.శ్రీలంక నుంచి కొనసాగుతున్న వలసలు

 



` ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతున్న శరణార్థులు
కొలంబో,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత కొన్ని వారాల్లో అనేక మంది శ్రీలంక వాసులు తమిళనాడుకు వలసలు వస్తోన్నట్లు సమాచారం.ఈ విషయం ఇప్పుడు దక్షిణ భారత దేశంలో కలకలం సృష్టిస్తోంది. పెరుగుతున్న అంతర్జాతీయ రుణాలు, కరోనా వైరస్‌ వ్యాప్తి, కరెన్సీ విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల కొనుగోలు కష్టతరం కావడంతో ఆకలితో అలమటిస్తూ అక్కడి ప్రజలు వలసల బాట పడుతున్నారు. కిలో బియ్యం రూ.500, కిలో పంచదార రూ. 290 ఉంది. ఆకాశానంటుతున్న ధరలతో కొనుగోలు శక్తి పడిపోయి ప్రజలను నిరాశతో వీధిన పడేలా చేసింది. గత నెలలో శ్రీలంక నుంచి వలస వచ్చిన కొంతమంది ప్రజలు తమిళనాడులోకి ప్రవేశిస్తూ రామేశ్వరం తీరం దగ్గర పోలీసులకు చిక్కారు. దర్యాప్తులో వారు శ్రీలంకకు చెందిన వారమని, ప్లాస్టిక్‌ బోటుకు రూ.50 వేలు చెల్లించి అతికష్టం విూద భారత్‌కు చేరుకున్నామని చెబుతున్నారు. వారిపై విదేశీ చట్టం, పాస్‌పోర్టుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.శరణార్థులకు ఆవాసాలు కల్పించడానికి తీర ప్రాంత రక్షక దళం కసరత్తులు చేస్తోంది. ఖాళీ స్థలాలను వెతుకుతోంది. రోజువారి వేతన కార్మికులుగా పనిచేసే వారికి ఉపాధి కల్పించి రక్షణ దళం పర్యవేక్షణలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటోంది.