ALL NEWS

 1.లైఫ్‌సైన్స్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ ఎదిగింది
` నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటు..
` కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలి..
` దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశంలో మంత్రి కేటీఆర్‌
దావోస్‌,మే23(జనంసాక్షి): కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్‌ సైన్సెస్‌ మెడికల్‌ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.లైఫ్‌ సైన్సెస్‌ మెడికల్‌ రంగానికి ఊతం ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారతదేశంలో కొంత తక్కువ మద్దతు ఉందన్నారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడాలంటే భారత లైఫ్‌ లైసెన్స్‌ రంగం బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందని పేర్కొన్నారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో జరిగిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంస్కరణలపై కేటీఆర్‌ వివరించారు.’’లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ ఎదిగింది. దీనిని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ని ‘హైదరాబాద్‌ ఫార్మా సిటీ’ పేరుతో ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదు. భవిష్యత్తులో లైసెన్స్‌ ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్‌ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లైఫ్‌ సైన్సెస్‌లో హైదరాబాద్‌ ఇతర నగరాలకంటే ముందుంది. భవిష్యత్తులో నూతన మందుల ఆవిష్కరణ ప్రయోగశాలను దాటి డిజిటల్‌ డ్రగ్‌ డిస్కవరీ వైపు లైఫ్‌ సైన్సెస్‌ ముందుకు వెళ్తోంది. ఇందుకోసం ఐటీ, ఫార్మా రంగం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో ఉన్న నొవార్టీస్‌కు రెండో అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సులభతరంగా విధానాలు ఉండాలి. ఎందుకంటే ఈ రంగంలో ఆవిష్కరణలపైన పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్‌తో కూడుకున్నవి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవగా ముందుకు కదలాలి. ఈ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న దశాబ్దకాలం పాటు భారత లైఫ్‌ సైన్సెస్‌ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మందుల తయారీపైనే కాకుండా నూతన మందులను తయారు చేసే దిశగా కృషి చేస్తే బాగుంటుంది. భారతదేశంలో నైపుణ్యానికి కొదువలేదు. ప్రభుత్వాలు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోని ఔత్సాహికులకు సహకారం అందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో ఉన్న ప్రముఖ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పని చేస్తుంది’’ అని కేటీఆర్‌ వివరించారు.
హైదరాబాద్‌లో పెట్టుబడికి స్విస్‌రే అంగీకారం
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో భాగంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్‌ వివరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలో 160 ఏండ్ల నాటి బీమా సంస్థ స్విస్‌ రే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ కేంద్రంగా.. ప్రపంచంలోని 80 ప్రాంతాల్లో స్విస్‌ రే కంపెనీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు హైదరాబాద్‌ కేంద్రంగా నిలిచిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. స్విస్‌ రే కంపెనీకి ఘన స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ఈ ఆగస్టులో హైదరాబాద్‌లో స్విస్‌ రే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ కంపెనీ 250 మందితో ప్రారంభం కానుందది. డాటా, డిజిటల్‌ కెపబిలిటీస్‌, ప్రొడక్ట్‌ మోడలింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ పై దృష్టి సారించనుంది. ఈ సందర్భంగా స్విస్‌ రే కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


2.హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌
` అనివార్యకారణాల వల్ల నిర్ణీత  షెడ్యూల్‌ కన్నా ముందే నగరానికి ముఖ్యమంత్రి
హైదరాబాద్‌,మే23(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢల్లీి పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 వరకు కేసీఆర్‌ ఢల్లీిలోనే ఉండాల్సింది.అటు తర్వాత బెంగళూరు, రాలేగావ్‌ సిద్ధి, షిర్డీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల కేసీఆర్‌ నిర్ణీత షెడ్యూల్‌ కన్నా ముందే హైదరాబాద్‌ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఢల్లీి నుంచి చండీగఢ్‌ వెళ్లి పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ను కూడా కలిశారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు, గాల్వన్‌ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌, అఖిలేశ్‌ యాదవ్‌లతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ చర్చించారు.


