ALL NEWS

 

1.వైద్యఆరోగ్యశాఖలో కొలువులజాతర
` మరో 1,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌
హైదరాబాద్‌,జూన్‌ 15(జనంసాక్షి):తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్‌ సర్జన్‌ జనరల్‌, ఐపీఎంలో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.

 

2.గౌరవెల్లి నిర్వాసితులతో చర్చల్లో పురోగతి
` ప్రతిపక్షాల ట్రాప్‌లో పడకండి
` సమస్యలు సృష్టించే కుట్ర చేస్తున్న కాంగ్రెస్‌, బిజెపి
` ఎకరానికి రూ.15 లక్షల పరిహారం
` ఇప్పటి వరకు 97.82 శాతం భూసేకరణ పూర్తి
` నిర్వాసితులతో చర్చించిన మంత్రి హరీష్‌ రావు
చిన్న కోడూరు,జూన్‌ 15(జనంసాక్షి):సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హావిూ ఇచ్చారు.చిన్న కోడూరు మండలం మెట్టు బండల వద్ద కాంగ్రెస్‌ నేతలు, నిర్వాసితులతో గంట పాటు చర్చలు జరిపారు. గౌరవెల్లి భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, కోదండరెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఈ సందర్భంగా మంత్రికి విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జి సరికాదని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. మేజర్లకు ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్‌కు మంత్రి హరీశ్‌రావు అంగీకరించలేదని నిర్వాసితులు తెలిపారు. మొదట గ్రామాన్ని ఖాళీ చేస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆలోచిస్తానని మంత్రి చెప్పారని వివరించారు. తమకు న్యాయం చేయాలంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.హుస్నాబాద్‌ రైతులకు నీళ్లు రావొద్దని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌, భాజపా రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ‘’నాడు మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ను అడ్డుకున్నారు. 2013 చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తాం. 3,816 ఎకరాల భూసేకరణ పూర్తయింది, ఇంకా 84 ఎకరాలే మిగిలింది. గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ.15లక్షల పరిహారం ఇస్తున్నాం. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి 937 కుటుంబాలను గుర్తించాం. నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు’’ అని మంత్రి హరీశ్‌రావు వివరించారు.

 

3.రాహుల్‌పై మూడోరోజూ ఈడీ ప్రశ్నల వర్షం
` ఒక్క పైసా తీసుకోలేదన్న కాంగ్రెస్‌ నేత
` ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ శ్రేణుల అరెస్ట్‌
న్యూఢల్లీి,జూన్‌ 15(జనంసాక్షి):నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మూడోరోజు బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.అయితే ఈడీ విచారణను నిరసిస్తూ వందలాదిమంది కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకుని స్టేషన్‌ కు తరలించారు. ఇక రెండో రోజు 10 గంటల పాటు రాహుల్‌ ను విచారించింది ఈడీ. సుమారు 80 ప్రశ్నలను ఈడీ సంధించినట్లు తెలుస్తోంది. కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ మండిపడిరది. ఈడీని కేంద్రం ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌?గా వాడుకుంటోందని, ఇప్పటిదాకా ప్రత్యర్థులపై 5 వేల కేసులు పెట్టించిందని ఆరోపించింది. సోనియా, రాహుల్‌ లపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన వెనక్కి తగ్గేది లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
ఒక్క పైసా తీసుకోలేదు: రాహుల్‌ గాంధీ
నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట విచారణకు హాజరైన కాంగ్రెస్‌ ప్రముఖ నేత రాహుల్‌ గాంధీ..యంగ్‌ ఇండియన్‌ సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పినట్లు సమాచారం. యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ (వైఐఎల్‌) లాభాపేక్షలేని దాతృసంస్థ అని.. అది కంపెనీల చట్టంలోని ప్రత్యేక నిబంధన కింద ఏర్పడిరదని స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా ఆ సంస్థ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని రాహుల్‌ గాంధీ ఈడీకి చెప్పినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.అయితే రాహుల్‌ గాంధీ వాదనను ఈడీ అధికారులు తోసిపుచ్చుతూ.. ‘2010లో యంగ్‌ ఇండియా లిమిటెడ్‌ ఏర్పడినప్పటి నుండి ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టలేదు’ అని పేర్కొన్నట్లు సమాచారం. యంగ్‌ ఇండియన్‌ ద్వారా ధార్మిక పని చేసి ఉంటే.. అందుకు సంబంధించిన పత్రాలు లేదా ఆధారాలు సమర్పించాలని అధికారులు రాహుల్‌ గాంధీని కోరినట్లు వర్గాలు పేర్కొన్నాయి.మనీలాండరింగ్‌ కేసులో సుదీర్ఘంగా ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. మధ్య మధ్యలో సమయం చిక్కినప్పుడు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న అలాగే మోదీ 10లక్షల ఉద్యోగాల ఆదేశంపై స్పందించిన ఆయన.. తాజాగా అగ్నిపథ్‌ పథకంపై ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని దుయ్యబట్టిన ఆయన.. సాయుధ బలగాల శౌర్యపరాక్రమాల విషయంలో రాజీపడకూడదంటూ వ్యాఖ్యలు చేశారు.’’భారత్‌కు రెండు వైపుల నుంచి శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్న ఇలాంటి సమయంలో ఈ అగ్నిపథ్‌ పథకం మన సాయుధ బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీ పడటాన్ని భాజపా ప్రభుత్వం మానుకోవాలి’’ అని రాహుల్‌ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. అటు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా అగ్నిపథ్‌పై విమర్శలు చేశారు. సైనికుల సుదీర్ఘకాల సేవలను ప్రభుత్వం భారంగా భావిస్తోందా? అంటూ మండిపడ్డారు.
గేట్లు తోసుకుంటూ.. కాంగ్రెస్‌ కార్యాలయంలోకి దిల్లీ పోలీసులు..!
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు.. హస్తం పార్టీ నేతల మధ్య వాగ్వాదం, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి పోలీసులు చొచ్చుకెళ్లడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేతలు.. దిల్లీ పోలీసులు భాజపా ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు.ఈ కేసులో వరుసగా మూడో రోజూ రాహుల్‌ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హస్తం పార్టీ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టింది. బుధవారం కూడా కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం, ఈడీ ఆఫీస్‌ వద్ద కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులోకి చొచ్చుకుంటూ వెళ్లి కార్యకర్తలపై దాడి చేసి, అరెస్టు చేసినట్లు కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. దీంతో ఇది తీవ్ర దుమారానికి దారితీసింది.ఈ వీడియోను కాంగ్రెస్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిరది. ‘’ఓ డిక్టేటర్‌.. గూండాయిజం చేయాలనుకుంటే ముందు ప్రజాస్వామ్య కుర్చీలో నుంచి దిగి ప్రజల ముందుకురా. ఇప్పుడు విూరు పోలీసు గూండాలను పంపిన ఈ కాంగ్రెస్‌ ఆఫీసే.. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని కూలగొట్టింది. మరి విూ దురహంకార పరిస్థితి ఏంటీ? విూ అహాన్ని మేం దెబ్బతీస్తాం’’ అని ధ్వజమెత్తింది. అటు హస్తం పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే కూడా దీన్ని తీవ్రంగా ఖండిరచారు. ‘’దిల్లీ పోలీసులు భాజపా ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలోకి బలవంతంగా చొచ్చుకుని రావడం.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చ. దేశ ప్రజలకు వ్యతిరేకంగా భాజపా ఫాసిజాన్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నారని ప్రధాని, హోంమంత్రి గుర్తుంచుకోవాలి’’ అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను దిల్లీ పోలీసులు ఖండిరచారు. ‘’పోలీసులెవరూ ఏఐసీసీ ఆఫీసులోకి వెళ్లలేదు. అక్కడ లాఠీఛార్జ్‌ చేయలేదు. మాతో సహకరించమనే మాత్రమే చెప్పాం. కానీ వాళ్లు వినట్లేదు. పోలీసులపైకి బారీకేడ్లను విసురుతున్నారు’’ అని ప్రత్యేక సీపీ హుడా తెలిపారు.మరోవైపు, ఈడీ విచారణకు వ్యతిరేకంగా నేడు ఆందోళనల్లో పాల్గొన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద నిరసన చేపట్టిన పైలట్‌, ఇతర కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కొందరు కార్యకర్తలను బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ప్రచురణకర్తగా ఉంది. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ సహా కొందరు కాంగ్రెస్‌ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దానికి యాజమాన్య సంస్థ. యంగ్‌ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్‌కు ఏజేఎల్‌ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్‌ తదితరులు కుట్ర పన్నినట్లు భాజపా నేత సుబ్రమణ్యస్వామి 2013లో ఫిర్యాదు చేశారు.

