కేంద్రమంత్రి జైశంకర్‌తో సిఎం జగన్ చర్చలు
యుద్ద పరిస్థితులపై అధికారులతో సవిూక్షఅమరావతి,ఫిబ్రవరి25 (జనంసాక్షి): ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇప్పటికే లేఖ రాసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా ఆయనకు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావడంపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ మేరకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని జైశంకర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను ముందుగా పక్కదేశాలకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు తీసుకొచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా.. జైశంకర్‌కు ఫోన్ చేసే ముందు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగువారిని భద్రంగా రప్పించడంపై సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో శుక్రవారం సవిూక్ష నిర్వహించారు. ఉన్నతస్థాయి సమావేశంలో సీఎస్, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం జగన్ కలెక్టర్ల స్థాయిలో కాల్‌సెంటర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్టాన్రికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వారి యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశర చేయాలని, కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సీఎం పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రికి కూడా సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.