నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి

- నేను టీడీపీ సభ్యుడిగా ఉండలేక పోతున్న
- స్పీకర్‌కు వల్లభనేని వంశీ విజ్ఞప్తి
- ప్రత్యేక సీటు కేటాయిస్తూ స్పీకర్‌ తమ్మినేని నిర్ణయం
- అభ్యంతరం తెలిపిన టీడీపీ సభ్యులు
- చంద్రబాబు వర్సెస్‌ స్పీకర్‌ మధ్య వాగ్వివాదం
- వాకౌట్‌ చేసిన టీడీపీ సభ్యులు
అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. మంగళవారం సభలో కశ్చన్‌ అవర్‌ ప్రారంభం కాగానే సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యే వల్లభనేని అంశం ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అసెంబ్లీలో వల్లభనేని వంశీ  మాట్లాడుతూ.. తాను టీడీపీతో కలిసి ఉండలేక పోతున్నానని, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు వంశీ అవకాశం ఇవ్వటంపై స్పీకర్‌ను ప్రశ్నించారు. కశ్చన్‌ అవర్‌లో వంశీ మాట్లాడేందుకు ఎలా సమయం ఇస్తారని ప్రశ్నించారు. వంశీ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీంతో వంశీ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తానకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినంత మాత్రాన తనను సస్పెండ్‌ చేస్తారా? అంటూ చంద్రబాబును సభలోనే నిలదీశారు. తాను అనేక సందర్భాల్లో సీఎం జగన్‌ను కలిశానని, పోలవరం కాలువ సమస్యలపై ఆయనతో చర్చించినట్లు వంశీ గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు, పోలవరం కుడి కాలువ రైతులు గురించి సీఎం జగన్‌ను కలిశానని, నా నియోజకవర్గ సమస్యలు సీఎంకు చెప్పుకున్నానని, మానవతా దృక్పథంతో సీఎం సానుకూలంగా స్పందించారని వంశీ తెలిపారు. తరువాత నాపై చంద్రబాబు సోషల్‌ విూడియాలో తప్పుడు ప్రచారం చేశారని, సీఎం ఇంగ్లీష్‌ విూడియం పెట్టడాన్ని స్వాగతించానన్నారు. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. వరదలు వలన ఇసుక తీయడం ఇబ్బంది అని చెప్పానని, నేను టీడీపీ సభ్యుడునే నాకు మాట్లాడే హక్కు లేదా అంటూ నేను టీడీపీతో ఉండలేనని అన్నారు. కాగా టీడీపీ సభ్యులు వంశీని అడ్డుకోవడంపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా సభలో మాట్లాడే హక్కు వంశీకి ఉందని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే హక్కు టీడీపీ సభ్యులకు లేదని హెచ్చరించారు. అనంతరం వంశీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం వంశీ విజ్ఞప్తిని పరిశీలించిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. అసెంబ్లీ నిబంధనల ప్రకారం.. వల్లభనేని అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపారు. ఎక్కడ సీటు కావాలంటే అక్కడ కేటాయిస్తామన్నారు. అసెంబ్లీ కార్యదర్శికి సీటు కేటాయించాలని ఆదేశించారు.
చంద్రబాబు వర్సెస్‌ స్పీకర్‌..
స్పీకర్‌ తమ్మినేని- టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నెలకొంది.  వంశీ కి ప్రత్యేక సీటు కేటాయిస్తామని స్పీకర్‌ చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు స్పీకర్‌ తమ్మినేని స్పందిస్తూ.. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో విూరు ఏం చేశారో అన్నీ తెలుసని మండిపడ్డారు. గతంలో ఎన్టీఆర్‌కు ఇదే విషయంలో అన్యాయం జరిగిందని, ఆ పాపంలో నేనూ పాలు పంచుకోవటం వల్ల 15యేళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని స్పీకర్‌ అన్నారు.  వైసీపీ ఆఫీసన్న విపక్ష నేత మాటలు వెనక్కి తీసుకోవాలని ఆయన తెలిపారు. సభపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. అసెంబ్లీ ప్రజల జాగీర్‌ మాత్రమేనని స్పీకర్‌ స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.