4.ఎనిమిదేళ్లలో ఆదర్శంగా తెలంగాణ
` త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం
` సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం
` కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించిన కేటీఆర్‌
ముస్తాబాద్‌,జూన్‌ 15(జనంసాక్షి): రాష్ట్రంలోని గ్రామాలు, పల్లెలను ఎనిమిదేండ్లలో దేశానికే ఆదర్శంగా నిలిపామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మనందరి బాగుకోసమే సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుప్లలెలో జరిగిన ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. రూ.33 లక్షలతో నిర్మించిన కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని అన్నారు. త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామన్నారు.ప్రతి గ్రామపంచాయతీలో తాగునీటి సౌకర్యంతోపాటు ట్రాక్టర్‌, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీలు, ప్లలె ప్రకృతి వనం, రోడ్లు, డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడిరచారు. వెంకట్రావుప్లలెలో విరాసత్‌ సహా అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. గ్రామానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. పాధి కల్పనలో దేశంలో తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతోపాటు ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడిరచారు. నలుగురికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చేవారిని ప్రోత్సహిస్తామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. దేశంలో 65 శాతం జనాభా 35 ఏండ్ల లోపువారేనని తెలిపారు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పక్రియ ప్రారంభమైందని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అన్నివిధాల అండగా ఉంటామని చెప్పారు. ఇంటింటికి తాగు నీరు ఇస్తున్నామని, ఎండా కాలంలోను చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయన్నారు. 8ఏళ్లలో తెలంగాణ గ్రామాలు,పల్లెలను దేశానికే ఆదర్శంగా నిలిపామని కేటీఆర్‌ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితీలో త్రాగునీటి సౌకర్యంతో పాటు వైకుంఠధామం, నర్సరీలు, ప్లలె ప్రకృతి వనం, రోడ్లు, డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. గ్రామంలో కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి విరాసత్‌ సహా అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారిస్తామని హావిూ ఇచ్చారు. ఇక సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ముస్తాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. అంతకుముందు మేడ్చల్‌లో కొత్తగా నిర్మించిన మినీ స్టేడియాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని మున్సిపాలిటీల్లో మినీ స్టేడియాలు ఏర్పాటుచేస్తామన్నారు. విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించాలని చెప్పారు.కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ శ్రీమతి అరుణ రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎంపీపీ జనగామ శరత్‌ రావు జెడ్పిటిసి గుండ నరసయ్య మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్‌ రా?వు.సెస్‌ డైరెక్టటర్‌ కొమ్ము బాలయ్య పోతుగల్‌ చైర్మన్శశీ లం జనబాయి పోతుగల్‌. సింగిల్విండో చైర్మన్‌ తన్నీరు బాబురావు పూర్ణచంద్రరావు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్క రాజు శ్రీనివాస్‌ టిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు

 

5.రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల
` 29 వరకు నామినేషన్ల స్వీకరణ
` జూలై18న రాష్ట్రపతి ఎన్నిక..21 ఫలితం వెల్లడి
` 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారం
న్యూఢల్లీి,జూన్‌ 15(జనంసాక్షి):భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూన్‌ 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జులై 2. ఇక రాష్ట్రపతి ఎన్నికకు జులై 18న పోలింగ్‌ నిర్వహించి, 21న ఫలితాలను విడుదల చేయనున్నారు. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జులై 24న ముగియనుంది. నోటిఫికేషన్‌ విడుదలతో దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక పక్రియ ప్రారంభమైంది. జూన్‌ 29 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశమిచ్చారు. జూన్‌ 30న నామినేషన్‌ పత్రాలను పరిశీలించనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఈ క్రమంలో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఈసీ సిద్ధమైంది. జులై 25న కొత్త ప్రెసిడెంట్‌ ప్రమాణ స్వీకరం చేయనున్నారు. భారతీయ పౌరులై ఉండి 35 ఏళ్ల వయసు కలిగిన వారు రాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చు. అయితే వారు లోక్‌ సభ సభ్యులు అయ్యేందుకు అవసరమైన అర్హతలు కలిగి ఉండటంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో గానీ, లాభదాయక పదవుల్లో కొనసాగరాదు. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ఎన్నిక ఆషామాషీ వ్యవహారం కాదు. లోక్‌ సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉండి 35 ఏండ్లు నిండిన భారత పౌరులెవరైనా రాష్ట్రపతి పదవికి పోటీ చేయొచ్చు. అయితే వారు ఏ చట్టసభల్లో ప్రతినిధిగానూ, లాభదాయక పదవుల్లోనూ ఉండకూడదు. రాజ్యసభ ఎంపీల మాదిరిగానే దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక కూడా పరోక్ష విధానంలో జరుగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. పార్లమెంటు, అసెంబ్లీల్లో నామినేటెడ్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌`324 ప్రకారం ’ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. పార్టీలు విప్‌ జారీ చేయడానికి వీల్లేదు. దేశంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు సంఖ్య 4,809 కాగా వారి ఓటు విలువ 10,86,431. ఎలక్టోరల్‌ కాలేజీలోని ప్రతి సభ్యుని ఓటుకు ఒక విలువ ఉంటుంది. ఇది ఎంపీలకు ఒక విధంగా, ఎమ్మెల్యేలకు మరో విధంగా ఉంటుంది. లోక్‌ సభలో 543, రాజ్యసభలో 233 మందితో కలుపుకొని మొత్తం 776 మంది ఎంపీలున్నారు. అన్ని రాష్టాల్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢల్లీి, పుదుచ్చేరితో కలుపుకుని మొత్తం 4,033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవానికి ఈ సంఖ్య 4,120. కానీ 2018లో కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగకపోవడంతో ఈ సంఖ్య తగ్గింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువను నిర్థారిస్తారు. తొలుత రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు. వచ్చే విలువను మళ్లీ 1000తో భాగిస్తారు. అలా వచ్చే సంఖ్యే రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువగా పరిగణిస్తారు. దేశంలోని అన్ని రాష్టాల్ర ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగించి ఓటు విలువ నిర్థారిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక ప్రపోషనల్‌ రిప్రెజంటేషన్‌ పద్ధతిలో సింగిల్‌ ట్రాన్సఫరబుల్‌ ఓటింగ్‌ విధానంలో జరుగుతుంది. అంటే ఎన్నికలో ఓటర్ల అందరికీ ప్రాతినిధ్యం ఉండేలా చూస్తారు. సింగిల్‌ ట్రాన్సఫరబుల్‌ ఓటింగ్‌ విధానంలో ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే ఓటరు బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఒకటి, రెండు, మూడు, నాలుగు ఇలా ప్రాధాన్యతలవారీగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్లు కాదు. నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఈ కోటాను నిర్ణయించేందుకు పోలైన వ్యాలిడ్‌ ఓట్లను 2తో భాగిస్తారు. ఆ సంఖ్యకు ఒకటి యాడ్‌ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రపతి బరిలో ఉన్న అభ్యర్థి గెలవాలంటే 1751 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థికి కోటా కన్నా ఎక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు వస్తే రిటర్నింగ్‌ అధికారి వారినే విజేతగా ప్రకటిస్తారు. లేనిపక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుపుతారు. అతి తక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు పొందిన అభ్యర్థిని తొలగించి వారికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులకు సమానంగా పంచుతారు. రెండో ప్రాధాన్యతా ఓట్లలోనూ ఫలితం తేలకపోతే.. తక్కువ ఓట్లు వచ్చిన వారి ఓట్లను పోటీలో ఉన్న వారికి పోలైన ఓట్లకు కలుపుతూ ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తారు. ఇలా ఎవరో ఒక అభ్యర్థి విజయం సాధించే వరకు లెక్కింపు జరుగుతుంది.

