సమాజవారధులు.. చైతన్యసారధులు జర్నలిస్టులు

 
` ప్రభుత్వవిప్‌ రేగకాంతారావు
హైదరాబాద్‌,మార్చి 6(జనంసాక్షి):గ్రావిూణ ప్రాంతాల్లో జర్నలిస్టులు సమాజ సేవకుల వలే పనిచేస్తుంటారని, ఎన్నో కష్టాలను దిగమింగుతూ విధులు నిర్వర్తిస్తున్నారని ప్రభుత్వ విప్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు అన్నారు.ఆదివారం నాడు భద్రాచలంలో జరిగిన టీయుడబ్ల్యుజె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వార్తల సేకరణలో విలేకరుల శ్రమ వెలకట్టలేనిదన్నారు. తమ జిల్లాలో విలేకరుల కనీస అవసరాలు తీర్చేందుకు తనవంతు కృషిచేస్తానని ఆయన హావిూ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ మాట్లాడుతూరాష్ట్రంలో దీనస్థితిలో ఉన్న గ్రావిూణ విలేకరుల జీవితాలపై పాలకులు దృష్టిసారించి వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.రాత్రి పగలు శ్రమించే విలేకరుల సంక్షేమాన్ని అటు యాజమాన్యాలు, ఇటు ప్రభుత్వం విస్మరించడం విచారకరమని విరాహత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులు విలాసవంతమైన జీవితాలను ఆశించడం లేదని, కనీస అవసరాలైన గూడు, ఆరోగ్య భద్రత, పిల్లలకు ఉచిత విద్యను కోరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ తమ సంఘానికి సుదీర్ఘ చరిత్ర ఉందని, వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమానికి గత 60 ఏండ్లుగా రాజీలేని పోరాటాలు చేస్తూ వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు రాంనారాయణ, ఏ.రాజేష్‌ , తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికలు, మేగజైన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు యూసుఫ్‌ బాబు, ఖమ్మం జిల్లా సీనియర్‌ నాయకులు ప్రసేన్‌, వెంకట్రావ్‌, వనం వెంకటేశ్వర్లు, ఖాదర్‌ పాషా, ఏనుగు వెంకటేశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుండి సుమారు 400మంది జర్నలిస్టులు హాజరయ్యారు.