ఆర్థిక విధానాలపై సవిూక్ష అవసరం


మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నా చర్యలు తీసుకోవడంలేదు. రఘురామరాజన్‌ లాంటి వారు చేస్తున్న సూచనలు చెవికెక్కడం లేదు. పోనీ దేశంలో ఆర్థికరంగ నిపుణులకు కొదవలేదు. వారి సలహాలైనా తీసుకుని ఉంటే గండం గట్టెక్కించే ఉపాయం చేపట్టవచ్చు. అయితే అలాంటి ప్రయత్నాలు జరుగతున్న జాడ కానరావడం లేదు. ఆర్థిక కసరత్తులతో వచ్చే బడ్జెట్‌కు రూపకల్పన చేస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కనీసంగా అయినా ఈ దుష్ఫలితాలపై సలహాలు తీసుకుంటున్నారా అన్నది కూడా అనుమానంగానే ఉంది. కిందిస్థాయిలో ఏం జరుగుతందో తెలుసుకోలేని ప్రధాని మోడీ కేవలం తాను అనుసరించిన ఆర్థిక విధానాలను ప్రజలు ఆమోదించారన్న ధోరణిలో ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉందన్న వాదనలుచేస్తున్నారు. నిజానికి ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి సమస్యలు రావు. ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నా ధరలు మాత్రం దిగి రావడం లేదు. దిగుమతులు అదేపనిగా పెరగడం వల్ల కూడా ఆర్థిక మాంద్యానికి కారణంగా చూడాలి. ఎగుమతులు తగ్గడం వల్ల కూడా విదేశీమారక ద్రవ్యం భారం పెరుగు తోందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దివంగత మాజీప్రధాని పివి నరసింహారావు పుణ్యమా అని ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణలు దేశ ప్రజలను గడపదాటి బయటకు వెళ్లేలా చేశాయి. ప్రజలు ప్రపంచాన్ని చూసేలా చేశాయి. ప్రపంచం భారత్‌ వైపు చూసేలా చేసింది. పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడ్డాయి. ప్రపంచ మార్కెట్లు భారత్‌కు చేరాయి. అలాగే మన మార్కెట్లు జోరందుకున్నాయి. మన వస్తువులు విదేశాలకు చేరాయి. సరళీకృత ఆర్థిక విధానాలు సామాన్యుడికి కడుపునిండా భోజనం పెట్టేలా చేశాయి. ప్రతి వస్తువును కొనుగోలు చేసేలా చేశాయి. కానీ మోడీ అనుసరిస్తున్న విధానాల కారణంగా కేవలం కార్పోరేట్‌ శక్తులు బలపడుతున్న తీరు ప్రజలను కలచి వేస్తోంది. పేద,సామాన్య ప్రజలు ఎంతగా చితకి పోతున్నారో గమనించడం లేదు. జిఎస్టీ కారణంగా వస్తువల ధరలు పెరిగితే ఎవరికి నష్టమో ఎందుకు ఆలోచన చేయడం లేదు. దేనిని వదలకుండా జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చినంత మాత్రాన, ప్రభుత్వ ఆదాయం పెరిగినంత మాత్రాన ఆర్థిక సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయంటే ఎవరిని వంచించడానికి అన్నది ఆలోచన చేయాలి. ప్రజా నాయకులైతే ఇలాంటి విధానాలు పరిశీలన చేసుకోవాలి. ప్రజలకు గుజరాత్‌ మోడల్‌ అంటూ ప్రచారం చేసి, ప్రధాని పదవిని చేపట్టిన మోడీ తీరు కారణంగా ఆర్థిక మందగమనం ప్రజలకు శాపంగా మారింది. ఇలాగే ముందుకు సాగితే ప్రజల్లో ఉన్న అసంతృప్త జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల్లో నివురుగప్పిన అసంతృప్తిని గమనించి సర్దుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గమనించాలి. ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని తొలగించలేకపోతున్నామని గమనించాలి. ప్రధాని మోడీ ఛరిష్మా, పాలనా సంస్కరణలు బాగా ఉంటే ఇటీవలి మహారాష్ట్రలో ఫలితాలు అనుకూలంగా ఉండేవి. కేవలం రాహుల్‌ను, కాంగ్రెస్‌ను తిట్టిపోస్తూ రాజకీయం చేయడమే పాలన కాదు. పాలనలో కొత్త ఒరవడి సృష్టించాలి. ప్రజలకు మేలు జరిగేల సంస్కరణలు ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఆహరధాన్యాల ధరలు తగ్గాలి. సంస్కరణలంటే ఇవే తప్ప మరోటి కాదని గుర్తుంచుకోవాలి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ధరలను, నేటి మార్కెట్‌ ధరలను ఎందుకు బేరీజు వేసుకోవడం లేదో ప్రధాని మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలి. మోడీ అనుసరిస్తున్న పిడివాద సంస్కరణల ఫలితమని గుర్తించాలి. తాము అనుసరిస్తున్న సంస్కరణలు ఎక్కడ దారితప్పాయో గమనించాలి. పివి నరసింహారావు లాగా సంస్కరణలు ప్రజలకు


ఎందుకు మేలు చేయలేకపోతున్నాయో పరిశీలన చేయాలి. ఇప్పటికైనా నోట్లరద్దు,జిఎస్టీ విపరిణామాలను విశ్లేషించుకోవాలి. దేశంలో అసాధారణ రీతిలో ఆర్థికమాంద్యం పెరిగిపోవటంపట్ల ఆయా రాష్టాల్ర ఆర్థికమంత్రులు ఆందోళన వ్యక్తంచేశారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) దారుణంగా పడిపోతున్నదన్నారు. జీడీపీ ఏటా భారీగా తగ్గుతూ వస్తున్న విషయాన్ని జిఎస్టీ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జీడీపీ 8.2 శాతం నుంచి 4.5 శాతానికి పడిపోవటం ఆందోళనకర పరిణామంగా అభివర్ణించారు. బ్యాంకుల బకాయిలు, నిరర్థక ఆస్తులు పెరిగిపోవటం పరిస్థితిని మరింత దిగజారుస్తున్నదని చెప్పారు. కేంద్రం సంక్షేమ పథకాలను తగ్గించి, రాష్టాల్ర మ్యాచింగ్‌ గ్రాంట్లను పెంచడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్రం గతంలోలాగే మ్యాచింగ్‌ గ్రాంట్లను భరించాలని కోరారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు తగ్గడంవల్ల రాష్టాల్రకు కలిగిన ఇబ్బందులను మంత్రి సమావేశంలో ప్రస్తావించారు. గ్రాస్‌ ట్యాక్స్‌ రెవెన్యూలో 31శాతంతగ్గగా, రాష్టాల్ర సొంత రాబడిలో 47శాతం వరకు లోటు ఏర్పడిందని విశ్లేషించారు. ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ నిధులను రాష్టాల్రకు కేటాయించే విధానంలో మార్పు తీసుకురావాల్సిన అవసరమున్నదని సూచించారు. విమర్శలను హెచ్చరికగా తీసుకుని ముందుకు సాగితే తప్ప మనలేమని గుర్తించి ప్రజలకు మేలుచేసే సంస్కరణలను అమలు చేయాలి. అప్పుడే బిజెపి తన అస్తిత్వాన్ని నిలుపుకోగలదు.