ALL NEWS

 





1.సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
` తెలంగాణ స్వరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,జూన్‌ 1(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్పూర్తితో నిర్మించుకున్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతివొక్క తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోష పడాల్సిన సందర్భం అన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజు రోజుకూ గుణాత్మక అభివృద్ధిని నమోదుచేసుకుంటున్నదని సిఎం తెలిపారు. అందుకు కేంద్రం తో సహా పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు రివార్డులు ప్రశంసలే సాక్ష్యమన్నారు. పలు విధాలుగా పథకాలను అమలు చేస్తూ ఎనిమిదేండ్ల అనతి కాలంలో ఊహించనంత సంక్షేమం, అభివృద్ధి ని సాధించామన్నారు. పరిశ్రమలు మౌలిక వసతుల కల్పన, వ్యాపార, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి నేడు దేశానికే పాఠం నేర్పుతున్నదని తెలిపారు.అత్యంత పారదర్శకతతో కూడిన ఆర్థిక క్రమశిక్షణతో, ప్రజా సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ప్రజల మేలుకోసం ధృఢమైన రాజకీయ సంకల్పంతో తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో అమలు చేస్తున్న కార్యాచరణ, అంతకు మించిన ప్రజల సహకారం.. అన్నీ కలుపుకుని ఇంతటి ఘన విజయానికి బాటలు వేసినాయన్నారు. నూతన రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆటంకం కలిగిస్తున్నా, మొక్కవోని ధైర్యంతో బంగారి తెలంగాణ సాధన దిశగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని సిఎం కెసిఆర్‌ పునరుద్ఘాటించారు

 

2.నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌లకు భారీ నజరానా
` ఇద్దరికీ రూ.2కోట్ల చొప్పున నగదు బహుమతితో పాటు ఇంటి స్థలం
` ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌,జూన్‌ 1(జనంసాక్షి):అంతర్జాతీయ క్రీడల్లో విజేతలకు తెలంగాణ సర్కార్‌ భారీ నజరానా ప్రకటించింది. తెలంగాణకు చెందిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఇషా సింగ్‌లకు రూ. 2కోట్ల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. నగదు బహుమతితో పాటు ఇంటిస్థలం కూడా కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.ఇటీవలే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌లో స్వర్ణం గెలిచి నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. ఇక దేశం తరపున నిఖత్‌ జరీన్‌ ఐదో మహిళా బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌కప్‌ షూటింగ్‌ పోటీల్లో ఈషా సింగ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. సీఎం కెసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్‌ లేదా జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈ పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.

 


3.కిన్నెర మొగిలయ్యకు రూ. కోటి, హైదరాబాద్‌లో ఇల్లు..
` ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌,జూన్‌ 1(జనంసాక్షి):పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెరమెట్ల జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్యకు రూ. కోటి నగదు పురస్కారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ మొగిలయ్య కోరుకున్నట్టుగా బీఎన్‌ రెడ్డి నగర్‌లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మొగిలయ్య కలిసిన విషయం విదితమే.దర్శనం మొగిలయ్య ఈ ఏడాది మార్చి నెలలో ఢల్లీిలో పద్మశ్రీ అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

 

