వివేకా హత్యపై జగన్‌ మౌనం వీడాలి

తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి

టిడిపి నేతలు వర్ల, బోండాల ఆరోపణలు
అమరావతి,మార్చి1  (జనం సాక్షి):  వైఎస్‌ వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్మోహన్‌ రెడ్డి మౌనం వీడాలని టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ ఇప్పటికే అన్ని వాంగ్మూలాలు జగన్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డిని.. వేలెత్తి చూపిస్తున్నా.. సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ అందులో డ్రైవర్‌ ప్రసాద్‌ పేరు.. ఉన్నట్లు, రాజశేఖర్‌ రెడ్డి, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదన్నారు. వివేకా హత్య జరిగిన రోజు జగన్‌రెడ్డి తన విలేకరుల సమావేశంలో.. ఆ లేఖ గురించి ఎలా ప్రస్తావించారని వర్ల రామయ్య ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో పథకం ప్రకారం చంద్రబాబు, లోకేష్‌పై బురదజల్లారని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయిన కుమార్తెకు న్యాయం చేయమంటే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నడిపిస్తున్నారని మాట్లాడటానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. నిందితులను జగన్‌ కాపాడుతున్నారని అందరికీ అర్థమైందన్నారు. సీబీఐకి సహకరించి జగన్‌ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. వివేకా హత్య జరిగిన రోజు నుంచే ఒక పధకం ప్రకారం చంద్రబాబు, లోకేష్‌లపై పై వైసీపీ బురద జల్లుతుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. 2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా జగన్‌ సీబీఐ విచారణ చేయాలని కోరారన్నారు. సీఎం కాగానే సీబీఐ విచారణ అవసరం లేదని కేసు ఉపసంహరించుకుంది వాస్తవం కాదా అని బోండా ఉమ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉంటే సీబీఐ కావాలి... అధికారంలో ఉంటే సీబీఐ విచారణ వద్దా అని నిలదీశారు. జగన్‌ అవినీతి పత్రిక సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అని రాసుకున్నాడని బోండా ఉమ గుర్తుచేశారు. తరువాత నిందితుల పక్షాన నిలిచి కేసును నీరు గార్చారన్నారు.