3.రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవం
హైదరాబాద్‌,మే23(జనంసాక్షి): రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో వద్దిరాజు రవిచంద్ర ఎన్నికను ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించింది.అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న బండ ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. బండ ప్రకాష్‌ స్థానంలో రవి 2024 ఏప్రిల్‌ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. తనకు అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వద్దిరాజు కృతజ్ఞతలు తెలిపారు. జూన్‌లో పదవీకాలం ముగియనున్న డీఎస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు స్థానాల భర్తీ కోసం రేపు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. తెరాస అభ్యర్థులు బండి పార్థసారథిరెడ్డి, దామోదర్‌ రావు బుధవారం ఉదయం 11 గంటలకు నామినేషన్లు వేయనున్నారు.



4.మాస్కులేకుండానే అంత్యక్రియల్లోపాల్గొన్న కిమ్‌
` పెద్ద ఘనకార్యంలా ప్రచారం చేసుకొన్న ఆ దేశ విూడియా సంస్థ
ప్యాంగ్యాంగ్‌,మే23(జనంసాక్షి):ఉత్తర కొరియాలో కరోనా లక్షణాలతో లక్షల సంఖ్యలో ప్రజలు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత ముఖానికి కనీసం మాస్క్‌కు కూడా లేకుండా ఓ సైనిక జనరల్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఆ విషయం ఓ పెద్ద ఘనకార్యంలా ఆ దేశ విూడియా సంస్థ కేసీఎన్‌ఏ ప్రచారం చేసుకొంది. కిమ్‌ తండ్ర మరణం తర్వాత ఉ.కొరియాలో జరిగిన అతిపెద్ద అంత్యక్రియల కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.ఉ.కొరియాకు చెందిన పీపుల్స్‌ ఆర్మీలోని మార్షల్‌ హయోన్‌ చాల్‌ హెయ్‌ మృతి చెందారు. ఆయన ప్రస్తుత నియంత కిమ్‌జోంగ్‌ ఉన్‌కు అత్యంత నమ్మకస్తుడు. కిమ్‌ జోంగ్‌ ఇల్‌ మరణించిన తర్వాత అధికారం కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు దక్కేట్లు చేసిన కీలక సైనిక జనరల్‌ ఆయనే. 1950`53 మధ్యంలో కిమ్‌ ఇల్‌ సంగ్‌కు కూడా ఆయన బాడీగార్డ్‌గా పనిచేశాడు.ఇటీవల ఆ దేశంలో కరోనా లక్షణాలు ప్రబలిన సమయంలోనే పలు శరీర అవయవాలు పనిచేయకపోవడంతో హయోన్‌ మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలకు కిమ్‌ ఆదివారం హాజరయ్యారు. హయోన్‌ భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటికను స్వయంగా మోశారు. ఈ సమయంలో మిగిలిన అధికారులు మాస్కులు ధరించినా.. కిమ్‌ మాత్రం ధరించలేదు. ప్యాంగ్‌యాంగ్‌ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో వేల మంది పాల్గొన్నారు.ప్రస్తుతం ఉత్తరకొరియాలో 28 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అక్కడి ప్రభుత్వ విూడియా వెల్లడిరచింది. మృతుల సంఖ్యను మాత్రం పేర్కొనలేదు. ఏప్రిల్‌ 25వ తేదీన జరిగిన మిలటరీ పరేడ్‌లో వేలమంది ప్రజలు మాస్కులు లేకుండా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా కొవిడ్‌ కేసుల వ్యాప్తి పెరిగిపోయింది. సోమవారం కొత్త అక్కడ 1,67,650 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు కేసీఎన్‌ఏ విూడియా పేర్కొంది.