4.లాభాలు వచ్చేపంటలనే సాగుచేయాలి
వాణిజ్య పంటల సాగుతో లాభాలు రెట్టింపు
ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలు
ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం
నూనెగింజల పంటలను ఎంచుకుంటే అధికలాభాలు
మూసపద్దతిలో వ్యవసాయ పద్దతులను వదులుకోవాలి
సాగుసన్నాహక సదస్సులో మంత్రలు నిరంజన్‌,జగదీశ్వర్‌ రెడ్డి
నల్లగొండ,జూన్‌ 1(జనంసాక్షి):మూస ధోరణిలో ఒకే రకమైన పంటలు పండిరచకుండా, వాణిజ్య పంటలను పండిరచేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. లాబాలు తెచ్చిపెట్టే పంటలను మాత్రమే రైతులు సాగుచేయాలన్నారు. అన్నదాతలను ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల వ్యవసాయ అధికారులకు, రైతుబంధు సమితి సభ్యులకు వానాకాలం సాగు సన్నద్ధతపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి నిరంజన్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాన ఏర్పడ్డ తరవాత ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీడు భూములన్ని పలు రకాల పంటలతో కళకళలాడుతున్నాయని తెలిపారు. 2020`21 సంవత్సరంలో 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ పండిరచిందని గుర్తు చేశారు. దేశానికే అన్నం పెట్టేస్థాయికి తెలంగాణ చేరుకోవడం మనందరికీ గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు.ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారాయి. వాటికి అనుగుణంగా తృణ ధాన్యాలు, ఉద్యానవన పంటలను కూడా పండిరచాలని మంత్రి సూచించారు. ఇవాళ నూనె గింజల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 2 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టామన్నారు. భవిష్యత్‌ లో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగును విస్తరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పత్తి అంటే హాట్‌ కేక్‌ లాగా అమ్ముడు పోతుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఆముదం పంటకు కూడా అద్భుతమైన లాభాలు వస్తాయి. పంట మార్పిడి వల్లనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. వ్యవసాయ అధికారులు పర్యటనలు చేసి, కొత్త కొత్త వ్యవసాయ విధానాలు తెలుసుకోవాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. మంచి దిగుబడి, ధర వచ్చే పంటలను సాగు చేయాలని మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి సూచించారు. రైతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలిపారు. వాణిజ్య పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయని అప్పుడే అన్ని రకాలుగా అన్నదాతలు అభివృద్ధి చెందుతారని మంత్రులు పేర్కొన్నారు. పత్తికి భారీ డిమాండ్‌ ఉందని.. వీలైనంత ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. తెలంగాణ పత్తి అంటే హాట్‌కేక్‌లా అమ్ముడు పోతుందన్నారు. రాష్ట్రంలో బీడు భూములన్నీ పచ్చగా మారాయని.. తెలంగాణలో గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని వెల్లడిరచారు. ప్రజల జీవన విధానంలో ఆహారంలో మార్పు వచ్చిందని తెలిపారు. తృణధాన్యాలు, ఉద్యాన పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం నూనెగింజల కొరత తీవ్రంగా ఉందని.. రాష్ట్రంలో నూనెగింజల సాగు పెరగాలన్నారు. దాదాపు10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు వ్యూహాత్మక అడుగులు వేయాలని నిరంజన్‌రెడ్డి వివరించారు. తెలంగాణలో వ్యవసాయానికి అన్ని రకాల వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పత్తి పంట వేయాలి. తెలంగాణ పత్తి అంటే హాట్‌కేక్‌లా అమ్ముడు పోతుంది. పత్తికి భారీ డిమాండ్‌ ఉంది. రాష్ట్రంలో నూనెగింజల సాగు పెరగాలి. ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఆయిల్‌పామ్‌లో 168 రకాల ఉప ఉత్పత్తులు ఉంటాయి. ఆయిల్‌పామ్‌ సాగుతో ఇండోనేషియా, మలేషియాకు మంచి ఆదాయం వస్తోంది. మనదేశంలో వంటనూనె ఉత్పత్తి తక్కువగా ఉంది. నూనె దిగుమతులకు ఏటా రూ.90 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. భిన్నమైన పంటలు వేయాలని రైతులను కోరుతున్నామని నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల రైతులకు సాగునీరు ఇచ్చామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. రైతుబంధు పథకం ఎంతో ఉపయోగ పడిరదన్నారు. పంటకు ధర నిర్ణయించే స్థితిలో ప్రస్తుతం రైతులు లేరని పేర్కొన్నారు. పంటధర కూడా రైతులే నిర్ణయించాలని కేసీఆర్‌ కోరుకున్నారని వివరించారు. ఈ దేశంలో వ్యవసాయాన్ని పట్టించుకున్న సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని వెల్లడిరచారు. రైతు కూడా ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందాలని కేసీఆర్‌ లక్ష్యమన్నారు. నల్గొండ జిల్లాలో 80 శాతం భూములు ఎర్రనేలలు ఉన్నాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ల్గªతులు ఎలాంటి పంటలు వేయాలనేది ఆలోచించాలి. వరి పండిరచడమే కాదు.. మెట్టపంటలు కూడా వేయాలి. రైతులు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే వేయాలి. రైతు కూడా ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందాలన్నదే కేసీఆర్‌ ఆలోచన అన్నారు. అధునాతన వ్యవసాయ విధానాలను ఎంచుకోవడం లో రైతులు ముందు వరుసలో ఉండాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి సూచించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉండేలా వ్యవసాయ అధికారులు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్ని జిల్లాలు తిరుగుతూ వానాకాలం సాగు సన్నద్ధతపై వర్క్‌ షాప్‌లను నిర్వహిం చడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో నల్లగొండ జిల్లాకు ఎక్కువగా లాభం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. 2014కు ముందు రైతులు కరెంట్‌ కోసం ధర్నాలు చేసేవారు.. కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని స్పష్టం చేశారు. చివరి ఎకరా వరకు కూడా సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఇవాళ నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, రైతుసమన్వయ సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.

