దీనివెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరు
బీమారంగాన్ని దెబ్బతీసే కుట్రచేస్తున్నారా
న్యూఢల్లీి,ఫిబ్రవరి4(జనంసాక్షి): జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలోని వాటాలను విక్రయించదల్చుకున్నట్టు నిర్మలాసీతారామన్ బడ్జెట్‌లో చేసిన ప్రకటన ఒకింత నిరాశకు గురి చేసేదే. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పోతే నిరుద్యోగాన్ని పారదోలుతామన్న హావిూని నమ్మడం ఎలా అన్నదే ప్రశ్న. లాభాల్లో ఉన్న సంస్థలను అమ్ముకుంటూ పోతే దేశంలో ఇక ప్రభుత్వరంగ సంస్థలను ఎలా కాపాడుకుంటామో చెప్పాలి. అధికారం ఇచ్చింది పాలన చేయడానికి అన్నది విస్మరించి అప్పనంగా ఆస్తులను తెగగనమమే అధికారం కేంద్ర రాష్టాల్రకు ఎక్కడిదన్నది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది పాలసీదారుల్లో ఉన్న భరోసాను దెబ్బతీస్తుందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీమారంగంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించినా, ప్రజలు
ఎల్‌ఐసీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ ఆ సంస్థే అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం పునరాలోచించడం ఉత్తమం. ప్రస్తుతం కేంద్రానికి ఎల్‌ఐసీలో పది శాతం వాటావుంది. ఇందులో ఏమేరకు విక్రయిస్తారో చూడాలి. దండిగా లాభాలు ఆర్జిస్తున్న ఎల్‌ఐసీలో ప్రైవేటీకరణకు వీలుకల్పించే ఈ చర్య అమలు అంత సులభం కాదు. దీన్ని ప్రతిఘటిస్తామని బీమా ఉద్యోగులు ఇప్పటికే హెచ్చరించారు. కేంద్రం నిధులు సమకూరిస్తే తప్ప నడిచే అవకాశం లేని సంస్థలను వదిలిపెట్టి నిక్షేపంలా ఉండే సంస్థల ను ప్రైవేటు పరం చేయడమేమిటన్నది వారి ప్రశ్న. ఎల్‌ఐసీ ఏ రోజూ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడలేదు. ప్రభుత్వాన్ని ప్రాధేయపడలేదు. సరిగదా... నష్టాల్లో మునిగిన అనేక పబ్లిక్ రంగ సంస్థల్ని బతికించడానికి దాని నిధులే అక్కరకొస్తున్నాయి. వివిధ మౌలిక సదుపాయరంగ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సవిూకరిస్తూనే, ద్రవ్యలోటు రాకుండా చూడటానికి ఎల్‌ఐసీలోనూ, ఐడీబీఐలోనూ ఉన్న వాటాలను కేంద్రం విక్రయించదల్చుకుంది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ. 90వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది ఏమేరకు సాధ్యమో చూడాల్సివుంది. అయితే ద్రవ్య లోటును నిర్దేశించిన పరిమితికి లోబడివుండేలా చూడాలన్న లక్ష్యంలో సంక్షేమ పథకాలకు కోతపడకుండా చూడటం ముఖ్యం. ప్రజల్లో వినిమయాన్ని పెంచి, డిమాండ్ పెరిగేలా చేసినప్పుడే తయారీ రంగం కోలుకుంటుంది. అందుకు అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటేనే వృద్ధి రేటు నిర్మలా సీతారామన్ ఆశించినట్టు 10 శాతానికి చేరుతుంది. ఇకపోతే ఎల్‌ఐసి లాంటి బీమా సంస్థల్లో ప్రజలు పెద్ద మొత్తంలో చేరేలా... అలా చేరితే రాయితీలు ఇచ్చేలా ఆదాయపన్నులో వెసలుబాటు ఉండాలి. కానీ అలా జరక్కపోవడం అన్నది ప్రైవేట్ సంస్థల ప్రోద్బలం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇకపోతే ఆదాయపన్నుకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి చేసిందల్లా ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛ వేతన జీవులకివ్వడమే. ఏ కత్తి మెత్తగా తెగుతుందో ఎవరికి వారు తేల్చుకోవాల్సివుంటుంది. గృహ నిర్మాణరంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో మినహాయింపులు తొలగించడం ఆ రంగానికి చేటు కలిగించడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే బీమా ప్రీమియంలు చెల్లించేవారికిచ్చే మినహాయింపులు కూడా కొత్త విధానంలో కనుమరుగయ్యాయి.