5.సీనియర్‌ సిటిజన్లకు రైళ్లల్లో రాయితీ ఇవ్వండి
` రైల్వే మంత్రికి కేరళ ఎంపీ విజ్ఞప్తి
దిల్లీ,మే23(జనంసాక్షి): రైళ్లలో వయో వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించాలని కేరళ సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వమ్‌ కేంద్రాన్ని కోరారు.ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. కరోనా విజృంభణ సమయంలో రైళ్లలో సీనియర్‌ సిటిజన్ల ప్రయాణ టిక్కెట్ల రుసుములో ఇచ్చే రాయితీలను కేంద్రం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ ఎంపీ లేఖ రాస్తూ.. కరోనా వైరస్‌ పేరిట రైళ్లలో ఇచ్చే రాయితీలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది సీనియర్‌ సిటిజన్లపై పడిరదన్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రాయితీలను పునరుద్ధరించాలని సీనియర్‌ సిటిజన్లు పదే పదే డిమాండ్‌ చేస్తున్నా సవిూక్షించడం లేదని ఎంపీ లేఖలో విమర్శించారు. దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో సమర్థమైన రవాణాను అందించేలా భారతీయ రైల్వేలను స్థాపించిన ప్రాథమిక ఉద్దేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొన్నేళ్లుగా సీనియర్‌ సిటిజన్లతో పాటు దాదాపు 50కి పైగా కేటగిరీల ప్రజలు ప్రయాణాన్ని సరసమైనదిగా చేసేందుకు పలు రాయితీలు కల్పించారన్నారు. అయితే, కరోనా విజృంభణ నేపథ్యంలో రద్దు చేస్తున్నామని, దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక కొనసాగిస్తామనే పరోక్ష సంకేతాలతో రాయితీలు నిలివేశారన్నారు. దురదృష్టవశాత్తూ కరోనా పేరుతో కేంద్రం ఈ రాయితీలను శాశ్వతంగా ఎత్తివేసి దేశ ప్రజలకు నష్టం చేసిందని ఆరోపించారు.2020`2022 మార్చి మధ్య కాలంలో 7కోట్ల మందికి పైగా సీనియర్‌ సిటిజన్లు రైల్వే సేవలను ఉపయోగించడంతో ఈ రాయితీల ఉపసంహరణ ప్రభావం గణనీయంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు. అందువల్ల రైల్వేల్లో సీనియర్‌ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. అనేకమంది సీనియర్‌ సిటిజన్లు పూర్తి టిక్కెట్‌ రుసుము చెల్లించే పరిస్థితుల్లో లేరని, రాయితీ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ జీవితంలో దేశానికి ఎంతో సేవ చేసిన సీనియర్‌ సిటిజన్లంతా పదవీ విరమణ చేశాక గౌరవంగా ఉండేలా చూడటం ఎంతో ముఖ్యమన్నారు.


6.తైవాన్‌పైకి వెళితే జాగ్రత్త
` చైనాకు అమెరికా హెచ్చరిక
` దీటుగా ఎదుర్కొంటామన్న చైనా మంత్రి
బీజింగ్‌,మే23(జనంసాక్షి): చైనా దాడి చేస్తే తైవాన్‌కు తాము రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలపై చైనా ధీటుగా స్పందించింది. చైనాను ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి అమెరికాకు కౌంటర్‌ ఇచ్చారు. తైవాన్‌ విషయంలో బైడెన్‌చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తైవాన్‌ వ్యవహారం చైనా సార్వభౌమాధికారం, అంతర్గత సమగ్రతకు సంబంధించినదని మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనా రాజీపడే అవకాశమే లేదని పేర్కొన్నారు. కాగా తైవాన్‌ను చైనా బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే తైవాన్‌కు తాము రక్షణ సహాయం కల్పిస్తామని యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేగాక ప్రమాదంతో ఆటలాడుతోందని చైనాను హెచ్చరించారు. టోక్యోలో జపాన్‌ ప్రధాన మంత్రితో సమావేశమైన జో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ను తమ భూభాగంగా పరిగణిస్తోన్న చైనా.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా సాయం చేస్తుందా అనే ప్రశ్నపై బైడెన్‌ ఈ విధంగా సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా క్వాడ్‌ కూటమిలోని జపాన్‌, భారత్‌, ఆస్టేల్రియా నాయకులతో బైడెన్‌ మంగళవారం భేటీ కానున్నారు. ఇక చైనా తైవాన్‌పై దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో తమ సైనిక సంబంధాలను బలోపేతం చేయడంపై బైడెన్‌తో చర్చించినున్నట్టు జపాన్‌ ప్రధాని కిషిడా వ్యాఖ్యానించారు. బలమైన జపాన్‌.. అమెరికా`జపాన్‌ శక్తివంతమైన కూటమి ఈ ప్రాంతానికి చాలా కీలమైందని ఆయన పేర్కొన్నారు.