 

 

5.ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా తెలంగాణ
కరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి
జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించాం
ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌
హైదరాబాద్‌,జూన్‌ 1(జనంసాక్షి):గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీరంగంలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021`22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక బుధవారం విడుదల చేశారు. హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. 2021`22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లనీ, దేశంలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్‌లో లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, తెలంగాణలో ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ నెల 20న టీ హబ్‌ రెండో దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయనిమంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు. గతేడాదిలోనే లక్షన్నర ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయని మంత్రి తెలిపారు. కరోనా ఉన్నా కూడా హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులు పెరిగాయని పేర్కొన్నారు. గతేడాది దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తే.. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర వచ్చాయని తెలిపారు. జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ సాధించాం. వన్‌ ప్లస్‌ కంపెనీ హైదరాబాద్‌లో టీవీలు తయారుచేస్తోందని కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121కు చేరిందని తెలిపారు. ఈ నెల 20న టీహబ్‌ రెండో దశ ప్రారంభిస్తామని మంత్రి వెల్లడిరచారు. టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

 

6.సోనియా, రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు..
దిల్లీ,జూన్‌ 1(జనంసాక్షి):కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది.నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో జూన్‌ 8న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా విూడియాకు వెల్లడిరచారు. ఈ కేసులో సోనియా, రాహుల్‌ స్టేట్‌మెంట్లను రికార్డు చేసేందుకు వారికి సమన్లు జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ తదితరులు నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారంటూ భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి గతంలోనే ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని ఆరోపించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్‌ బన్సాల్‌లను ప్రశ్నించింది.

 

7.ప్రధాని జీ.. ఇది సినిమా కాదు.. కశ్మీర్‌లో నేటి నిజమిదే!
దిల్లీ,జూన్‌ 1(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో కశ్మీరీ పండిరట్‌ కుటుంబానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు నిన్న కాల్చిచంపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు.కశ్మీరీ పండిట్లు తమకు భద్రత కల్పించాలంటూ ధర్నా చేస్తుంటే.. భాజపా మాత్రం ఎనిమిదేళ్ల మోదీ పాలన సంబరాల్లో తీరికలేకుండా ఉందని మండిపడ్డారు. కశ్మీర్‌లో భద్రతా సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సినిమా కాదని, అక్కడి నేడు జరుగుతున్న వాస్తవం అదేనని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు.’’కశ్మీర్‌లో గత ఐదు నెలల వ్యవధిలోనే 15 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 18 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న కూడా ఓ టీచర్‌ హత్యకు గురయ్యారు’’ అని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘కశ్మీరీ పండిరట్లు గత 18 రోజులుగా ధర్నాకు కూర్చుంటే.. భాజాపా ఎనిమిదేళ్ల మోదీ పాలన సంబురాల్లో బిజీగా ఉంది. ప్రధాని జీ.. ఇది సినిమా కాదు.. కశ్మీర్‌లో నేటి నిజమిదే’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.జమ్మూ సాంబా జిల్లాలో కశ్మీరీ పండిట్‌ల కుటుంబానికి చెందిన రజనీ బాలా (36)పై ఉగ్రవాదులు నిన్న కాల్పులు జరపడం కలకలం రేపింది. కుల్గాం జిల్లా గోపాల్‌పొరాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రజనీపై ముష్కరులు పాఠశాల వద్దే కాల్పులు జరపగా.. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు, రజనీ హత్యకు నిరసనగా కశ్మీరీ పండిట్‌లు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ క్లాక్‌టవర్‌, సోనావార్‌ తదితర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. కాజీగుండ్‌లో జమ్మూ`కశ్మీర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మైనార్టీ వర్గాలకు చెందిన ఉద్యోగులకు భద్రత కల్పించడంతో అధికార యంత్రాంగం విఫలమైందని మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా జోక్యం చేసుకుని కశ్మీర్‌ లోయలోని మైనార్టీలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