 

6.రాష్ట్రపతి ఎన్నికల బరిలోఉమ్మడి అభ్యర్థి
` మమతా బెనర్జీ నేతృత్వంలో వివిధ పార్టీల అంగీకారం
` గోపాలకృష్ణ గాంధీ, ఫరూఖ్‌ అబ్దుల్లాల పేర్లు పరిశీలన
` పోటీ చేయడానికి నిరాకరించిన శరద్‌ పవార్‌
` మమతా బెనర్జీ సమావేశానికి ఆప్‌,టిఆర్‌ఎస్‌ దూరం
న్యూఢల్లీి,జూన్‌ 15(జనంసాక్షి):రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన 17 పార్టీల విపక్ష పార్టీల భేటీలో తీర్మానం చేశారు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ’రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని విపక్ష పార్టీల నేతలు తీర్మానం చేశారు. భారత రాజ్యాంగానికి సంరక్షకుడిగా సేవ చేయగల అభ్యర్థి, ప్రజాస్వామ్యానికి, దేశ సామాజిక నిర్మాణానికి మరింత నష్టం కలిగించుకండా మోదీ ప్రభుత్వాన్ని ఆపగలిగే వ్యక్తిని నిలపాలని నిర్ణయించారని తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఆ అభ్యర్థికి ప్రతి పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సమావేశానికి హాజరుకాని వారిని సైతం సంప్రదిస్తామని, ఇది ఒక మంచి ఆరంభమన్నారు. కొన్ని నెలల తర్వాత అంతా కలిసి సమావేశమయ్యామని, భవిష్యత్తు లోనూ ఇలాంటి సమావేశాలు జరుగుతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి సహా.. దేశంలో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్షాలు ఐక్యంగా కేంద్రాన్ని ఎదుర్కోవడం వంటి అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి కాంగ్రెస్‌, టీఎంసీ, ఎన్‌సీపీ, డీఎంకే సహా మొత్తం 17 పార్టీల నేతలు హాజరవగా.. ఆప్‌, తెరాస, బీజేడీ, శిరోమణి అకాలీదళ్‌ దూరంగా ఉన్నాయి.రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే విపక్షాల సమావేశానికి గత వారం బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఏడుగురు ముఖ్యమంత్రులు సహా మొత్తం 19 రాజకీయ పార్టీలకు లేఖ రాశారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తేలేదని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తేల్చి చెప్పారు. విపక్షాల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై స్పందించారు. భేటీలో పవార్‌ అభ్యర్థిత్వాన్ని మమత ప్రతిపాదించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను ఇంకా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నానని స్పష్టంచేశారు. రాష్ట్రపతి రేసుపై శరద్‌ పవార్‌ క్లారిటీ ఇవ్వడంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌ స్టాప్‌ పడిరది. ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చించేందుకు మమత బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి 16 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. శరద్‌ పవార్‌ పోటీకి నిరాకరించడంతో మమతా బెనర్జీ మరో రెండు పేర్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాల కృష్ణ గాంధీతో పాటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లీడర్‌ ఫారూఖ్‌ అబ్దుల్లాల్లో ఒకరిని బరిలో నిలపాలని సూచించినట్లు సమాచారం.
మమతా బెనర్జీ సమావేశానికి ఆప్‌,టిఆర్‌ఎస్‌ దూరం
రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓవైపు మమతా బెనర్జీ విపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు చేస్తుంటే.. అధికార భాజపా ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం తీసుకొచ్చే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు భాజపా అప్పగించింది. ఆయన ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, విపక్షాలను ఏకం చేసేందుకు మమత బెనర్జీ బుధవారం ఏర్పాటు చేసిన భేటీకి తెరాస, ఆప్‌ దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతో రాజ్‌నాథ్‌ మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా భాజపా అగ్రనేత రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గేను కలిసి ఏకగ్రీవ అభ్యర్థిపై చర్చించారని సమాచారం. ప్రధాని మోదీ తమ అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారని రాజ్‌నాథ్‌ తనతో చెప్పినట్లు ఖర్గే వెల్లడిరచారు. ప్రభుత్వ ప్రతిపాదనలు ఏంటన్న విషయాన్ని తాను అడిగినట్లు చెప్పారు. అభ్యర్థిని ఎవరిని నిలబెడుతున్నారని అడిగానని తెలిపారు. అయితే, తనతో సంప్రదింపులు కొనసాగించే విషయంపై రాజ్‌నాథ్‌ స్పష్టతనివ్వలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాలు లేని అభ్యర్థి పేరును విపక్షాలు ప్రతిపాదిస్తే అందుకు ప్రభుత్వం మద్దతిస్తుందా అని ప్రశ్నించారు. ఏకగ్రీవంగా అభ్యర్థిని గెలిపించే అవకాశం ఉందా అని అడిగారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమవ్వాలని పిలుపునిచ్చిన బంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఆదిలోనే చుక్కెదురైంది! సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస), ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) గైర్హాజరు కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ ఈ భేటీకి వస్తున్న నేపథ్యంలో తెరాస.. భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మరోవైపు, అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే విపక్షాలకు మద్దతు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పష్టం చేసినట్లు సమాచారం. బిజు జనతా దళ్‌, శిరోమణి అకాలీదళ్‌ సైతం ఈ విూటింగ్‌కు దూరంగా ఉండనున్నాయి. తమకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ అందినా భేటీకి దూరంగా ఉండేవాళ్లమని ఎంఐఎం వెల్లడిరచింది. కాంగ్రెస్‌ కూడా ఈ సమావేశంలో భాగమవడమే ఇందుకు కారణమని తెలిపింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జులై 21న వెలువడతాయి. ఈ నేపథ్యంలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు మమత కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికలపై చర్చించేందుకు.. 22 మంది రాజకీయ పార్టీల నేతలకు మమత ఆహ్వానాలు పలికారు. ఇందులో ఏడుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు.

 

 

