కేంద్రం నిర్ణయాలతో..  దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలోపడింది


- మహిళల ఆర్థిక స్వాలంబనకై తీసుకుంటున్న చర్యలు శూన్యం
- రెండేళ్లలో మహిళలపై దాదాపు 38000 అకృత్యాలు
- సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌
విజయవాడ, నవంబర్‌8 (జనంసాక్షి)  : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారి పోయేలా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ అన్నారు. శుక్రవారం విజయవాడ వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.. ఓ మహిళ ఆర్థిక మంత్రి పదవి చేపట్టినప్పటికీ మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఆమె తీసుకుంటున్న చర్యలు శూన్యమని విమర్శించారు. గత రెండేళ్లలో మహిళలపై దాదాపు 38000 అకృత్యాలు జరిగాయన్నారు. నేను జాతీయ నేర గణాంక లెక్కల ప్రకారమే ఈ వివరాలు చెబతున్నానని, కొన్ని రాష్టాల్ల్రో ఏకంగా ఎమ్మెల్యేలపై అత్యాచార కేసులు నమోదు అయ్యాయన్నారు. వీరిలో కొంత మంది స్వావిూజీలు కూడా ఉన్నారని నరేంద్ర మోదీ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ విూద కోలుకోలేని దెబ్బ పడిందన్నారు. గత 60 ఏళ్లుగా ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదని విమర్శించారు. ' గ్రావిూణ భారత దేశం పనులకోసం ఎదురు చూస్తుంది.  బీజేపీ హయాంలో భారతదేశం నేర దేశంగా ఎదుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా.. మోదీ సర్కారు తలాక్‌ బిల్లుపై చూపిన శ్రద్ధ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఎందుకు చూపడం లేదని బృందాకారత్‌ ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు అధికార పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాగా నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు సీపీఎం ఆధ్వర్యంలో మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు బృందాకారత్‌ తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.