8.లఖింపూర్‌ కేసులో ప్రత్యక్ష సాక్షి దారుణ హత్య
లక్నో,జూన్‌ 1(జనంసాక్షి): లఖింపూర్‌ కేసులో ప్రత్యక్ష సాక్షి, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. లఖింపూర్‌ జిల్లాలో మంగళవారం జరిగిందీ దుర్ఘటన. బీకేయూ జిల్లా అధ్యక్షుడైన దిల్బాగ్‌ సింగ్‌ మంగళవారం రాత్రి అలిగంజ్‌`ముండా రోడ్డులో వెళ్తుండగా గోలా కొత్వాలి సవిూపంలో ఆయన ఎస్‌యూవీ కారును పంక్చర్‌ చేశారు. దీంతో ఆయన మధ్యలోనే ఆగాల్సి వచ్చింది. ఆ సమయంలోనే కాల్పులు జరపడంతో ఆయన మరణించినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది అక్టోబర్‌ 3న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రీ ప్రధాన నిందితుడిగా ఉన్న లఖింపూర్‌ ఖేరి దారుణంలో ప్రత్యక్ష సాక్షుల్లో బల్బీర్‌ సింగ్‌ ఒకరు.

 

9.ఉక్రెయిన్‌, రష్యా అధ్యక్షుల మధ్య సమావేశం సాధ్యమే..
` అందుకు ముందస్తు సన్నద్ధత అవసరం
` వెల్లడిరచిన రష్యా
` అమెరికా తీరు సరికాదని హెచ్చరిక
మాస్కో,జూన్‌ 1(జనంసాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దండయాత్ర మూడు నెలలైనా కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నప్పటికీ రష్యా బలగాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌, రష్యా అధ్యక్షుల మధ్య సమావేశం సాధ్యమేనని రష్యా అధ్యక్ష భవనం పేర్కొంది. కానీ, ఇందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని అభిప్రాయపడిరది. ఇక ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్లను అందజేస్తామని అమెరికా ప్రకటించడాన్ని తప్పుపట్టిన రష్యా.. ఇటువంటి చర్యలు రెండు అగ్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తాయని హెచ్చరించింది.ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందానికి సంబంధించిన కార్యాచరణ చాలా రోజుల కిందటే నిలిచిపోయిందని.. మళ్లీ దానిని ప్రారంభించలేదని రష్యా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. ఖెర్సన్‌, రaపోరిజియా, డాన్బాస్‌ ప్రాంతంలోని ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలన్న ఆయన.. వారు సరైన నిర్ణయం తీసుకుంటారనడంలో రష్యాకు ఎటువంటి అనుమానాలూ లేవని అన్నారు. ఈ మూడు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకోవడం వల్ల ఇరు పక్షాల మధ్య శాంతి చర్చలు ముగిసిపోతాయని ఉక్రెయిన్‌ గతంలో చెప్పిందని విూడియాతో మాట్లాడిన సందర్భంలో గుర్తుచేశారు.ఉక్రెయిన్‌కు అధునాతన రాకెట్‌ వ్యవస్థలు, యుద్ధ సామగ్రిని అందజేస్తామని అమెరికా చేసిన ప్రకటనను రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. ఈ రకమైన చర్యల వల్ల రెండు అగ్రదేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం చేయడాన్ని రష్యా తీవ్ర ప్రతికూల అంశంగానే పరిగణిస్తామని క్రెమ్లిన్‌ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉక్రెయిన్‌ విషయంలో ఓ పరిష్కారం కనుక్కోవడంలో అమెరికా ఏవిూ చేయడం లేదని.. సైనిక చర్యకంటే ముందు చాలా ఏళ్లుగా ఇదే విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది.

