ఈటీ అందరిని అలరిస్తుందంటున్న సూర్య


ఆకాశం నీ హద్దురా, జై భీమ్‌ సినిమాలతో వరుస హిట్స్‌ అందుకున్న సూర్య.. ఈ నెల 10న ’ఈటీ’ (ఎవరికీ తలవంచడు) అనే యాక్షన్‌ థ్రిల్లర్‌తో వస్తున్నాడు. పాండిరాజ్‌ దర్శకత్వంలో కళానిధి మారన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్‌ సినిమాస్‌ సంస్థ విడుదల చేస్తోంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరైన రానా మాట్లాడుతూ ’శివ పుత్రుడు సినిమా చూసి సూర్యకి అభిమానినయ్యాను. తర్వాత నేను నటించిన ఓ సినిమాని ఎడిటింగ్‌ టేబుల్‌పై ఉన్నప్పుడు చూసి నువ్వు చేసేది యాక్టింగే కాదంటూ ఆయన నాలుగ్గంటలు క్లాస్‌ పీకారు. అదే నన్ను భల్లాలదేవని, డ్యానియెల్‌ శేఖర్‌ని చేసింది. అంత గొప్ప నటుడు, వ్యక్తి నటించిన ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నాడు. సూర్య మాట్లాడుతూ ..’తెలుగు ప్రేక్షకులు నాపై చూపే ప్రేమకి థ్యాంక్స్‌. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్‌. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఒక ఎన్జీవోను ప్రారంభించడానికి నాకు చిరంజీవిగారు ఇన్‌స్పిరేషన్‌. రక్తదాన శిబిరాలతో కోట్లమందిలో మార్పు తీసుకువచ్చారాయన. అలాంటి మార్పు కొద్దిమందిలో తీసుకువచ్చినా మేలు జరుగుతుందనే నేను అగరం ఫౌండేషన్‌ స్టార్ట్‌ చేశాను’ అని చెప్పాడు. దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్‌ మలినేని, నిర్మాతలు దిల్‌ రాజు, సురేష్‌? బాబు హాజరై టీమ్‌కి విషెస్‌ చెప్పారు.