7.తొలిసారి యుద్ధ నేరానికి శిక్ష..
రష్యా సైనికుడికి జీవిత ఖైదు విధించిన ఉక్రెయిన్‌ కోర్టు
కీవ్‌,మే23(జనంసాక్షి): రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత తొలిసారిగా ఓ రష్యా సైనికుడికి యుద్ధ నేరం కింద శిక్ష పడిరది.ఓ నిరాయుధుడైన వృద్ధుడిని కాల్చి చంపినందుకు గానూ 21ఏళ్ల వాడిమ్‌ షిషిమారిన్‌ అనే రష్యా సైనికుడికి జీవిత ఖైదు విధిస్తూ ఉక్రెయిన్‌ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. మాస్కో సైనిక చర్య మొదలైన కొద్ది రోజులకు ఈ ఘటన జరగ్గా.. ఆ సైనికుడు నేరం అంగీకరించడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.ఫిబ్రవరి 28న సువిూ ప్రాంతంలోని ఓ గ్రామంలో వాడిమ్‌ తన కలష్నికోవ్‌ రైఫిల్‌తో కారులో నుంచి ఓ వృద్ధుడిపై గురిపెట్టి పలుమార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించి ఉక్రెయిన్‌ బృందం అవసరమైన ఆధారాలను సేకరించింది. సైనికుడు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో తేలడంతో అతడిపై కేసు నమోదు చేశారు. వాడిమ్‌ యుద్ధంలో గాయపడిన తన సహచరులను రష్యా తరలిస్తుండగా.. ఆ బృందాన్ని ఉక్రెయిన్‌ బలగాలు చుట్టుముట్టి అతడిని బందీగా తీసుకున్నాయి.విచారణ సమయంలో వాడిమ్‌ తన నేరాన్ని అంగీకరించాడు. పై అధికారుల ఆదేశం తోనే తాను ఆ వృద్ధుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపాడు. ‘’ఘటన సమయంలో ఆ వృద్ధుడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. మమ్మల్ని చూసిన అతడు మా ఆచూకీ ఉక్రెయిన్‌ బలగాలకు చెప్పేస్తాడేమోనన్న అనుమానంతో అతడిని కాల్చాలని మా పై అధికారి బలవంతం చేశాడు. అందుకే కాల్పులు జరపాల్సి వచ్చింది’’ అని వాడిమ్‌ తెలిపాడు. ఈ సందర్భంగా మృతుడి భార్యకు అతడు క్షమాపణ కూడా చెప్పాడు.




8.బీజేపీ అధికారంలోకి వస్తుందని జనం అనుకుంటున్నారు
` భాజపా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ ధీమా
హైదరాబాద్‌,మే23(జనంసాక్షి): తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి భాజాపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ ధీమా వ్యక్తం చేశారు.ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటున్నారని వెల్లడిరచారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతల సమావేశంలో తరుణ్‌ చుగ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో భాజపా కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. దేశం ఫస్ట్‌.. పార్టీ నెక్ట్స్‌.. ఫ్యామిలీ లాస్ట్‌.. అనేదే భాజపా నినాదమని చెప్పారు.’’రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేక వాతావరణం నెలకొంది. ఆయన పాలనపై ప్రజలు కోపంతో ఊగిపోతున్నారు. ఇదే విషయాన్ని భాజపా కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలి. కేసీఆర్‌ ఇచ్చిన హావిూలన్నీ తుంగలో తొక్కారు. రైతులను గోస పెడుతున్నారు. 2023లో తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తుంది. తెరాస కథ ముగుస్తుంది. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సుపరిపాలనపై ఈ నెల 30నుంచి జూన్‌ 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. తెరాస నుంచి భాజపాలోకి వచ్చేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పెద్ద ఎత్తున నాయకులు ఆసక్తి చూపుతున్నారు. కమిటీలు నియమించుకుని ఆయా నేతలను భాజపాలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని తరుణ్‌ చుగ్‌ పిలుపునిచ్చారు.


