మహిళా సాధికారత కోసం కెసిఆర్‌ కృషి

మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవవేడుకలు

పలువురు మహిళతకు పురస్కారాల ప్రదానం
హైదరాకబాద్‌,మార్చి4(జనం సాక్షి ) : మహిళల స్వావలంబన,సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళాబంధుగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర మహిళా కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహిళా కమిషనర్‌ చైర్‌ పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల కార్యదర్శి దివ్య దేవరాజన్‌, మహిళా కమిషన్‌ సభ్యులు, వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్క రోజే మహిళల రోజు కాదు.. ప్రతి రోజు మహిళా రోజే అని మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. మహిళ కుటుంబంలో, సమాజంలో అన్ని రకాలుగా వివిధ స్థాయిల్లో తన పాత్ర పోషిస్తుందన్నారు. గత ప్రభుత్వాల్లో మహిళలు అనుకున్న పురోగతి సాధించలేదు అని గుర్తించిన సీఎం కేసీఆర్‌ మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణ, పోషణ కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే వారి అభివృద్ధి సాధ్యం అని నమ్మి ఆరోగ్య లక్ష్మి, భరోసా కేంద్రాలు, షి టీమ్స్‌ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచే ముందు ఆడపిల్ల గురించి ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. మహిళల అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. మహిళా కమిషన్‌ సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు బాగా పని చేస్తోంది. ఇందుకు వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. వారికి తోడుగా మనమంతా కలిసి పని చేయాలి. ఎనిమిది మంది వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఈ సందర్భంగా సత్కరిస్తున్నందుకు, సన్మాన గ్రహీతలకు మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందనలు తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. అమ్మాయిలకు శుభాశీస్సులు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సమాజంలో సగ భాగం మహిళలు అని వారి కోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రతి విద్యార్థి వారి అమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి. అమ్మ,అమ్మమ్మకు మించిన రోల్‌ మోడల్‌ సమాజంలో ఇంకెవరు ఉండరని ఆమె అన్నారు. మహిళలు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అని సీఎం కేసీఆర్‌ నమ్మి అనేక అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళల భద్రత కోసం పెద్ద పీట వేశారు. దేశంలో మొదటి సారి ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల కోసం 53 డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంద న్నారు. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుని మహిళలు ముందుకు వెళ్లాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అంటే వంటింటికి పరిమితం అనే అభిప్రాయం ఉండేది. కానీ అందరికీ సమాన అవకాశాలు కావాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ మహిళా దినోత్సవం అని ఆమె పేర్కొన్నారు. మహిళలు సాధించిన విజయాలు, సాధించాల్సిన లక్ష్యాల గురించి ఈ దినోత్సవం జరుపుకుంటామని గుర్తు చేశారు. సమాజం అభివృద్ధి జరగాలంటే మహిళలు, పురుషులు సమానంగా ఉండాలి. మహిళలకు సీఎం కేసీఆర్‌ అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సునీతా లక్ష్మారెడ్డి సూచించారు.