7.నాలుగేళ్ల తర్వాత మా పరిస్థితేంటి?
` ‘అగ్నిపథ్‌’పై పలుచోట్ల నిరసనలు!
` సాయుధ బలగాల శౌర్యపరాక్రమాల విషయంలో కేంద్రం రాజీపడొద్దని కోరిన రాహుల్‌
న్యూఢల్లీి,జూన్‌ 15(జనంసాక్షి):త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ ( ంణనితిజూజీబిష్ట్ర) పథకంపై దేశంలోని పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.నాలుగేళ్లు సర్వీస్‌ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్‌మెంట్‌కు ప్రిపేర్‌ అవుతున్న పలువురు యువకులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సైతం ట్వీట్‌ చేశారు. సాయుధ బలగాల శౌర్యపరాక్రమాల విషయంలో కేంద్రం రాజీపడొద్దని కోరారు. అలాగే, ఇంకొందరు అనుభవజ్ఞులు కూడా ఈ అంశంలో పలు కీలక సూచనలు చేస్తున్నారు.అగ్నిపథ్‌ పథకంపై బిహార్‌లోని ముజఫర్‌పూర్‌, బక్సార్‌, బెగూసరాయ్‌లో పలువురు యువకులు నిరసన వ్యక్తంచేశారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత తామంతా ఏం చేయాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. కేవలం నాలుగేళ్లు మాత్రమే సర్వీసు అంటే ఆ తర్వాత ఇతర ఉద్యోగాల కోసం మళ్లీ చదువుకొని ఇతరులతో పోటీపడాల్సి ఉంటుందన్నారు.’’భారత్‌కు రెండు వైపుల నుంచి శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్న ఇలాంటి సమయంలో ఈ అగ్నిపథ్‌ పథకం మన సాయుధ బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీ పడటాన్ని భాజపా సర్కార్‌ మానుకోవాలి’’ అని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అటు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా అగ్నిపథ్‌పై విమర్శలు చేశారు. సైనికుల సుదీర్ఘకాల సేవలను భారత ప్రభుత్వం భారంగా భావిస్తోందా? అంటూ ప్రశ్నించారు.ఈ కొత్త పథకంపై కొందరు అనుభవజ్ఞులతో పాటు పలు వర్గాల నుంచి విమర్శలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాలుగేళ్ల పాటు మాత్రమే సర్వీసులోకి తీసుకోవడంతో యువతలో పోరాట స్ఫూర్తి దెబ్బతింటుందని కొందరు వాదిస్తున్నారు. అలాగే, రిస్క్‌ తీసుకోవడంలోనూ అంత చొరవ ప్రదర్శించరని పేర్కొంటున్నారు.కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం దేశానికి గానీ, యువతకు గానీ అనుకూలంగా లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపేందర్‌ సింగ్‌ హుడా విమర్శించారు.దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలన్నారు. సాయుధ దళాల్లో నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న సైనికులకు వారి ఉద్యోగాలను శాశ్వత ఉద్యోగాలుగా హేతుబద్ధీకరించేలా కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.ఈ అంశంపై విశ్రాంత మేజర్‌ జనరల్‌ బీఎస్‌ ధనోవా రెండు కీలక సిఫారసులతో ట్వీట్‌ చేశారు. కొత్తగా నియమించుకొనే వారికి కనీసం ఏడేళ్ల పాటు సర్వీసు ఉండేలా చూడాలని, వీరిలో 50 శాతం మందిని శాశ్వత సర్వీసుల్లోకి తీసుకొనేలా చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం కొన్నేళ్లుగా ప్రిపేర్‌ అవుతున్న శివమ్‌ కుమార్‌ అనే యువకుడు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ..’’రెండేళ్లు పరుగెత్తుతున్నా. శారీరకంగా నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఇప్పుడు నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేయాలా?’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.సైనిక బలగాల రిక్రూట్‌మెంట్‌ను కేవలం ఆర్థికపరమైన కోణంలోనే చూడటం సరికాదని సీనియర్‌ ఆర్మీ అధికారి మేజర్‌ జనరల్‌ యష్‌ మోర్‌ అన్నారు.సైనికుల జీవితం, కెరీర్‌ అంశాలను ఖజానాకు డబ్బు ఆదా చేసే కోణంలో చూడొద్దని సూచించారు.కొత్త రిక్రూట్‌మెంట్‌ ప్రణాళిక ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ జీతభత్యాలు, పింఛను బిల్లులను తగ్గించుకోవడంతో పాటు ఆయుధాల సేకరణ కోసం అధిక నిధులు వెచ్చించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద కేంద్రం పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు కలిగిన దాదాపు 46 వేల మందిని నాలుగేళ్ల సర్వీసుపై ఈ ఏడాది నియమించుకోనుంది. వీరికి సర్వీసు కాలంలో నెలవారీగా రూ.30 నుంచి 40వేల మధ్య (ఇతర అలవెన్సులు మినహాయించి) చెల్లించనున్నారు. వీటితో పాటు వైద్య, బీమా సదుపాయం కూడా కల్పిస్తారు.నాలుగేళ్ల సర్వీసు తర్వాత వీరిలో కేవలం 25శాతం మంది అగ్నివీరులను మాత్రమే శాశ్వత సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తారు.వీరంతా 15 ఏళ్ల పాటు నాన్‌ ఆఫీసర్‌ ర్యాంకులో సేవలందించే వీలుంటుంది. మిగిలిన 75శాతం మంది నాలుగేళ్ల తర్వాత రూ.11 లక్షల నుంచి రూ.12లక్షల మధ్య ప్యాకేజీతో సేవల నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. పెన్షన్‌ ప్రయోజనాలూ ఉండవు.ఈ పథకంలో భాగంగా అగ్ని వీరులుగా చేరే పదో తరగతి విద్యార్థులకు 12వ తరగతి సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు సైన్యం ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ.. ఇంకా దీనిపై స్పష్టతలేదు.

 

