కెసిఆర్‌ జనరంజక పాలనతో పల్లెల అభివృద్ది


గ్రామాల్లో అన్ని కులవృత్తులకు ఆర్థిక ప్రోత్సాహకాలు

ఉచిత కరెంట్‌, ఎరువులు, సాగునీటితో రైతులకు దన్ను
మంత్రి వేమలు ప్రశాంతరెడ్డి వెల్లడి
నిజామబాద్‌,మార్చి4(జనం సాక్షి )  సీఎం కేసీఆర్‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, జనరంజక పాలనతో నేడు తెలంగాణ పల్లెలు ఆర్థికంగా పరిపుష్టంగా మారాయని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో,దూర దృష్టితో గ్రామాల్లో అన్ని కుల వృత్తులకు ఆర్థిక ప్రోత్సాహ కాలు అందించడం, రైతులకు పెట్టబడి సాయం,24 గంటల ఉచిత కరెంట్‌, సకాలంలో ఎరువులు, సాగునీరు ఇవ్వడం వల్ల తెలంగాణ పల్లెలు ఆర్థికంగా బలంగా ఎదిగాయని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం విూడియాతో మాట్లాడారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్ర జీడీపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింద న్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో రూ.5లక్షల కోట్లు ఉంటే నేడు రూ.11 లక్షల కోట్ల వృద్ధికి చేరుకుందని చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం 130శాతం పెరిగిందన్నారు. రాష్ట్ర పౌరుని వ్యక్తిగత తలసరి ఆదాయం 2014 లో లక్షా 28వేలు ఉంటే నేడు 2లక్షల 78వేలకు పెరిగిందన్నారు. బాల్కొండ నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో అంతర్గత సి.సి రోడ్ల కోసం ఈ పదిహేను రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 23 కోట్ల 5 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన18 గ్రామ పంచాయతీలకు 3కోట్ల60 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు.
ఆయా మండలాల స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. కళ్ల ముందు అభివృద్ధి కన్పిస్తున్నా బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు బాల్కొండ నియోజకవర్గ ప్రజల తరుఫున మంత్రి వేముల కృతజ్ఞతలు తెలిపారు.