 

10.నీట్‌ పీజీ ఫలితాలు విడుదల
దిల్లీ,జూన్‌ 1(జనంసాక్షి):పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెలలో నిర్వహించిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష` 2022 ఫలితాలు వచ్చేశాయి.ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడిరచారు. మే 21న ఈ పరీక్ష జరగ్గా.. కేవలం పది రోజుల వ్యవధిలోనే నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎన్‌బీఈ) ఈ ఫలితాలను విడుదల చేయడం విశేషం. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మన్‌సుఖ్‌ మాండవీయ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. షెడ్యూల్‌ కన్నా ముందుగానే కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడంలో విశేష కృషి చేసిన అధికారుల పని తీరును ఆయన ప్రశంసించారు. నీట్‌ పీజీ ఫలితాలు నిపవ.వటబీ.తిని, నిజీబిపనీజీతీట.వటబీ.తినిలలో చూడవచ్చు.

 

11.ముంబయిలో కరోనా ఉద్ధృతి..
` మళ్లీ పెరుగుతున్న కొత్త కేసులు
ముంబయి,జూన్‌ 1(జనంసాక్షి):దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. గత కొన్ని వారాలుగా ఈ వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.నిన్న 506 మందికి వైరస్‌ సోకగా.. తాజాగా మరో 739 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. దీంతో ముంబయి మహానగరంలో కరోనా పాజిటివిటీ రేటు 8.4 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి 1 తర్వాత ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.బృహాన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు వెల్లడిరచిన గణాంకాల ప్రకారం.. నగరంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 8,792 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 739 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా 295 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. మరోవైపు, ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవిలో 10 కొత్త కేసులు నమోదైనట్టు బీఎంసీ అధికారులు వెల్లడిరచారు. కొత్త కేసులతో కలిపితే అక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య 37కి పెరిగింది. మే 15 వరకు ఈ మురికివాడలో జీరో కేసులే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరుగుతుండటం గమనార్హం. కరోనా మొదలైనప్పట్నుంచి ధారవిలో ఇప్పటివరకు మొత్తంగా 8,707 కేసులు నమోదు కాగా... వారిలో 8,252మంది కోలుకున్నారు. 419 మంది మృతిచెందారు.మే నెల ప్రారంభం నుంచి ముంబయిలో క్రమంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 6 తర్వాత తొలిసారి మంగళవారం 500 మార్కును దాటగా.. తాజాగా ఆ సంఖ్య 700 మార్కును దాటేసింది. ‘ముంబయిలో రోజువారీ కొవిడ్‌ కేసులు గణనీయంగా పెరిగాయి. ఓ వైపు రుతుపవనాలు సవిూపిస్తున్నందున.. లక్షణాలున్న కేసుల్లో పెరుగుదల వేగంగా కనిపిస్తోంది’ అని బీఎంసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకాలను విస్తృతంగా పంపిణీ చేయడంతోపాటు బూస్టర్‌ డోసు పంపిణీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించింది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చనే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఆస్పత్రులకు సూచించింది. పలు ప్రైవేటు ఆస్పత్రులను సైతం అప్రమత్తం చేసింది. కొన్ని వారాలుగా నగరంలో కేసులు పెరుగుతుండటంతో క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామని, పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయాలని ఆదేశించినట్టు బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌ తెలిపారు.ముంబయిలో ఇప్పటివరకు మొత్తంగా 1,71,45,476 కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 10,66,541 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 10,44,005 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 19,566 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ముంబయి నగరంలో 2,970 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.