అని తేలింది. సర్వే నెంబర్ 137/2 కు తూర్పున సర్వే నెంబర్ 137/3 ఉన్నట్లు, దానికి  రోడ్ ఉన్నట్టు లోకేషన్ మ్యాప్ లో స్పష్టంగా ఉంది. కాగా చుంచుపల్లి తహశీల్దార్ జారీ చేసిన 137/2 లోకేషన్ మ్యాప్ లో ఇదంతా చాలా స్పష్టంగా కనపడుతుంది. 132/2 భూముల పేరుతో 137/3 సర్వేలో వేసిన వెంచర్ అక్రమమని తహశీల్దార్ కు కూడ తెలినప్పట్టికి.. 137/3 భూ యజమానులు సరిహద్దు సర్వే చేయమని అభ్యర్దించగా కోపంతో అసలు మీకు భూమే లేదని, సరిహద్దు చూపాల్సిన అవసరం తనకు లేదని బెదిరించి బుకాయించారని బాధితులు వాపోయారు. అంతే కాక అట్టల ఫ్యాక్టర్ కి ఉత్తరం సర్వే నెంబర్ 137/1 లో ప్రభుత్వ భూమిలో మరో ఇండస్ట్రీ వుంది. సరిహద్దులు చూపితే 137/1 ప్రభుత్వ భూమిలో ఉన్న మరో ప్యాక్టరి గుట్టు బయటకు వచ్చి భూఅక్రమణ చట్టం క్రింద అట్టి ప్యాక్టరిని స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. కనుక సదరు ఫ్యాక్టరీ యజమాని తహశీల్దార్ వచ్చి సరిహద్దు చూపించాలని స్థానికులను బెదిరిస్తున్నాడు. తహశీల్దార్ రారు సరిహద్దు చూపరు మీ దిక్కున్న చోటికి వెళ్ళండంటూ ఫ్యాక్టరీ యజమాని చెప్పడం దానికి తగ్గట్టుగా తహశీల్దార్ నేను సరిహద్దు చూపనని అనడంలో ఉన్న నిఘాడార్థం ఏమిటో ఆ భగవంతుడీకే తెలియాలి. సదరు చుంచుపల్లి తహశీల్దార్  ఎక్సిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆయన పరిధిలో ఉన్న ఏ గ్రామంలో ఎలాంటి భూ సమస్య వచ్చినా అది పట్టా భూమా, ప్రయివేటు భూమా, ఫారెస్ట్ భూమా అన్నది చూడకుండా సమస్య తీవ్రరూపం దాల్చకుండా పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న అధికారిదే. కానీ ఆయనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా తహశీల్దార్ సరిహద్దు సర్వే చేపట్టి 137/2 లో భూములు ఉన్నాయంటూ అమ్మకాలు చేస్తున్న వారి ఆట కట్టించాలని మండల ప్రజలు కోరుతున్నారు.