9.భారత్‌ అభివృద్ధిలో జపనీయులది కీలక భూమిక
` ప్రవాసభారతీయుల సమావేశంలో మోడీ వెల్లడి
` పలువురు దిగ్గజ కంపెనీల అధిపతులతో భేటీ
టోక్యో,మే23(జనంసాక్షి): ఇండియా అభివృద్ధి ప్రయాణంలో జపాన్‌ది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్‌, జపాన్‌ సహజ భాగస్వాములన్నారు. జపాన్‌, భారత్‌ మధ్య సాన్నిహిత్యం, ఆధ్యాత్మికత, సన్నిహిత సహకారం ఉందన్నారు. బుద్ధ భగవానుడి బాటలో నడవటం నేటి ప్రపంచానికి చాలా అవసరమని.. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం అదొక్కటేనన్నారు. ప్రవాస భారతీయులు విదేశాల్లో ఉంటున్నా మాతృభూమిని మరువకపోవడం అతిపెద్ద బలమని చెప్పారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. టోక్యోలో ప్రవాస భారతీయుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్‌ పెట్టుబడులు ముఖ్యమైన పాత్ర పోషించాయని ప్రధాని మోదీ అన్నారు.  సోమవారం ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. మరోవైపు జపాన్‌కు చెందిన 30పైగా దిగ్గజ వ్యాపార సంస్థల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు, సీఈఓలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడి అవకాశాలను వారికి వివరిం చారు మోదీ.  భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్‌ పెట్టుబడులు ముఖ్యమైన పాత్ర పోషించాయని
చెప్పారు. ఎంత పెద్ద సమస్య ఎదురొచ్చినా పరిష్కారాన్ని కనుగొనే సత్తా భారత్‌కు ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో, అనిశ్చితి వాతావరణం ఉండేదని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా భారత్‌ కోట్లాది పౌరులకు ’మేడ్‌ ఇన్‌ ఇండియా’ వ్యాక్సిన్‌లను సరఫరా చేసిందని, వందకుపైగా దేశాలకు పంపిందని చెప్పారు. ’నేను జపాన్‌ను సందర్శించినప్పుడల్లా, విూరు ఆప్యాయత చూపిస్తున్నారు. విూలో చాలా మంది జపాన్‌లో అనేక సంవత్సరాల క్రితం స్థిరపడ్డారు. ఇక్కడి సంస్కృతిని కూడా అలవరచుకున్నారు. అయితే ఇప్పటికీ భారతీయ సంస్కృతి పట్ల విూ అంకితభావం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మోదీ ప్రవాస భారతీయులతో అన్నారు. సోమవారం ఉదయం టోక్యో చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ’మోదీ మోదీ’, ’వందేమాతరం’, ’భారత్‌ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. వారితో కాసేపు మోదీ ముచ్చటించారు. చిన్నారులతోనూ మాట్లాడారు. వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లకార్డులను చిన్నారులు పట్టుకుని మోదీకి స్వాగతం పలికారు. మరోవైపు దిగ్గజ వాణిజ్య ప్రతినిధులతో భేటీ.. అయ్యారు. టెక్స్‌టైల్స్‌ నుంచి ఆటోమొబైల్స్‌ వరకు.. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు సంబంధించి 30కి పైగా జపాన్‌ కంపెనీలకు చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు, సీఈఓలతో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. భారత్‌లో సులభతర వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ఇటీవల చేపట్టిన సంస్కరణల గురించి జపనీస్‌ వ్యాపార దిగ్గజాలకు వివరించారు. సుజుకీ మోటార్‌ కార్ప్‌ ప్రెసిడెంట్‌ సుజుకీ మాట్లాడుతూ.. మోదీ జపాన్‌ పర్యటనను భారత్‌`జపాన్‌ దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. భారత ప్రధాని మోదీ సంస్కరణలు వర్ణించలేనివని, ఆయన భారతదేశాన్ని మోడల్‌ ల్యాండ్‌స్కేప్‌గా మార్చే సంస్కరణలను తీసుకు వస్తున్నారని అని సుజుకీ అన్నారు. క్వాడ్‌ నేతల శిఖరాగ్ర సదస్సులో.. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు క్వాడ్‌ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ జపాన్‌ వెళ్లారు. క్వాడ్‌ నేతలతో విడివిడిగా కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. మే 24న టోక్యోలో జరిగే క్వాడ్‌ సదస్సుకు మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని కిషిదా, ఆస్టేల్రియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ హాజరవుతారు.


