శరణార్థులతో నడ్డా భేటీ


విపక్షాల ఆందోళనపై మండిపాటు


న్యూఢిల్లీ,డిసెంబర్‌19 (జ‌నంసాక్షి):  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏని అమలు చేసి తీరుతామని, భవిష్యత్‌లో ఎన్‌ఆర్‌సీని కూడా తీసుకొస్తామని ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన సిక్కు శరణార్థులతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విపక్షాలు ఆందోళన చేస్తున్నాయని నడ్డా మండిపడ్డారు. అదే సమయంలో పొరుగుదేశాల నుంచి వచ్చిన మైనారిటీల గురించి ఆలోచించడం లేదన్నారు. ఎవరైతే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్లంతా వీళ్లను కలవాలన్నారు. దేశంలో 28-30 ఏళ్లుగా వారు ఉంటున్నా పౌరసత్వం లేని కారణంగా ఓ ఇల్లు కొనుగోలు చేయలేక పోతున్నారని, కనీసం తమ పిల్లల్ని బడుల్లో చేర్చలేకపోతున్నారని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల తప్ప వారికి ఇలాంటివేవీ కనిపించవన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ ముందుకు సాగుతోందని, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేసి తీరుతామని నడ్డా స్పష్టంచేశారు.