ఉలవపంటకు కూలీల కొరత

పెరుగుతన్న కూలీరేట్లతో రైతుల్లో ఆందోళన

చిత్తూరు,ఫిబ్రవరి4 (జనంసాక్షి):  ఉలవపంట చేతికొస్తున్న తరుణంలో రైతుల్ని కూలీల కొరత వేధిస్తోంది. సాధారణంగా జనవరిలో నీళ్ల సౌకర్యం ఉన్న రైతులు వరి వేస్తుంటారు. ఇదే సమయంలో మామిడి తోటల్లో కూడా మందులు కొట్టే పనులు, చెట్లకు పాదులు తీసే పనులు, తోటల్లో కలుపు తీసుకునే పనులు ప్రారంభమవుతుంటాయి. దీంతో కూలీలకు డిమాండ్‌ బాగా పెరుగుతుంది. ఈ సమస్య ప్రస్తుతం ఉలవ పంట రైతుల శాపంగా మారింది. డిమాండ్‌ పెరగడంతో కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. రానుపోను ఖర్చుల్ని తామే భరించుకోవాలని, అవి తడిసి మోపెడతువుతున్నాయని ఉలవ రైతులు వాపోతున్నారు. పంట నూర్పిళ్లు చేసుకునేందుకు తగినంత మంది కూలీలు దొరక్కపోవడంతో చాలా మంది రైతులు కుటుంబసభ్యులు సాయంతోనే పంటను నూర్పిడి చేసుకుంటున్నారు. కొంతమంది రైతులు పంటను తమ పొలాల సవిూపంలోని రోడ్లపై వేసి వచ్చీపోయే వాహనాల చక్రాల కింద నలిగి వేరుపడిన ఉలవను ఇళ్లకు తీసుకెళుతున్నారు.అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలోని పీలేరు, కేవీప్లలె, కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం, కలకడ మండలాల్లోని రైతులు రబీ సీజన్‌లో దాదాపు 8 వేల ఎకరాల్లో ఉలవ పంటను సాగు చేశారు. మూడు నెలల పంట అయిన ఉలవను రబీ సీజన్‌లో సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్‌ మాసాల్లో సాగు చేస్తారు. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారంలో పంట చేతికొస్తుంది. అయితే గత అక్టోబర్‌, నవంబరు మాసాల్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఉలవ పంట దిగుబడి రైతులు ఆశించినంత మేర వచ్చింది. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు వ్యవసాయ అధికారులు లెక్కగడుతున్నారు. నియోజకవర్గం గూండా సాగు జాతీయ రహదారులతోపాటు గ్రావిూణ రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ ఉలవ పంట దర్శనమిస్తోంది. పంట కోత యంత్రాలు కూడా తగినంత మేర అందుబాటులో లేకపోవడం కూడా రైతుల ఇబ్బందులకు మరో కారణం.