8.దేశ వ్యవసాయ స్వరూపం మారాలి
యాంత్రీకణకు ప్రాధాన్యం ఇవ్వాలి
సాంకేతికతను పూర్తిగా వినియోగించాలి
నూతన ఆవిష్కరణలతోనే యువతకు ఉపాధి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి
హైదరాబాద్‌,జూన్‌ 15(జనంసాక్షి): దేశ వ్యవసాయ స్వరూపం మారాలని, యాంత్రీకరణ, సాంకేతికతను సంపూర్ణంగా అమలు చెయ్యాలని తద్వారా రైతుల ప్రయోజనాలుకాపాడేందుకు వీలుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాలలో నూతన ఆవిష్కరణలు, సాంకేతికతతో యువతకు ఉపాధి లభించాలని అన్నారు. దీనిమూలంగా వ్యవసాయరంగంలో యాంత్రీకరణ అందుబాటులోకి రావడమే కాకుండా, రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిడోరియంలో నిర్వహించిన అధిక సాంద్రతతో పత్తి సాగుపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సదస్సులో మంత్రి నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగులో నూతన శకానికి నాంది పలికాం, సాంప్రదాయ సాగునుండి ప్రపంచ సాంకేతికతను తెలంగాణ వ్యవసాయానికి అన్వయించు కోవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని అన్నారు.మనకున్న వ్యవసాయాన్ని ఉజ్వలమైన వ్యవసాయంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.కేవలం అధిక మోతాదులో పంటలు పండిరచడమే కాదు. అవసరమైన పంటలు, మార్కెట్‌ డిమాండ్‌ ఉన్న పంటలు, రైతుకు రాబడినిచ్చే పంటలు పండిరచాలని నిర్ణయించామన్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించి రాష్ట్ర ఆదాయం, దేశ ఆదాయం పెంచేలా తెలంగాణ వ్యవసాయం ముందుకుసాగాలని కోరారు. మూడేళ్లుగా రైతులను అప్రమత్తం చేస్తున్నాం.జిల్లాల వారీగా సదస్సులతో ఏ పంటలు వేయాలి అన్న విషయాన్ని రైతులకు వివరించాం. రైతులు కూడా పంటల వైవిద్యీకరణకు సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రపంచ అవసరాలకు సరిపడా పత్తి ఉత్పత్తి కావడం లేదు. ప్రపంచంలో పత్తి అత్యధికంగా సాగయ్యేది భారతదేశంలోనే అని చెప్పారు.3.20 కోట్ల ఎకరాలలో దేశంలో పత్తి సాగు అవుతున్నది. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాలలో తెలంగాణ, గుజరాత్‌ లు ఉన్నయననారు.ఈ సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కవిూషనర్‌ హన్మంతు, డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

9.బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళన బాట
` మంత్రులు చెప్పినా వెనక్కి తగ్గని విద్యార్థులు.. వర్షంలోనూ నిరసన
` స్పందించిన మంత్రి కేటీఆర్‌
` విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా
` సమస్యలపై నేడు వీసీతో సమావేశమవుతామన్న మంత్రి సబిత
బాసర,జూన్‌ 15(జనంసాక్షి):నిర్మల్‌లోని బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం 10గంటల నుంచి ఈ ఆందోళన కొనసాగుతోంది.అధికార యంత్రాంగం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ మధ్యాహ్నం క్యాంపస్‌కు చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపినా.. సమస్య కొలిక్కి రాలేదు. రాత్రి 8 గంటల సమయంలో జోరును వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా దాదాపు 5వేల మంది విద్యార్థులు క్యాంపస్‌ మెయిన్‌ గేటు వద్ద బైఠాయించారు.గత కొన్ని సంవత్సరాలుగా బాసర ట్రిపుల్‌ ఐటీ.. ట్రబుల్‌ ఐటీగా మారింది. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు గత కొన్నేళ్లుగా గళం విప్పుతున్నప్పటికీ అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఏటా విద్యార్థులు ఆందోళనకు దిగడం.. ఆ తర్వాత అధికారులు సముదాయించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు. మొత్తం 12 డిమాండ్లను వారు తెరపైకి తెచ్చారు. ‘’సీఎం కేసీఆర్‌ ఒకసారి బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శిస్తే విద్యార్థుల సమస్యలు తెలుస్తాయి. ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌ హైదరాబాద్‌లో ఉండటంతో ఇక్కడి సమస్యలు పట్టించుకోవడంలేదని, రెగ్యులర్‌ వైస్‌ ఛాన్సలర్‌ను నియమించాలి’’ అని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. మధ్యాహ్నం విద్యార్థులతో చర్చలు జరిపిన జిల్లా కలెక్టర్‌ తమ పరిధిలో ఉన్న అంశాలను పరిష్కరిస్తానని, మిగిలినవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని విద్యార్థులకు హావిూ ఇచ్చారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
సమస్యలు పరిష్కరిస్తాం: సబితా ఇంద్రారెడ్డి
బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల డిమాండ్లలో కొన్ని ఆశ్చర్యంగా ఉన్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. బెంచీలు, విద్యుత్‌, పంబ్లింగ్‌, యునిఫాం వంటి వాటికోసం ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, వాటిని సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కరోనా వల్ల విద్యా వ్యవస్థకు ఆటంకం ఏర్పడిరదని.. అన్ని సమస్యలు పరిష్కారిస్తామని తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు పిల్లలు డిమాండ్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాలు ఎక్కడ చేయాలో అక్కడ చేద్దామని.. పిల్లలను ప్రశాంతంగా ఉండనీయాలని హితువు పలికారు.’’ల్యాప్‌ టాప్‌, మహిళా కేర్‌టేకర్‌ వంటివి తప్పకుండా పరిష్కరిస్తాం. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, ఇలా ఆందోళనలకు దిగొద్దు. విద్యార్థులు కెరీర్‌పై దృష్టి రేపటి నుంచి తరగతులకు హాజరుకావాలి. ఎవరో ఏదో చెప్పారని బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రతిష్టను చెడగొట్టవద్దు’’ అని మంత్రి సబితా కోరారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులతో మంత్రులు సవిూక్షించారు. ఇన్‌ఛార్జి వీసీ రాహుల్‌ బొజ్జా, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి హాజరయ్యారు. విద్యార్థులతో చర్చించి చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్‌ కలెక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రులు ఆదేశించారు.
బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళనపై స్పందించిన కేటీఆర్‌
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్జీయూకేటీ`బాసరలో 8వేల మంది విద్యార్థులు రోడ్డుపై కూర్చున్నారని.. ఈ విషయంలో స్పందించాలంటూ బత్తిని తేజగౌడ్‌ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.వెంటనే స్పందించిన మంత్రి.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. విద్యలో నాణ్యత పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని.. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ హావిూ ఇచ్చారు.మరోవైపు ఈ అంశంపై కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు మంత్రి సబిత స్పందించారు. బాసర ఆర్జీయూకేటీ సమస్యలపై ఇవాళ వీసీతో సమావేశమవుతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

