కర్ణాటకలో ముదురుతున్న హిజాబ్‌ వివాదం


` విద్యాసంస్థలు మూడు రోజులు బంద్‌
బెంగళూరు,ఫిబ్రవరి 8(జనంసాక్షి):కర్ణాటకలో హిజాబ్‌ లొల్లి చినుకు చినుకు గాలివాన అన్నట్లుగా మారింది. నెలరోజుల క్రితం ఉడిపి జిల్లాలోని ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు విస్తరించింది. పలు స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు హిందూ, ముస్లిం వర్గాలుగా విడిపోయి గొడవలకు దిగుతున్నారు. దాంతో పరిస్థితిని అదుపులో పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా హిజాబ్‌ వివాదంపై హైకోర్టు తీర్పు వెలువడే వరకు విద్యార్థులు సంయమనం పాటించాలని బొమ్మై కోరారు. కాగా, ఓ వర్గం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కాలేజీలకు రావడం వివాదానికి కారణమైంది. అందుకు నిరసనగా మరో వర్గం విద్యార్థులు కాషాయం కండువాలు కప్పుకుని కాలేజీలకు హాజరవడం మొదలుపెట్టారు. ఇది క్రమంగా ఇతర స్కూళ్లు, కాలేజీలకు పాకింది. దాంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులంతా తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ఆదేశాలు జారీచేసింది. అన్ని విద్యాసంస్థలకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. అయినా పరిస్థితి సద్దుమణగలేదు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల స్కూళ్లు, కాలేజీల్లో గొడవలు జరిగాయి. ఇవాళ మాండ్యాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. హిజాబ్‌ ధరించి వచ్చిన ఓ విద్యార్థినిని మరో వర్గం విద్యార్థులు అడ్డుకోవడంతో.. అందుకు ప్రతిగా ఆ విద్యార్థిని నినాదాలు చేశారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం సెలవులు ప్రకటించాల్సి వచ్చింది.