టిడిపి నేత ఎడ్లపాటి వెంకట్రావు మృతి


హైదరాబాద్‌లో మృతి చెందినట్లు ప్రకటన

భౌతికకాయం గుంటూరుకు తరలింపు..నేడు అంత్యక్రియలు
అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   రాజ్యసభ మాజీ సభ్యులు, టిడిపి సీనియర్‌ నేత, శతాధిక వృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు (102) సోమవారం తెల్లవారుజామున హైదరాబాదులో మృతి చెందారు. కొంతకాలంక్రితం ఆయన భార్య, కుమారుడు మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన హైదరాబాదులోని కుమార్తె ఇంటి ఉంటున్నారు. ఆరోగ్య సమస్యలు, వృద్దాప్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. యడ్లపాటి స్వగ్రామం గుంటూరు జిల్లా బోడపాడు గ్రామం. తెనాలిలో స్థిరపడిన ఆయన ఆచార్య ఎన్‌.జి.రంగా అనుచరులుగా ఉన్నారు. ఆయన1951లో స్థాపించిన కృషికార్‌ లోక్‌ పార్టీ స్థాపనలో
కీలకంగా వ్యవహరించారు. 1959 లో స్వతంత్ర పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి వేమూరు నియోజకవర్గం తరఫున 1962, 65 లో శాసనసభ్యునిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం 1967, 1972 లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972 లో కాంగ్రెస్‌ ప్రభంజనంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఏకైక వ్యక్తిగా యడ్లపాటి రికార్డు సృష్టించారు. 1978 లో కాంగ్రెస్‌ లో చేరి, శాసన సభ్యునిగా గెలుపొందారు 1978, 80 లో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. సంగం డైరీ స్థాపనకు, జంపని షుగర్స్‌ ఏర్పాటుకు ఆయన అవిరళ కృషి చేశారు. 1983లో కాంగ్రెస్‌ తరపున వేమూరు నియోజకవర్గం ఓడిపోయిన ఆయన, 1989లో టిడిపి తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యునిగా, రైతు అధ్యక్షునిగా పనిచేసిన ఆయన 1995లో జడ్పీ చైర్మన్‌ గా ఎన్నికై 98 వరకు ఆ పదవిలో కొనసాగారు. 98 లో రాజ్యసభకు ఎంపికైన ఆయన పదవీకాలం 2004తో ముగిసింది .అనంతరం టిడిపిలో క్రియాశీలక సభ్యునిగా కొనసాగుతున్నారు. నిస్వార్థ రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఆయన శతజయంతి ఉత్సవాలు 2018 డిసెంబర్‌ 19న ఆయన స్వగ్రామమైన బోడపాడులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగాయి. ఆయన మృతికి పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు నివాళులర్పించారు .ఆయన భౌతిక కాయాన్ని తెనాలి స్వగృహానికి తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం జరగనున్నట్లు వెల్లడిరచారు.