` తొలిదశలో 58.51 శాతం ఓటింగ్
` మందకొడిగా సాగిన పోలింగ్
లక్నో,ఫిబ్రవరి 10(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరగిన మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన చర్యల మధ్య ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌లో 58.51 శాతం ఓటింగ్ నమోదైనట్లు వారు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తక్కువ పోలింగ్ నమోదైందని అంటున్నారు. యూపీలో సగటున 60`70 శాతం పోలింగ్ నమోదు అవుతుంటుంది. కానీ గురువారం జరిగిన పోలింగ్‌లో తక్కువ ఓటింగ్ రికార్డ్ అయింది. మొదటి విడత పోలింగ్‌లో రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇదిలావుంటే ఉన్నావో సదర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన ఉన్నావో అత్యాచార బాధితురాలి తల్లి ఆశాసింగ్ విజయంపై ధీమా వ్యక్తం
చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై విజయం సాధించిన ఆమె.. ఎన్నికల్లోనూ విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. తీవ్రమైన నేరాలకు బాధితులుగా మారిన వారికి న్యాయం అందించాలన్న ఉద్దేశంతోనే తాను ఎన్నికల బరిలోకి దిగినట్టు చెప్పారు. ఈ సందర్భంగా అత్యాచార బాధితురాలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తననే ఎన్నికల బరిలోకి దిగమన్నారని, కానీ పోటీ చేసేందుకు తన వయసు సహకరించకపోవడంతో టికెట్‌ను తన తల్లికి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. న తల్లికి మద్దతుగా ఆమె కూడా ఎన్నికల్లో ప్రచారం చేశారు. ప్రజలు తమ బాధను అర్థం చేసుకుని అసెంబ్లీకి పంపిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నలు గుప్పించిన ఆశా సింగ్.. పరిస్థితులు మారితే తప్ప మహిళలపై నేరాలకు బ్రేక్ పడదని అన్నారు. కాగా, ఆశాసింగ్ ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి పంకజ్ గుప్తా, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అభినవ్ కుమార్‌లు బరిలో ఉన్నారు.