కమ్యూనిస్టులపై అక్కసుతో సాధించేదేవిూ


ప్రజల సమస్యలపై పోరాడితే భయమెందుకు

ఎర్రజెండాలు అంటూ విమర్శల వెనక దాటవేసే ప్రయత్నాలు
అమరావతి,ఫిబ్రవరి12((జనం సాక్షి):): ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్వయంగా కమ్యూనిస్టులపై దాడికి తెరలేపారు. పార్టీకి సోషల్‌ విూడియా బృందం కూడా ఈ విషయంలో బాగా పనిచేసింది. పచ్చ జెండాల వెనక ఎర్ర జండాలంటే ఘాటుగానే విమర్శలకు దిగారు. జగన్‌ కూడా నిజాలు అంగీకరించడానికి సిధ్దంగా లేరు. ఉన్నట్లుండి కమ్యూనిస్టులపై ఇంత తీవ్రంగా దాడి చేయటానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే టిడిపి,జనసేనతో పాటు కమ్యూనిస్టులు కూడా అమరావతి, విశాఖ స్టీల్‌ తదితర విషయాలపై గట్టిగానే పోరాడుతున్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టులు కొంత వీధిపోరాటాలు ఎక్కువగానే చేస్తున్నారు. ఉద్యోగుల ఆందోళనలకు మద్దతు ఇవ్వటం ద్వారా సమస్యను బాగాను హైలెట్‌ చేశారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అరచేతిలో వైకుంఠం చూపించారు. వాస్తవంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య
ప్రజల ఆదాయాలు కుంచించుకుపోతున్నాయి. ఆర్థిక వ్యత్యాసాలు తీవ్రతరమవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించటంలో జన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. అప్పులు చేయడం పంచి పెట్టడం అన్నరీతిలో పాలన సాగుతోంది. దీనిని ఎప్పిటికప్పుడు కమ్యూనిస్టులు గట్టిగానే విమర్శిస్తున్నాయి. ఇదే జగన్‌ ఆగ్రహానికి కారణమై ఉంటుంది. టిడిపి విమర్శిస్తే ఎదురుదాడి చేయొచ్చు. కానీ ఎర్రజెండాలు కూడా ఇలా చేయడమేంటన్న బాధ ఉండివుంటుంది.అందుకే అమరావతి, విశాఖ స్టీల్‌, కృష్ణపట్నం తదితర అంశాల్లో పెరుగుతున్న ప్రజా ఉద్యమాలు ఆటంకంగా మారుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం, విద్యార్థుల పోరాటాలు, మహిళ, దళిత, ఆదివాసీ ఉద్యమాలు, తాజా ఉద్యోగుల ఆందోళన ఇవన్నీ అందులో భాగమే. సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం ఆందోళనలను నిరంకుశంగా అణచటానికి ప్రయత్నం చేస్తున్నది. నష్టపోతున్న శ్రామికుల పక్షాన కమ్యూనిస్టులు, కార్మిక తదితర ప్రజాతంత్ర సంఘాలు నిలబడి పోరాడుతున్నాయి. ప్రజల మధ్య ఐక్యత కోసం కమ్యూనిస్టులు పోరాడుతున్నారు. వారిని చీల్చి ప్రజా ఉద్యమాలను బలహీన పర్చటానికి పాలక వర్గాలు కుట్ర పన్నుతున్నాయి. అందుకు కులం, మతం, ప్రాంతం లాంటి ఏ ఒక్క అంశాన్ని అధికార పార్టీ వదలటం లేదు. ఎపి కూడా అదానీ, అంబానీలకు స్థావరంగా మారింది. గంగవరం పోర్టు వాటాను అదానీపరం చేయటం తాజా ఉదాహరణ. కృష్ణపట్నం ఓడరేవు ఎప్పుడో వారి పరమైపోయింది. ఈ విధానాలను వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని, ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఎర్రజెండాలపై అక్కసు వెళ్లగక్కారని సిపిఎం ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస రావు మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి చేసిన ద్రోహం చేసినా పోరాడలేని అశక్తతలో సిఎం జగన్‌ ఉన్నారని మండిపడ్డారు. అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం వారికి లొంగిపోయి మతోన్మాద రాజకీయాలకు వంత పాడుతున్నాయి. బిజెపి మతోన్మాద ఎజెండాకు ప్రజా ఉద్యమాలు చెక్‌ పెడుతు న్నాయి. 2019 ఎన్నికల తరువాత బిజెపి ద్రోహంపై ఒక్కసారి కూడా నోరు విప్పని జగన్‌ మోహన్‌ రెడ్డి పనిగట్టుకొని కమ్యూనిస్టులపై దాడికి దిగారని అన్నారు. నేరుగా కమ్యూనిస్టులపై విమర్శలు చేస్తే ప్రజలు సహించరు కాబట్టి అప్రతిష్టపాలైన తెలుగుదేశంతో ముడిపెట్టి కమ్యూనిస్టుల ప్రతిష్టను మసకబార్చాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందన్నారు. నాడు చంద్రబాబు నాయుడు ప్రపంచబ్యాంకు సంస్కరణలు తీసుకు వస్తే, అవే విధానాలను మరో పేరుతో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ఇద్దరూ తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని చెప్పారు. రాష్టాన్రికి బిజెపి ద్రోహం చేసినా ప్రశ్నించటం లేదు. అందుకే కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేస్తుంటే అధికార వైసిపికి కంటగింపుగా వుందన్నారు. ఆనాడు ఇదే రీతిలో కమ్యూనిస్టులపై దాడి చేసిన తెలుగుదేశం పార్టీ రీతిలోనే ఇప్పుడు జగన్‌ దాడికి దిగారని విమర్శించారు.