10.పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ టెండర్‌ ప్రక్రియ కొనసాగించకుండా నిలువరించండి
` కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ
హైదరాబాద్‌,మే23(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పనులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెండర్‌ ప్రక్రియ చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.టెండర్‌ ప్రక్రియ కొనసాగించకుండా ఏపీని నిలువరించాలనని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌ లేఖ రాశారు.’’ట్రైబ్యునల్‌, విభజన చట్టానికి విరుద్ధంగా విస్తరణ పనులు చేపట్టడంపై గతంలోనే పలుమార్లు ఫిర్యాదు చేశాం. నిప్పులవాగు ఎస్కేప్‌ కెనాల్‌ను గెజిట్‌ నోటిఫికేషన్‌ రెండో షెడ్యూల్‌లో చేర్చాలని కూడా కోరాం. అనుమతుల్లేకుండా బనకచర్ల వద్ద ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ నిర్మాణాన్ని బోర్డు దృష్టికి తీసుకురావడంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ కేవలం 34 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకునేలా చూడాలని గతంలోనే విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ, సంబంధిత పనులకు ఈ మే 6వ తేదీన ఏపీ ప్రభుత్వం పలు టెండర్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది. మే 23 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చింది.నీరు తక్కువగా ఉన్న కృష్ణా బేసిన్‌ నుంచి పెద్ద మొత్తంలో జలాలను ఇతర బేసిన్లకు తరలించడం తీవ్ర ప్రభావం చూపుతుంది. నదీ వ్యవస్థతో పాటు జంతుజాలం, వన్యప్రాణులు, పర్యావరణం, మత్స్య సంపదపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. తద్వారా సహజ వనరులను పొందకుండా బేసిన్‌లోని ప్రజల హక్కులను కాలరాసినట్లు అవుతుంది. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోకుండా చూడాలని పదేపదే బోర్డును కోరుతున్నాం. ప్రతిపాదిత విస్తరణ పనులు శ్రీశైలం నుంచి సాగర్‌ వరకు తెలంగాణ ప్రాంతంలోని కృష్ణా బేసిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. 2014 జూన్‌ తర్వాత చేపట్టే ఏ ప్రాజెక్టు అయిన విభజన చట్టానికి లోబడే జరగేలా చూడాలి. వీటన్నింటి నేపథ్యంలో పోతిరెడ్డిపాడు విస్తరణ, సంబంధిత పనులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను ఏపీ కొనసాగించకుండా నిలువరించాలి’’ అని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.


11.భాజపా పాలన హిట్లర్‌, ముస్సోలిని కన్నా దారుణంగా ఉంది: మమత
కోల్‌కతా,మే23(జనంసాక్షి):కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.దేశంలో సమాఖ్య నిర్మాణాన్ని కూల్చివేస్తోందన్నారు. కోల్‌కతాలో ఆమె విూడియాతో మాట్లాడుతూ.. కాషాయ పార్టీ పాలన అడోల్ఫ్‌ హిట్లర్‌, జోసెఫ్‌ స్టాలిన్‌ లేదా బెనిటో ముస్సోలిని కన్నా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేసేలా చూడాలన్నారు.


12.దేశంలో మళ్లీ కలకలం రేపుతున్న కొత్త వేరియంట్‌
తమిళనాడు, తెలంగాణలో నమోదైన కేసులు
సామాజిక వ్యాప్తి ఎక్కువన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
న్యూఢల్లీి,మే23(జనంసాక్షి): భారత్‌లో ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్‌ కేసుల కలకలం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్‌లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్‌ల కేసులు ఇప్పుడు మన దేశంలోనూ వెలుగు చూడడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టి ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్వేరియంట్‌ కలకలం రేపుతోంది. భారత్‌లో బీఏ.4, బీఏ.5 సబ్‌వేరియెంట్‌ కేసులు బయటపడినట్లు ఇన్సాకాగ్‌ (ఎఔªూంఅక్షఉ) ప్రకటించింది. బీఏ.4 కేసులు తెలంగాణ, తమిళనాడు లో వెలుగు చూడగా.. బీఏ.5 కేసు తెలంగాణలోనే బయటపడిరదని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియెంట్‌లో ఉపవేరియెంట్లు బీఏ.4, బీఏ.5లు.. కరోనాలో ఇప్పటిదాకా అత్యంత వేగవంగా వైరస్‌ను వ్యాప్తి చెందించేవిగా పేరొందాయి. దక్షిణాఫ్రికా నుంచి దీని విజృంభణ మొదలైందని తెలిసిందే. అయితే ఒమిక్రాన్‌ ప్రధాన వేరియంట్‌ కంటే ఇవి ప్రమాదకారి కాదని, కాకపోతే వీటి ద్వారా సామాజిక వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. ఇన్సాకాగ్‌ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. తమిళనాడులో 19 ఏళ్ల యువతిలో బీఏ.4 ఉపవేరియెంట్‌ బయటపడిరదని, అలాగే తెలంగాణలో సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్‌లోనూ ఈ ఉపవేరియెంట్‌ వెలుగు చూసింది. మరోవైపు తెలంగాణలోనే 80 ఏళ్ల వ్యక్తికి బీఏ.5 ఉపవేరియెంట్‌ కనుగొన్నట్లు ఇన్సాకాగ్‌ తెలిపింది. ఈ వృద్ధుడికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని, పైగా వ్యాక్సినేషన్‌ ఫుల్‌గా పూర్తికాగా,కేవలం స్వల్పకాలిక లక్షణాలే బయటపడినట్లు తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన అధికారులు.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టారు. భారత్‌లో ఇప్పటికే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల ఈ రెండు సబ్‌ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సబ్‌ వేరియంట్ల వల్ల కొద్దిరోజుల్లో కేసులు పెరగవచ్చు, కానీ, ఉద్ధృతి తక్కువగానే ఉంటుందంటున్నారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవని అభిప్రాయ పడుతున్నారు. అయినప్పటికీ.. మరిన్ని వేరియెంట్లు.. అందులో ప్రమాదకరమైనవి ఉండే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్సాకాగ్‌ కరోనా వేరియెంట్‌ల కదలికలపై, కేసుల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించే కేంద్ర ఆధీన విభాగం.