దేశ ఆర్థిక వ్యవస్థలో, మరీ ముఖ్యంగా భారతీయ జీవిత బీమా వ్యాపార రంగంలో ఎల్‌సైసి ప్రస్థానం విడదీయరానిది. ఇప్పటి వరకు ఏ లక్ష్యాలతో అయితే భారతీయ జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయటం జరిగిందో ఆ జాతీయీకరణ లక్ష్యాలను సాధించటంలో ఎల్‌ఐసి కృతకృత్యమైనది. జాతీయీకరణ లక్ష్య సాధన ద్వారా దేశీయ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచింది. దేశ ఆర్థిక రంగాభివృద్ధికి 36 లక్ష కోట్ల రూపాయలను పెట్టుబడులుగా ఉంచింది. ఎల్‌ఐసి మొత్తం పెట్టుబడులలో 82 శాతం గవర్నమెంట్ సెక్యూరిటీలుగా, దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్దేశిరచినవే.ఎల్‌ఐసి ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులను దేశ ఆర్థికాభి వృద్ధికి అందిస్తున్నది. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలతో పోటీపడి 66 శాతం ప్రీమిమం ఆదాయాన్ని 75 శాతం మేరకు పాలసీలను కైవసం చేసుకుని ప్రభుత్వ రంగ ఎల్‌ఐసి మార్కెట్ లీడర్‌గా నిలిచింది. క్లెయిముల చెల్లింపులలో, ఎక్కువ మొత్తం పాలసీదారులు కలిగి ఉన్న ఎల్‌ఐసి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. 40 కోట్ల పట్టాదారుల ప్రయోజనాలను పణంగా పెట్టి...దేశ జనాభాలో కేవలం 3 శాతానికి పరిమితమైన స్టాక్ మార్కెట్ మదుపరులకు, దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయగల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులకు ఎల్‌ఐసిని కారుచౌకగా కట్టబెట్టే కార్యాచరణకు ప్రభుత్వం ఉపక్రమించడం దారుణం కాక మరోటి కాదు.
ఎల్‌ఐసి అత్యంత పారదర్శకతతో, జవాబుదారీ తనంతో తన నిధులను, విధులను నిర్వహించి ప్రతి ఆర్థిక సంవత్సరం పార్లమెంట్ ఆమోదం పొందుతుంది. ఇటువంటి పారదర్శక సంస్థను నిధుల కోసం నిర్వీర్యం చేసే దిశగా ఎల్‌ఐసిని విలువ కట్టేందుకు మిల్లీమ్యాన్ అనే ఏక్చూరియల్ సంస్థను ప్రభుత్వం నియమిం చింది. రైల్వే తరువాత దేశంలో అత్యధిక ప్రదేశాలలో, స్వంత భవనాలతో కూడిన రియల్ ఎస్టేట్ బేస్ ఎల్‌ఐసి కలిగి ఉన్నది. దేశంలోనూ, అంతర్జాతీయంగానూ ఎల్‌ఐసి కి అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి. 14 దేశాలకు ఎల్‌ఐసి విస్తరించి ఉన్నది. అత్యంత నమ్మకమైన సంస్థగా అనేక సంస్థల టాప్ రేటింగ్స్‌లో ఉన్న ఎల్‌ఐసి బ్రాండ్ విలువను అంచనా వేయటమూ కష్టతరమే. ప్రభుత్వం పూనుకుంటున్న ఎల్‌ఐసి డిజిన్వెస్ట్‌మెంట్ పక్రియ వలన లక్షల కోట్ల విలువైన ఎల్‌ఐసి సంస్థ వాటాలను తక్కువగా మూల్యాంకనం చేసే పరిస్థితి పరిణమించింది. డిజిన్వెస్ట్‌మెంట్ పక్రియ వలన ఎల్‌ఐసి దేశాభివృద్ధికి నిధులు అందించటం, పట్టాదారులకు బోనస్ రూపంలో వారి పొదుపుపై ప్రయోజనాన్ని అందించటం కన్నా...షేర్ హోల్డర్లకి లాభాలు అందించేందుకు తన దృష్టిని మళ్ళించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎల్‌ఐసి వాటాల కొనుగోలుకు అనుమతించటం ద్వారా దేశీయ పొదుపుపై విదేశీ నియంత్రణ పెరిగి దేశాభివృద్ధికి, ఆర్థిక సార్వభౌమత్వానికి ఆటంకం ఏర్పడుతుంది. మేకిన్ ఇండియా’ నినాదం...ఇప్పటికే అంతకు మించిన స్థాయిలో ఉన్న ఎల్‌ఐసి విషయంలో ఆచరణకు నోచుకోకపోవడం విచారకరం.