నన్ను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావొచ్చు

 



` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
` రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలు అందించాలని అమెరికా చట్టసభ్యులకు విజ్ఞప్తి
` మేరియుపొల్‌, వోల్నవాఖ నగరాల్లో నేడు కాల్పులకు విరామం..?
` ‘హ్యుమానిటేరియన్‌ కారిడార్‌’ పై రష్యా ప్రకటన
కీవ్‌,మార్చి 6(జనంసాక్షి):రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను అందించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా చట్టసభ్యులకు విజ్ఞప్తి చేశారు. రష్యా చమురు దిగుమతులపై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని కోరారు. అమెరికా చట్టసభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడిన ఆయన తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని వ్యాఖ్యానించారు. ఇవే తన చివరి మాటలు కావొచ్చంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. 300 మంది అమెరికా చట్టసభ సభ్యులతో జెలెన్‌స్కీ దాదాపు గంటపాటు సంభాషించారు.తాను రాజధాని కీవ్‌లోనే ఉన్నానని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. తమ గగనతలాన్ని నో`ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోను మరోసారి విజ్ఞప్తి చేశారు. అనంతరం మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన స్వాతంత్య్రాన్ని వదులుకునేందుకు ఉక్రేనియన్లు సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు. ఆక్రమణదారుల నుంచి మాతృభూమిని కాపాడుకుంటామని ప్రతినబూనారు. ‘‘రష్యా దళాలతో ప్రతిఘటన ఆపడం లేదు. స్వదేశానికి వెళ్లాలని రష్యన్‌ సేనల ముందు ఉక్రేనియన్లు నినదిస్తూనే ఉన్నారు. ఆక్రమణదారులను మా భూభాగం నుంచి వెళ్లగొడతాం. రష్యా దళాలకు ఎదురవుతున్న నిరసన వారికి అవమానకరం. మా ఉక్రెయిన్‌ భూమిలో ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాం. ఉక్రేనియన్లు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. శత్రువు ప్రవేశించిన అన్ని నగరాల్లో పోరాడతాం’’ అంటూ జెలెన్‌స్కీ ఆవేశపూరిత ప్రసంగం చేశారు.
మేరియుపొల్‌, వోల్నవాఖ నగరాల్లో నేడు కాల్పులకు విరామం..?
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్య తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య జరుగుతోన్న భీకర పోరులో వేల మంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా రెండు దేశాల సైన్యం కాల్పులు విరమణకు అంగీకరించాయి. ఇందులో భాగంగా శనివారం కొద్దిసేపు విరామం ప్రకటించినప్పటికీ రష్యా సేనలు మళ్లీ దాడులు మొదలుపెట్టాయి. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో ఆదివారం నాడు ఈ విరామం కొనసాగిస్తామని రష్యా ప్రకటించింది. ముఖ్యంగా మేరియుపొల్‌, వోల్నవాఖ నగరాల్లో కాల్పుల విరామం ఉంటుందని వెల్లడిరచింది.ఇదిలాఉంటే, తరలింపు ప్రక్రియలో ఉక్రెయిన్‌ వంచనకు పాల్పడుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించారు. దేశ ఉనికినే ఉక్రెయిన్‌ ప్రశ్నార్థకం చేసుకుంటోందని, అది జరిగితే దానికి పూర్తిగా ఆ దేశానిదే బాధ్యత అవుతుందని చెప్పారు. విదేశీయుల సురక్షిత తరలింపు సహా అన్ని అంశాలపై మూడో విడత చర్చలకు తాము సిద్ధమని రష్యా విదేశాంగ పేర్కొంటోంది. ఓవైపు ఇలా చెబుతూనే ఉక్రెయిన్‌కు సముద్రంతో సంబంధాలు తెగిపోయేలా మేరియుపొల్‌ను దిగ్బంధం చేయడానికి రష్యా మరిన్ని ఆయుధాలను ప్రయోగిస్తోంది.