మేడారం జాతరకు వచ్చు భక్తులకు అన్ని సౌకర్యాలు పూర్తి....


జాతర కు వచ్చే భక్తులకు స్వాగతం సుస్వాగతం పలికిన 

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు


ములుగు బ్యూరో,ఫిబ్రవరి15(జనం సాక్షి):-


ములుగు జిల్లా లోని మేడారం గ్రామంలో ఈ నెల 16వ తేదీ నుండి 19 వ తేదీ వరకు జరగనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తులకు అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణకు ఈ సంవత్సరం 75 కోట్లు రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జాతరలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ లో ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలను చేపట్టామని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు 2500 కార్మికులు,650 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. ఈసారి జాతరలో 10,000 మందికి పైగా పోలీసులు శాంతి భద్రతలను కాపాడడానికి బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.అధునాతన సాంకేతిక తో కంట్రోల్ రూమ్ నుండి నిఘా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే జంపన్నవాగులోకి లక్నవరం నీటిని విడుదల చేశామని, వాగులో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లును నియమించామని మంత్రి తెలిపారు.భక్తుల సౌకర్యార్థం 6 వేల తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.జాతరలో నిరంతరంగా విద్యుత్ సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.

జాతరలో వైద్య సదుపాయాల కల్పనలో భాగంగా మేడారంలోని టిటిడి కళ్యాణ మండపంలో 50 పడకల ఆసుపత్రిని,ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మరో పది పడకలతో తాత్కాలిక ఆసుపత్రిని జాతర పరిసరాలలో 35 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.దీనికి తోడుగా 108,104 లతో పాటు బైక్ అంబులెన్సులు కూడా వినియోగిస్తున్నామని చెప్పారు.జాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం 3 వేల 840 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే శ్రీ సమ్మక్క,సారలమ్మ తల్లుల గద్దెల సమీపంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి తోడుగా హనుమకొండలోని నుండి జాతరకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఏ విధమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. దాదాపు 30 వేల మంది వివిధ శాఖల అధికారులు,సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు.అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ జాతరను విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు. రాజకీయలకు అతీతంగా జాతర వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.అందుకనుగుణంగా గత ఎనిమిది ఏళ్లలో నాలుగు సార్లు జాతర నిర్వహణకు 381 కోట్ల రూపాయలు వ్యయం చేశామని మంత్రి తెలిపారు. జాతరకు రోడ్లు వేయడానికి, జాతరలో శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పనకు, జాతర నిర్వహణకు ఈ నిధులు వ్యయం చేశామని ఆయన చెప్పారు.