డిసెంబర్‌లోగా అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం


` పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న భారీ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహా పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ లోగా ప్రతిష్టిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. పీవీ మార్గ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహా పనులను కేటీఆర్‌ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గత 8 నెలలుగా అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నేతృత్వంలో పనులను ఎప్పటికప్పుడు సవిూక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు దేశానికే తలమానికంగా నిలవనున్నది. పర్యాటక రంగాన్ని ఆకర్షించేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పర్యాటక రంగం పుంజుకుంటుందని తెలిపారు. అంబేద్కర్‌ ఆశయాలను సీఎం కేసీఆర్‌ కొనసాగిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సాధ్యమైందని మంత్రి స్పష్టం చేశారు. అంబేద్కర్‌ ఆశయాలు దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మహనీయుడు కలలుగన్నట్టు అందరికీ మేలు జరగాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.