13.అనిల్‌ బైజల్‌ రాజీనామా ఆమోదం
` దిల్లీకి కొత్త ఎల్జీగా వినయ్‌ కుమార్‌ సక్సేనా
` నియమించిన రామ్‌నాథ్‌ కోవింద్‌
దిల్లీ,మే23(జనంసాక్షి) దేశ రాజధాని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అనిల్‌ బైజల్‌ ఇచ్చిన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు.ఆయన స్థానంలో కొత్త ఎల్జీని నియమించారు. నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌ సక్సేనాను నియమించినట్టు రాష్ట్రపతి కార్యాలయం సోమవారం ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో అనిల్‌ బైజల్‌ ఇటీవల అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌ సక్సేనాను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వినయ్‌ కుమార్‌ సక్సేనా ప్రస్తుతం భారత ఖాదీ, గ్రావిూణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు.1958 మార్చి 23న జన్మించిన వినయ్‌ కుమార్‌ సక్సేనా.. కాన్పూర్‌ యూనివర్సిటీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. రాజస్థాన్‌లోని జేకే గ్రూప్‌ సంస్థలో అసిస్టెంట్‌ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. వైట్‌ సిమెంట్‌ ప్లాంట్‌తో వివిధ హోదాల్లో 11 ఏళ్ల పాటు పనిచేసిన అనంతరం గుజరాత్‌లోని ప్రతిపాదిత పోర్ట్‌ ప్రాజెక్ట్‌ పనులను పర్యవేక్షించేందుకు గాను 1995లో జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టి, ధోలేర్‌ పోర్టు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. అనంతరం కేవీఐసీ ఛైర్మన్‌ పదవిని చేపట్టి.. ప్రస్తుతం ఖాదీ, గ్రావిూణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు.భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. గతేడాది మార్చిలో ప్రభుత్వం జాతీయ కమిటీ సభ్యులలో ఒకరిగా వినయ్‌ సక్సేనాను నియమించింది. ఈ కమిటీకి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధాని, క్యాబినెట్‌ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు సభ్యులుగా ఉన్నారు.



రోజుకు 100 మంది చనిపోతున్నారు:  జెలెన్‌స్కీ
కీవ్‌,మే23(జనంసాక్షి): ఉక్రెయిన్‌ తూర్పు సరిహద్దుల్లో ప్రతి రోజు 50 నుంచి 100 మంది మరణిస్తున్నారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఆదివారం జరిగిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణాలు కోల్పోయినవారంతా దేశాన్ని రక్షిస్తున్నవారే అన్నారు. డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా దళాలు భీకరంగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. సివెరొడోనస్కీ నగరంపై రష్యా బలగాలు ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సును ఉద్దేశించి జెలెన్‌స్కీ మాట్లాడనున్నారు. ఈ సమావేశాలకు రష్యా అధికారులు వెళ్లడం లేదు. ఉక్రెయిన్‌ ప్రతినిధి బృందం వెళ్లినట్లు తెలుస్తోంది.