 

 

11.భారత్‌, ఇజ్రాయెల్‌, యూఏఈ, అమెరికాలతో సరికొత్త గ్రూపు..!
న్యూఢల్లీి,జూన్‌ 15(జనంసాక్షి):ఇండియా, ఇజ్రాయెల్‌, యూఏఈ, అమెరికా కలిసి ఏర్పడిన ఐ2యూ2 గ్రూపు తొలిసారి వర్చువల్‌గా భేటీ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా మిత్ర బృందాల్లో మార్పులు చేసుకొని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగానే బైడెన్‌ కార్యవర్గం సదస్సు నిర్వహిస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడిరచింది.భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నెహ్యాన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెఫ్తాలి బెన్నెట్‌ హాజరుకానున్నారు. ఆహార సంక్షోభం, ఇతర అంశాల్లో సహకారంపై వీరు చర్చించనున్నట్లు సమాచారం.జులై 13`16 మధ్య జోబైడెన్‌ మధ్యప్రాచ్యంలో పర్యటించనున్నారు. అదే సమయంలో ఈ వర్చువల్‌ భేటీ జరగనుండటం విశేషం. అధ్యక్షుడు బైడెన్‌ ఈ మూడు దేశాలతో ప్రత్యేక బంధాన్ని కోరుకొంటున్నారని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ మాట్లాడుతూ.. ఈ మూడు దేశాలు టెక్నాలాజికల్‌ హబ్‌లని అభివర్ణించారు. ‘’భారత్‌ అతిపెద్ద వినియోగదారులు ఉన్న మార్కెట్‌. అంతేకాదు హైటెక్‌ వస్తువులు తయారు చేయగలదు. ఈ దేశాలన్నీ పలు రంగాల్లో కలిసి పనిచేయాల్సి ఉంది. అది టెక్నాలజీ, వాణిజ్యం, వాతావరణం, కొవిడ్‌`19, భద్రతా రంగంలో సమష్టిగా పనిచేయాలి’’ అని పేర్కొన్నారు.మధ్యప్రాచ్యం పర్యటనలో భాగంగా జోబైడెన్‌ 50 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టనున్నారు. ఆయన యువ సెనెటర్‌గా ఉన్నప్పుడు ఈ దేశంలో పర్యటించారు. మొత్తం ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్‌, వెస్ట్‌బ్యాంక్‌, సౌదీ అరేబియాల్లో ఆయన ఆగనున్నారు.

13.మళ్లీ 8 వేలకుపైగా కొత్త కేసులు..
` ముందురోజు కంటే 33 శాతం అధికంగా..!
` 53 వేలకు పైగా క్రియాశీల కేసులు
దిల్లీ,జూన్‌ 15(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.తాజాగా మరోసారి 8 వేలకు పైగా కేసులు రాగా.. ముందురోజు కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి. క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచిన గణాంకాల ప్రకారం..మంగళవారం 4.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 8,822 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. క్రితంరోజు ఆ సంఖ్య 6,594గా ఉంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 2,956, కేరళలో 1,986, దిల్లీలో 1,118 మందికి కరోనా సోకింది. హరియాణా, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్‌ విస్తరిస్తోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 4.32 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు.దీంతో క్రియాశీల కేసులు 53,637కి ఎగబాకాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.12 శాతానికి పెరిగింది.24 గంటల వ్యవధిలో 5,718 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 98.66 శాతం మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. నిన్న 15 మంది మరణించగా.. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.ఈ ఏడాదిన్నర కాలంలో 195 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. అందులో నిన్న 13.58 లక్షల మంది టీకా తీసుకున్నారు.