ప్రణాళిక మేరకు పనుల గుర్తింపు


రెండో విడతకు సిద్దంగా భద్రాద్రి జిల్లా


కార్యాచరణ సిద్దం చేస్తున్న కలెక్టర్‌


భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌31(జనం సాక్షి) : జనవరి 2 నుంచి ప్రారంభం  కానున్న ప్రణాళికను సమర్థంగా మరోమారు అమలుచేసేందుకు  జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ముమ్మరంగా కొనసాగేలా చేసేందుకు  కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ పూర్తిస్థాయి దృష్టి సారించారు. గ్రామ, మండల ప్రత్యేక అధికారులు, పర్యవేక్షణలో గ్రామసభ ద్వారా తయారుచేసుకున్న ప్రణాళికను ప్రతీ గ్రామం ప్రాధాన్యతాంశాల ప్రకారం పనులు చేసేలా సిద్దం చేశారు. తొలిదశలో కార్యాచరణ ప్రణాళిక ప్రారంభమైన నాటి నుంచి కలెక్టర్‌ ప్రతీ గ్రామాన్ని చుట్టివచ్చారు. ఉదయం నుంచి గ్రామాలను చుట్టి స్వచ్చగ్రామాలుగా చేసి రాష్ట్రంలోనే జిల్లాను కార్యాచరణ ప్రణాళికలో అగ్రస్థానంలో తీసుకెళ్లాలనే తపనతో పనిచేసారు. కొత్త సంవత్సరంలో 2వ తేదీ నుంచి మరో విడత ప్రారంభంకానున్న ప్రణాళిక కోసం మళ్లీ సిద్దం అవుతున్నారు. గ్రామ, మండల ప్రత్యేక అధికారులు కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దం అయ్యారు.  ప్రతీ గ్రామంలో పంచాయతీ ప్రత్యేక అధికారితో పాటు మండల ప్రత్యేక అధికారులు పాల్గొని కార్యాచరణను పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో కలియ తిరుగుతూ అటు ప్రజల్లో, ఇటు అధికారుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేయనున్నారు. మున్సిపాలిటీల్లో కూడా స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్లు యుద్ధ ప్రాతిపదికన మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు సిద్దం చేస్తున్నారు. మొక్కలు నాటడం నుంచి మురుగు కాలువలను శుద్ధి చేయడం, నిల్వ నీటిని, పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలను తొలగించడం వంటి పనుల కొనసాగిస్తున్నారు. తొలుత పారిశుధ్య పనులు చేపట్టిన అధికారులు డంపింగ్‌, గ్రేవ్‌యార్డుల స్థలాల గుర్తింపు, బురదమయమైన అంతర్గత రోడ్ల నవీనీకరణ వంటి పనులతో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బిజీ కానున్నారు. స్వచ్ఛతెలంగాణెళి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన సందేశం, స్ఫూర్తితో పల్లెలు ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. జిల్లాలో ఆదర్శగ్రామంగా తమ ఊరు ముందుండాలని ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో గ్రామాల పరిశుభ్రత, పచ్చదనానికి ప్రణాళికతో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పాలుపంచుకున్నారు. తొలుత తమ పరిసరాలను శుభ్రం చేసుకొని తద్వారా గ్రామ పరిశుభ్రతకు పాటుపడాలనే కాంక్షతో సాగారు. తెలంగాణకు హరితహారం భాగంగాలో ప్రతీ గ్రామంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు నర్సరీ ఏర్పాటు చేశారు. ఎక్కడా చెత్తాచెదారం లేకుండా, మురుగు కాలువల్లో పేరుకుపోయిన నీటిని తొలగించారు. ఫలితంగా పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు అదే స్ఫూర్తితో ముందుకు సాగనున్నారు.