తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఇకలేరు


` ఊపిరితిత్తుల సమస్యకు చిక్సితపొందుతూ కన్నుమూత
` నిజాం పాలకులను వణికించిన వీరనారి
` ఆమెపై రూ.10వేల రివార్డు ప్రకటించిన నైజాం సర్కార్‌
` ఆమె మృతికి సీఎం కేసీఆర్‌, సిపిఎం నేతల సంతాపం
` నేడు నల్లగొండలో అంత్యక్రియలు
హైదరాబాద్‌,మార్చి 19(జనంసాక్షి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్న మల్లు హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె 13 ఏళ్ల వయస్సులో సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొదటి మహిళ స్వరాజ్యం కావడం గమనార్హం. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డికి స్వరాజ్యం స్వయాన చెల్లెలు కాగా.. మల్లు వెంకటరెడ్డి సతీమణి స్వరాజ్యం.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలుగా వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలుగా కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం(91) అందరికీ సుపరిచితం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం.. హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం మృతిపట్ల సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యానికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సాయధ పోరాటం సమయంలో ఆమెపై నిజా ప్రభుత్వం రూ. 10 వేల రివార్డును ప్రకటించింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో స్వరాజ్యం జన్మించారు. ఆమె నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచారు. 1945`48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాట విరమణ తర్వాత తుంగదుర్తి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె పోరాట సమయంలోనూ ఆ తర్వాత రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ’నా మాటే తుపాకీ తూటా’ అనే పేరుతో స్వరాజ్యం ఆత్మకథలు రాశారు. మల్లు కుటుంబానికి వందలాది ఎకరాల భూమి ఉంది. వీరిది భూస్వామ్యం కుటుంబం కావడంతో.. 1945` 46లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును స్వరాజ్యం గడగడలాడిరచారు. 1947` 46లో స్వరాజ్యం ఇంటిపై నైజాం గుండాలు దాడులకు పాల్పడ్డారు. మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మల్లు స్వరాజ్యం మహిళ కమాండర్‌గా పని చేశారు. అంఉదకే అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యంను పట్టిస్తే రూ. 10 వేలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. ఆమె భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. 1978 `83 వరకు, 1983`84 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1947` 46 వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. ఆమె సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయస్థాయి నాయకురాలిగా పనిచేశారు. వీరి చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్‌ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు చిన్న కుమారుడు మల్లు నాగార్జున్‌ రెడ్డి సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు.మల్లు స్వరాజ్యం మృతి పట్ల స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదల పక్షాన నిలబడిన నాయకురాలు స్వరాజ్యం అని స్పీకర్‌ గుర్తు చేశారు. నైజం గుండాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన యోధురాలు మల్లు స్వరాజ్యం అని కొనియాడారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్‌ పోచారం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తుంగతుర్తి గడ్డ అందించిన గొప్ప బిడ్డ.. మల్లు స్వరాజ్యం: సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. సాయుధ పోరాటానికి తుంగతుర్తి గడ్డ అందించిన గొప్ప బిడ్డ.. స్వరాజ్యం అని కొనియాడారు. మల్లు స్వరాజ్యం అహర్నిశలు ప్రజల కోసం కృషి చేశారన్నారు. గొప్ప మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటుగా పేర్కొన్నారు. ఆమె గమనం, గమ్యం రేపటి తరానికి స్ఫూర్తి అని తెలిపారు. మల్లు స్వరాజ్యం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.‘‘తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం గారి మృతి బాధాకరం. ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. మల్లు స్వరాజ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ ` మంత్రి హరీశ్‌రావు
‘‘అణగారిన వర్గాలను చైతన్యపరిచి.. నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడి.. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి..నిష్క్రమించిన కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం గారి మరణం తీరని లోటు..వారితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ లాల్‌ సలాం...’’ ` రేవంత్‌ రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్‌.‘‘నిజాం వ్యతిరేక పోరాటంలో ముఖ్య భూమిక పోషించి, తుపాకీ పట్టిన వీరవనిత మల్లు స్వరాజ్యం. ఆమె మరణం వామపక్షాలకు, రాష్ట్రానికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ ` చాడ వెంకట్‌ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.‘‘మల్లు స్వరాజ్యం మృతి తీవ్రమైన బాధను కలిగించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమెది కీలక పాత్ర. శాసనసభ్యురాలిగా రైతులు, శ్రామికులు, పేద ప్రజల తరఫున వాణి వినిపించారు. వేలాది మంది మహిళలకు, కమ్యూనిస్టు కార్యకర్తలకు ఆమె స్ఫూర్తి. చివరిదాకా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమె ఒక అరుదైన పోరాట యోధురాలు’’ ` సురవరం సుధాకర రెడ్డి.‘‘మల్లు స్వరాజ్యం మరణం బాధాకరం. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరువలేనిది. తుపాకీ పట్టుకుని ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత. పేదల పక్షాన ఆమె చేసిన పోరాటాలు చిరస్మరణీయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధ ఉద్యమంలో మల్లు స్వరాజ్యం పాత్ర మరువలేనిది. మహిళల సమస్యలపైన తుదిశ్వాస వరకు గళమెత్తిన గొప్ప నాయకురాలు. మల్లు స్వరాజ్యం లేకపోవడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు’’` బండి సంజయ్‌.‘‘చివరివరకు నమ్మిన సిద్ధాంతం కొసం పని చేసిన వ్యక్తి మల్లు స్వరాజ్యం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం వారి పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తి. ఆమె మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు’’ ` కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి .‘‘తెలుగు మహిళా శక్తికి ప్రతిరూపమైన మల్లు స్వరాజ్యం పరమపదించారని తెలిసి ఎంతో బాధపడ్డాను. పీడిత ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటం అనుపమానమైనది. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలిగా వారు అందించిన సేవలు మరువలేనివి’’ `ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.‘‘మల్లు స్వరాజ్యం పేరు వింటే సాయుధ పోరాటం గుర్తుకువస్తుంది. సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరవనిత స్వరాజ్యం. కమ్యూనిస్టు ఉద్యమానికి, సీపీఎంకు ఆమె మరణం తీరని లోటు’’ ` తమ్మినేని వీరభద్రం